TVS Apache | అపాచీ శ్రేణిలో.. టీవీఎస్ కొత్త మోడల్! అదిరిపోయే ఫీచర్లతో RTR 310
TVS Apache | విధాత: దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ టీవీఎస్ (TVS) తన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. బైక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న అపాచీ మోడళ్ల వరసలో మరో కొత్త మోడల్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 (Apache RTR 310) పేరుతో తీసుకొచ్చే ఈ బైక్ విడుదల కార్యక్రమం దిల్లీలో జరిగింది. 312 సీసీ సామర్థ్యంతో వచ్చే ఈ బైక్ ధర సుమారు రూ.2.43 లక్షల నుంచి లభిస్తుంది. డీఓహెచ్సీ […]

TVS Apache |
విధాత: దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ టీవీఎస్ (TVS) తన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. బైక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న అపాచీ మోడళ్ల వరసలో మరో కొత్త మోడల్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 (Apache RTR 310) పేరుతో తీసుకొచ్చే ఈ బైక్ విడుదల కార్యక్రమం దిల్లీలో జరిగింది. 312 సీసీ సామర్థ్యంతో వచ్చే ఈ బైక్ ధర సుమారు రూ.2.43 లక్షల నుంచి లభిస్తుంది.
డీఓహెచ్సీ ఇంజిన్ సాంకేతికతతో దీనిని డిజైన్ చేశారు. పిస్టన్ను అల్యూమినియం లోహంతో తయారు చేయడంతో తేలికగా ఉండి 9,700 ఆర్పీఎం, 28.7 టార్క్‌ను అవలీలగా ఉత్పత్తి చేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. 2.81 సెకన్లలో 60 కి.మీ. వేగాన్ని అందుకుంటుందని, ఎటువంటి వైబ్రేషన్లు లేకుండా గంటకు 150 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొన్నాయి.
అపాచీ మోడళ్లలో ఆర్టీఆర్ 310కి తొలిసారిగా క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ రైడ్ మోడ్లు, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ తదితర అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నారు. ఈ మోడల్ ఆరు గేర్లతో రానుండగా.. రైడర్ భద్రతకు పెద్దపీట వేస్తూ ఏబీఎస్, స్లిప్పర్ క్లచ్, లీనియర్ ట్రాక్షన్ క్లచ్, రియర్ లిఫ్ట్ ప్రొటెక్షన్ తదితర సాంకేతికతలను పొందుపరిచారు.
సుమారు 40 ఏళ్లుగా రేసింగ్ విభాగంలో తమకున్న ట్రాక్ రికార్డును ఆర్టీఆర్ 310 మరింత బలపరుస్తుందని టీవీఎస్ బిజినెస్ అధిపతి విమల్ సంబ్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే ఈ శ్రేణి బైక్‌లలో బెంచ్ మార్క్‌ను సృష్టిస్తామని పేర్కొన్నారు.
మూడు వేరియంట్లలో లభ్యం..
అపాచీ ఆర్టీఆర్ 310 మూడు వేరియంట్లలో మార్కెట్లోకి రానుంది. క్విక్ షిఫ్టర్ లేకుండా బ్లాక్ ఆర్సెనెల్ కలర్ బైక్ రూ.2.43 లక్షలకు, ఆర్సెనెల్ బ్లాక్ రూ.2.58 లక్షలకు లభించనున్నాయి. అందరినీ ఆకట్టుకున్న ఫ్యూరీ ఎల్లో రంగుతో కావాలనుకుంటే మాత్రం రూ.2.64 లక్షలను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది