గణతంత్ర దినోత్సవం వేళ ములుగులో విషాదం

ములుగు జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

  • By: Somu    latest    Jan 26, 2024 10:56 AM IST
గణతంత్ర దినోత్సవం వేళ ములుగులో విషాదం
  • పరామర్శించిన మంత్రి సీతక్క
  • మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్సీ కాలనీలో కొందరు యువకులు కలిసి ఇనుప పోల్‌కు జాతీయ జెండా ఎగరవేయాలని భావించారు. అయితే జాతీయ జెండా అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు తగిలి బోడ విజయ్(25) అంజిత్‌(35) చక్రి (25) విద్యుదాఘాతానికి గురి కాగా, స్థానికులు హుటాహుటిన ములుగు ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా, మరో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి.

– మంత్రి సీతక్క పరామర్శ

విద్యుదాఘాతంతో మృతి చెందిన సమాచారం తెలియగానే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి సీతక్క ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.