TSRTC | సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించిన ఆర్టీసీ విలీన బిల్లు వివాదం

TSRTC RTC Bill గవర్నర్ బిల్లు ఆమోదించాలంటు కార్మికుల నిరసన రెండు గంటల బంద్‌.. రాజ్‌భవన్ ముందు బైఠాయింపు ఐదు అంశాలపై వివరణ కోరిన గవర్నర్‌ అభ్యంతరాలపై వివరణ పంపిన ప్రభుత్వం అందలేదన్న గవర్నర్‌ కార్మిక సంఘాలతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ చర్చలు ప్రస్తుత అసెంబ్లీ సెషన్‌లోపునే ఆమోదిస్తానంటు గవర్నర్ హామీ బిల్లుపై మరిన్ని వివరణలు కోరిన గవర్నర్‌ విధాత: ఆర్టీసీ విలీన బిల్లు వివాదం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించేలా సాగుతుంది. ఆర్టీసీ బిల్లు కేంద్రంగా గవర్నర్ […]

  • By: krs    latest    Aug 04, 2023 11:59 PM IST
TSRTC | సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించిన ఆర్టీసీ విలీన బిల్లు వివాదం

TSRTC

RTC Bill

  • గవర్నర్ బిల్లు ఆమోదించాలంటు కార్మికుల నిరసన
  • రెండు గంటల బంద్‌.. రాజ్‌భవన్ ముందు బైఠాయింపు
  • ఐదు అంశాలపై వివరణ కోరిన గవర్నర్‌
  • అభ్యంతరాలపై వివరణ పంపిన ప్రభుత్వం
  • అందలేదన్న గవర్నర్‌
  • కార్మిక సంఘాలతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ చర్చలు
  • ప్రస్తుత అసెంబ్లీ సెషన్‌లోపునే ఆమోదిస్తానంటు గవర్నర్ హామీ
  • బిల్లుపై మరిన్ని వివరణలు కోరిన గవర్నర్‌

విధాత: ఆర్టీసీ విలీన బిల్లు వివాదం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించేలా సాగుతుంది. ఆర్టీసీ బిల్లు కేంద్రంగా గవర్నర్ వర్సెస్ ప్రభుత్వమన్నట్లుగా సాగుతున్న వివాదం శనివారం కూడా అనేక పరిణామాల మధ్య ఉత్కంఠతతో కొనసాగుతుంది. గవర్నర్ తమిళ సై బిల్లుకు సంబంధించి ఐదు అంశాలపై ప్రభుత్వ వివరణ కోరింది.

వాటిలో 1958 నుంచి ఆర్టీసీ లో కేంద్ర గ్రాంట్ లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లు లో ఎలాంటి వివరాలు లేవన్నది ఒక అభ్యంతరం. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం ఆర్టీసీ స్థితి ని మార్చడం పై సమగ్ర వివరాలు బిల్లులో లేవని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం…వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడ తాయని గవర్నర్ ప్రశ్నించారు.

విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు.

ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు. అలాగే ఆర్టీసీ కార్మికుల భద్రత, భవిష్యత్ ప్రయోజనాలపై మరిన్ని స్పష్టమైన హామీలను కోరుతు గవర్నర్ ప్రభుత్వాన్ని వివరణలు అడిగారు.

వేగంగా ప్రభుత్వ వివరణ.. అందలేదన్న గవర్నర్‌

ఒకవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు శనివారం రెండు గంటల పాటు బంద్ పాటించి అన్ని డిపోల్లో నిరసనలు కొనసాగించారు. బిల్లు ఆమోదించాలన్న డిమాండ్‌తో రాజ్‌భవన్ ముట్టడికి భారీ ర్యాలీతో బయలుదేరి రాజ్‌భవన్ గేటు ముందు బైఠాయించారు.

ఆర్టీసీ కార్మికుల నిరసనలు కొనసాగుతుండగానే ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణలను గవర్నర్‌కు సమర్పించింది. దీంతో ఆర్టీసీ బిల్లు పంచాయతీ మళ్లీ రాజ్‌భవన్ కు చేరింది.

పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళ సై అంతే వేగంగా స్పందిస్తు ఆర్టీసీ విలీన బిల్లు సమస్యపై చర్చించేందుకు 10 మంది కార్మిక సంఘాల నేతలను రాజ్‌భవన్ భేటీకి ఆహ్వానించింది. పుదుచ్చేరి నుంచే గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్మిక సంఘాల నేతలతో చర్చించారు.

ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై మాట్లాడుతు కార్మికుల సంక్షేమం కోసమే నేను బిల్లులోని అంశాలపై అభ్యంతరాలను లెవనెత్తి ప్రభుత్వ వివరణ కోరడం జరిగిందని, కార్మికులు నిరసనలతో ప్రజలకు అసౌకర్యం కల్గించవద్దంటు కోరారు. ప్రభుత్వం నుంచి వివరణలు మీకు పంపించారని కార్మిక సంఘాల నేతలు థామస్‌రెడ్డి గవర్నర్‌కు వివరించగా, తమ కార్యాలయానికి వివరణలు అందలేదంటు గవర్నర్ వారికి స్పష్టం చేశారు.

ప్రభుత్వ వివరణలు అందాక వాటిని పరిశీలించి, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోపునే బిల్లును తాను ఆమోదించి ప్రభుత్వానికి పంపిస్తానంటు గవర్నర్ తమిళసై వారికి హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని గవర్నర్‌తో చర్చల పిదప ఆర్టీసీ సంఘాల నేతలు మీడియాకు వెల్లడించారు.

డ్రాఫ్ట్‌పై మరిన్ని వివరణలు

ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో గవర్నర్ చర్చల పిదప డ్రాఫ్ట్ బిల్లులోని మరిన్ని అంశాలపై ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళ సై వివరణలు కోరారు. ప్రధానంగా మరో మూడు అంశాలపై గవర్నర్ ప్రభుత్వాన్ని వివరణ కోరారు. వాటిలో ఆర్టీసీకి చెందిన భూములు, భవనాలు ఎన్ని ఉన్నాయి..డీపోల వారిగా ఉద్యోగుల సంఖ్య ఎంత..పర్మినెంట్ కాని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా అన్న అంశాలపై గవర్నర్ ప్రభుత్వ వివరణ కోరారు.

గవర్నర్ కోరిన వివరణలకు సమాధానాలిచ్చేందుకు అధికార యంత్రాంగం శనివారం రాత్రి కల్లా కూడా కసరత్తు చేస్తునే ఉంది. దీంతో గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలిపే ప్రక్రియ మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తుంది.

అటు గవర్నర్ ఆర్టీసీ బిల్లును ఆమోదించి పంపితే వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ఆమోదింపచేస్తామని బిల్లు కోసం ప్రభుత్వం ఎదురుచూస్తుంది. రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగియ్యనున్న నేపధ్యంలో ఆర్టీసీ బిల్లు గవర్నర్ నుంచి క్లియరెన్స్ అవుతుందో లేదోనన్న ఉత్కంఠత కొనసాగుతుంది.

మరోవైపు బీజేపీ నేత ఈటల రాజేందర్ ఈ వివాదంపై స్పందిస్తు ప్రభుత్వం ఆర్టీసీ బిల్లుపై రాజకీయ హడావుడి చేస్తుందని, కార్మికులను తప్పుదోవ పట్టించి గవర్నర్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించడం ద్వారా బట్టకాల్చి గవర్నర్‌పై వేసే కుట్ర చేస్తుందంటు ఆరోపించారు.