TSRTC | దసరాకు.. 5,265 ప్రత్యేక బస్సులు

విధాత : దసరా, బతుకమ్మ పండుగలకు సొంతూర్లు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ మేరకు 5265 పైగా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లుగా ప్రకటించింది. అయితే ఈ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయమని ఆర్టీసీ ఎండి సజ్జనర్ తెలిపారు. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
గత ఏడాదికంటే వెయ్యి బస్సులు అదనంగా నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ, 23న మహార్నవమి, 24 దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి, రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. హైదరాబాదులో ఎంజిబీఎస్, జేబీఎస్‌లతో పాటు రద్దీ అధికంగా ఉండే కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్ ,ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు.
ప్రతిరూట్లో ప్రతి పది నిమిషాలకు ఒక సిటీ బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్టోబర్ 21 నుంచి 23 వరకు రెగ్యులర్, స్పెషల్ సర్వీస్ లను ఎంబీబీఎస్ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా నడపాలని నిర్ణయించిందన్నారు.
ప్రత్యేక బస్ సర్వీసులో ముందస్తు రిజర్వేషన్లను తమ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. దసరా స్పెషల్ సర్వీస్ లకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టిఎస్ఆర్టిసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-6944 00 00…040-23450033 నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు.