ఇద్దరిదీ ఒకే హృదయం.. ఒకే భార్య.. ఇద్దరి మరణానికి కారణమూ ఒక్కటే! ఏమిటా మిస్టరీ?

ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆయన గుండెను అవయవదానం కింద వేరొక వ్యక్తికి అమర్చారు. చనిపోయిన వ్యక్తి భార్యను.. అవయవదానం పొందిన వ్యక్తి కలిశాడు

ఇద్దరిదీ ఒకే హృదయం.. ఒకే భార్య.. ఇద్దరి మరణానికి కారణమూ ఒక్కటే! ఏమిటా మిస్టరీ?

ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆయన గుండెను అవయవదానం కింద వేరొక వ్యక్తికి అమర్చారు. చనిపోయిన వ్యక్తి భార్యను.. అవయవదానం పొందిన వ్యక్తి కలిశాడు. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కట్‌ చేస్తే.. తనకు గుండెను ఇచ్చిన వ్యక్తి ఏ కారణంతో చనిపోయాడో.. ఇతడు కూడా అదే కారణంతో చనిపోయాడు. ఇద్దరిదీ ఆత్మహత్యే! ఇద్దరూ తుపాకితో కాల్చుకునే! రెడ్డిట్‌ పోస్ట్‌లో వచ్చిన ఈ వార్త నెటిజన్లలో ఆసక్తి రేపింది. కొందరైతే అవి ఆత్మహత్యలు కావని, ఆ చావుల వెనుక ‘భార్య’ ఉండొచ్చని వ్యాఖ్యానించారు. నిజానికి ఈ ఘటన ఇప్పటిది కాదు. చాలా కాలం క్రితానికిది. అయితే.. ఇప్పటికీ ఈ వార్త వైరల్‌ అవుతూనే ఉన్నది.

జార్జియాకు చెందిన సోనీ గ్రాహం అనే 69 ఏళ్ల వ్యక్తి 2008 ఏప్రిల్‌ 1న తుపాకితో కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన.. టెర్రీ కాటల్‌ అనే 33 ఏళ్ల యువకుడి గుండెను గ్రాహంకు అమర్చిన 12 ఏళ్ల తర్వాత జరిగింది. విచిత్రం ఏమిటంటే.. కాటల్‌ కూడా తుపాకితో కాల్చుకుని చనిపోయాడు. మరో విశేషం ఏమిటంటే.. కాటల్‌ భార్యనే గ్రాహం పెళ్లి చేసుకున్నాడు.

ఇది టెర్రీ కాటల్‌.. షెరిల్‌ స్వెట్‌ కథ. వారిద్దరూ మొదటిసారి కలిసినప్పుడు వారికి అప్పటికే వివాహాలు అయ్యాయి. అయితే.. స్వెట్‌ వివాహం రద్దయింది. 1989 మే నెలలో కాటల్‌కు విడాకులు మంజూరయ్యాయి. తొమ్మిది రోజుల తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకుని, సౌత్‌ కాలిఫోర్నియాలోని మాంక్స్‌ కార్నర్‌కు వెళ్లిపోయారు. గత వివాహం ద్వారా స్వెట్‌ షెరిల్‌కు ఒక కుమారుడు ఉన్నాడు. కాటల్‌కు కూడా కొడుకు ఉన్నప్పటికీ.. అతడు దత్తపుత్రుడు. తదనంతరం వీరికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. కాలక్రమేణా వారి వైవాహిక జీవితంలో మనస్ఫర్థలు మొదలయ్యాయి. 1995 మార్చి 15న చోటు చేసుకున్న వివాదంలో కాటల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆ సమయంలో అదే సౌత్‌ కాలిఫోర్నియాలోని హిల్టన్‌ హెడ్‌లో సోనీ గ్రాహం అనే వ్యక్తి (అప్పటికి 57 ఏళ్లు) హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతూ హార్ట్‌ డోనర్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. కాటల్‌ గుండెను ఆయనకు అమర్చారు. అప్పటికే ఆయనకు వివాహం అయింది.

తనకు కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలన్న ఉద్దేశంతో కాటల్‌ కుటుంబం గురించి గ్రాహం 1996లో వాకబు చేశాడు. అడ్రస్‌ కనుక్కుని ఉత్తరాలు రాశాడు. ఈ సమయంలో షెరిల్‌, గ్రాహం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. 1997లో వారిద్దరూ కలుసుకున్నారు. తాను ప్రేమిస్తున్నానని చెప్పినా.. కొద్ది నెలల తర్వాత 1997 ఏప్రిల్‌లో షెరిల్‌ వేరొకరిని వివాహం చేసుకున్నది. ఆ వివాహంలో ఆమెకు కొడుకు పుట్టాడు. కానీ.. ఆమె గ్రాహంతో టచ్‌లో ఉన్నది. 2001లో గ్రాహంకు విడాకులు మంజూరయ్యాయి. దీంతో షెరిల్‌తో కలిసి కొంతకాలానికే వేరొక చోటికి వెళ్లిపోయాడు. కానీ.. ఇద్దరి మధ్య మనస్ఫర్థలు రావడంతో ఆమె ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో అతడు ఆమెపై ఆర్థిక దావా వేశాడు. అప్పటికే ఆమె వేరొకరిని పెళ్లి చేసుకున్నది. 2004లో అతడికి విడాకులు ఇచ్చి.. మళ్లీ గ్రాహంను పెళ్లి చేసుకుంది.

అయితే.. గ్రాహం వింతగా ప్రవర్తించేవాడని, ఎప్పుడూ ముభావంగా ఉండేవాడని ఆయన స్నేహితులు పేర్కొన్నారు. ఒక వీలునామా రాసి, దానికి ఎగ్జిక్యూటర్‌గా తన మేనల్లుడిని నియమించుకున్నాడు. ఒక దురదృష్టకర వేళ.. 2008 ఏప్రిల్‌ 1న.. కొన్నేళ్ల క్రితం కాటల్‌ ఏదైతే చేశాడో.. అదే విధంగా ఒక తుపాకితో తనను తాను కాల్చుకుని చనిపోయాడు. షెరిల్‌ను సంతోషంగా ఉంచేందుకు తన బ్యాంకు ఖాతాను మొత్తం ఖాళీ చేసుకున్నాడని, దాంతో తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాడని గ్రాహం మేనల్లుడు, ఇతరులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. షెరిల్‌ పాత భర్తలు మాత్రం తాము మాత్రం బతికిపోయామని అన్నారు. ‘ఒక రోజు ఆమె ద్వేషిస్తుంది. మరో రోజు ప్రేమిస్తుంది. మరుసటి రోజే ద్వేషిస్తుంది.. ఆ తర్వాతి రోజు ప్రేమిస్తుంది.. నేను అదృష్టవంతుడిని.. బతికిపోయా’ అని మాజీ భర్త జన్సన్‌ ఒక వార్తా సంస్థకు చెప్పారు. గ్రాహం మృతిపై అనేక అనుమానాలు ఉన్నా.. జార్జియా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ మాత్రం అతడి మరణానికి ఆత్మహత్యే కారణమని తేల్చింది.