మరోవారం స్పెషల్ డ్రైవ్.. ధ‌ర‌ణి ద‌ర‌ఖాస్తుల గ‌డువు పెంపు

ధరణి పోర్టల్‌లో పెండింగ్ సమస్యల పరిష్కారానికి మరో వారం రోజుల గడువును పెంచారు.

మరోవారం స్పెషల్ డ్రైవ్.. ధ‌ర‌ణి ద‌ర‌ఖాస్తుల గ‌డువు పెంపు

హైద‌రాబాద్ : ధరణి పోర్టల్‌లో పెండింగ్ సమస్యల పరిష్కారానికి మరో వారం రోజుల గడువును పెంచారు. ఈ నెల 9వ తేదీతో గ‌డువు ముగియ‌గా, పెండింగ్ ద‌ర‌ఖాస్తుల‌ను 40 శాతం కూడా పరిష్కరించలేకపోయారు. దాంతో ధరణి కమిటీ సోమవారం సచివాలయంలో మరోసారి భేటీ అయ్యింది. పెండింగ్ అప్లికేషన్లు కూడా క్లియర్ చేయలేకపోతే మున్ముందు చేపట్టబోయే భూ పరిపాలన మార్పుల అమలు కష్టమవుతుందని భావించింది. అందుకే ఈ నెల 17వ తేదీ వరకు రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ ని పొడిగిస్తూ సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.


గడిచిన 11 రోజుల్లోనూ కేవలం రెవెన్యూ సిబ్బందితోనే డ్రైవ్ కొనసాగించారు. ధరణి కమిటీ సూచించినట్లుగా పారా లీగల్స్, కమ్యూనిటీ సర్వేయర్లు, పంచాయతీ సెక్రటరీలు, వ్యవసాయ విస్తరణాధికారులను టీమ్స్ లోకి తీసుకోలేదు. సిబ్బంది కొరత కారణంగానే ఇన్నాండ్లుగా పరిష్కారం ఆలస్యమైందని చెప్పుకొస్తున్నట్లు రెవెన్యూ అధికారులు టీమ్స్ ఏర్పాటులో భేషజాలకు వెళ్తున్నారు. సీసీఎల్ఏ ఆదేశాలను ఏ జిల్లా కలెక్టర్ కూడా అమలు చేయలేదని స్పెషల్ డ్రైవ్స్ టీమ్స్ రూపకల్పన ద్వారా స్పష్టమైంది.

అందుకే 11 రోజులైనా 2.45 లక్షల దరఖాస్తుల్లో లక్ష కూడా సరిగ్గా పరిష్కరించలేకపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. రెండో దఫా డ్రైవ్ లోనైనా 100 శాతం అప్లికేషన్లు క్లియర్ చేస్తారేమో వేచి చూడాలి. పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న సీసీఎల్ఏ ఆదేశాలు, మార్గదర్శకాలు ఈ వారంలోనైనా అమలు చేస్తారా? అన్న చర్చ మొదలైంది. పైగా ఇప్పటి దాకా పరిష్కరించిన దరఖాస్తులు కూడా గతంలో తహశీల్దార్ల నుంచి కలెక్టర్లకు రిపోర్టులు పంపినవే. అసలైన అప్లికేషన్లు పెండింగులోనే ఉంచారు. ఇక కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలో పరిష్కరించాల్సిన ఫైళ్లు కదలడం లేదు.

ప్ర‌స్తుతం 2.45 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో..

ఈ సంద‌ర్భంగా ధ‌ర‌ణి క‌మిటీ స‌భ్యులు భూమి సునీల్ స‌చివాల‌యంలో మీడియాతో మాట్లాడారు. ధరణి పెండింగ్ దరఖాస్తులపై వారం రోజుల పాటు ప్ర‌భుత్వం స్పెషల్ డ్రైవ్ చేసిందని తెలిపారు. ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం సీసీఎల్ఏ 2020లో సర్కిలర్ ఇచ్చారు. దరఖాస్తులన్ని పరిష్కరించే అధికారం జిల్లా స్థాయి అధికారికి మాత్రమే అవకాశం ఉండే. ఆ సర్కిలర్‌ను మారుస్తూ వికేంద్రీకరణ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తహసీల్దార్ నివేదిక లేకుండా ఏ దరఖాస్తు పరిస్కారం చేయడానికి వీలు లేకుండా పెట్టారు.

ఏ నిర్ణయం తీసుకున్నా తప్పని సరిగా ఉత్తర్వులు ఉండాల్సిందే. ధ‌రణి మాడ్యూల్లో మార్పులు జరుగుతున్నాయి. ప్ర‌స్తుతం 2 లక్షల 45 వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వారం రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో లక్ష దరఖాస్తుల నివేదికలు రెడీ అయ్యాయి. దీంతో స్పెష‌ల్ డ్రైవ్ ఈ నెల 17 వ‌ర‌కు పొడిగించారు. ధరణి శాశ్వ‌త‌మైన మార్పుల దిశగా ధరణి కమిటీ పని చేస్తుంది. ధరణి సమస్యల పరిష్కరానికి త‌మ‌ వంతు తాము కృషి చేస్తామ‌న్నారు. తొందరలోనే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామ‌న్నారు. ధరణి సమస్యలపై కొన్ని చట్టాల్లో, మరి కొన్ని సాఫ్ట్ వేర్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంద‌ని భూమి సునీల్ తెలిపారు.

ఎంపీ సంతోష్‌కు నిషేధిత జాబితాలో ఉన్న భూమి ఎట్లా వ‌చ్చింది..?

అనంత‌రం కోదండ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తప్పుల తడకగా ఆద‌రాబాద‌ర‌గా భూ రికార్డులు చేశారు. కేటీఆర్ బంధువు రామలింగరావు కుటుంబీకుడికి ధరణి పోర్టల్ ఇచ్చారు. ఎంసీ సంతోష్‌కు నిషేధిత జాబితాలో ఉన్న భూమి ఎట్లా వచ్చిందని ప్ర‌శ్నించారు. అక్కడ ఉండే  గ్రామస్తులందరివి నిషేధిత జాబితాలో ఉంటే ఒక్క సంతోష్‌కు ఎలా పట్టా అయ్యింద‌ని అడిగారు. ధరణి కమిటీ లోపాలపై అప్పట్లో సీఎస్‌కు అనేక వినతి పత్రాలు ఇచ్చాము. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతుల సమస్యలు శాశ్వత పరిస్కారం కోసం పని చేస్తున్నాం. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు పార్ట్ బీని తీసుకొచ్చారు. పార్ట్ బీలో 18 లక్షల ఎకరాలు ఉందన్నారు. 2020లో తెచ్చిన రెవెన్యూ చట్టంలో అనేకమైన లోపాలు ఉన్నాయి. అంచెలంచెలుగా అన్ని సమస్యలు పరిస్కారం దిశగా ముందుకెళ్తున్నామ‌ని కోదండ‌రెడ్డి పేర్కొన్నారు.