జ‌పాన్‌లో ర‌న్‌వేపై రెండు విమానాలు ఢీ.. ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్న వీడియోలు

భూకంపంతో అత‌లాకుత‌మైన జ‌పాన్‌ (Japan) లో ఘోర విమానం (Planes Collision) ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే

జ‌పాన్‌లో ర‌న్‌వేపై రెండు విమానాలు ఢీ.. ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్న వీడియోలు

విధాత‌: భూకంపంతో అత‌లాకుత‌మైన జ‌పాన్‌ (Japan) లో ఘోర విమానం (Planes Collision) ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. మంగ‌ళవారం టోక్యోలోని హ‌నేదా అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (Plane in Flames) లో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న కోస్ట్‌గార్డ్ విమానాన్ని జ‌పాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బ‌స్ 516 విమానం ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో అయిదుగురు కోస్ట్‌గార్డ్ సిబ్బంది మ‌ర‌ణించ‌గా.. ఎయిర్‌బ‌స్‌లో ఉన్న 379 మందిని విమానాశ్ర‌య సిబ్బంది ర‌క్షించారు. ఈ ఘ‌ట‌న‌లో రెండు విమానాలు మంట‌ల్లో చిక్కుకుని నామ‌రూపాలు లేకుండా పోయాయి. కోస్ట్‌గార్డ్ విమానం పైల‌ట్ కనురెప్ప పాటులో విమానం నుంచి దూకేసి ప్రాణాలు ద‌క్కించుకున్నారు. భూకంప బాధితుల‌కు నిత్యావ‌స‌రాలు ఇచ్చేందుకు ఇది నిగాటా విమానాశ్ర‌యానికి బ‌య‌లుదేరుతుండ‌గా ఈ ఘోరం జ‌రిగింది.


తొలుత ఇందులో అయిదుగురి సిబ్బంది ఆచూకీ తెలియ‌డం లేద‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. త‌ర్వాత వారు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అధికారులు ధ్రువీక‌రించారు. తాజాగా ఆ ప్ర‌మాద వివ‌రాల‌ను, ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో త‌మ ఆలోచ‌న‌ల‌ను ప్ర‌యాణికులు పంచుకుంటున్నారు. ల్యాండ్ అవుతున్న విమానాన్ని హ‌ఠాత్తుగా ఏదో అడ్డుకున్న‌ట్లు అయింద‌ని.. వెంట‌నే విమానం మంట‌ల్లో చిక్కుకుంద‌ని ఓ ప్ర‌యాణికుడు వెల్ల‌డించాడు. నెట్‌లో వైర‌ల్ అవుతున్న వీడియోల్లో క్యాబిన్ అంతా పొగ‌తో నిండిపోయి క‌నిపిస్తుంది. ఇంజిన్‌లు మండిపోవ‌డం, హెచ్చ‌రిక అలారంలు పెద్ద శ‌బ్దంతో మోగ‌డం తెలుస్తోంది.


అంతే కాకుండా ప్ర‌యాణికుల హాహాకారాలు వినిపిస్తున్నాయి. విమానం అలా మంట‌ల్లో చిక్కుకునే మెల్ల‌గా నిశ్చ‌ల స్థితికి వ‌చ్చింది. తాను త‌న త‌ల్లిదండ్రులు, సోద‌రితో క‌లిసి టోక్యోకు వ‌స్తున్నామ‌ని.. ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ఇక త‌మ ప్రాణాలు పోతున్నాయ‌ని భావించిన‌ట్లు 17 ఏళ్ల స్వీడిష్ యువ‌కుడు ఆంటోన్ డైబే గుర్తు చేసుకున్నాడు. ‘విమానం అంతా గాఢ‌మైన పొగ‌. ఆ స‌మ‌యంలో విమానం ఒక న‌ర‌క కూపంగా క‌నిపించింది. కొద్ది సేప‌టికే ఎమ‌ర్జెన్సీ డోర్ తెరిచి… మ‌మ్మ‌ల్నంద‌రినీ బ‌య‌ట‌కు గెంటేశారు. వెంట‌నే ఎటువైపు ప‌రిగెడుతున్నామ‌న్న‌దీ చూసుకోలేదు. విమానానికి దూరంగా ప‌రిగెట్టాం అంతే’ అని అత‌డు చెప్పుకొచ్చాడు.


ఇంజిన్లు మంట‌ల్లో చిక్కుకోగానే త‌న ముఖం కాలిపోతున్న భావ‌న క‌లిగింద‌ని వాటికి ద‌గ్గ‌ర‌గా కూర్చున్న ఓ ప్ర‌యాణికుడు వివరించాడు. లోప‌ల ఉష్ణోగ్ర‌త హ‌ఠాత్తుగా పెరిగింద‌న్నాడు. ఒక్క‌సారిగా విమానం గ‌తిత‌ప్పి ఎడ‌మ‌వైపు ఒరిగిపోయింద‌ని తెలిపాడు. చాలా మంది ప్ర‌యాణికులు తాము చ‌నిపోయామ‌ని భావించిన‌ట్లు చెప్ప‌డం విశేషం. ఒక్క 10 నిమిషాలు ఒవెన్‌లో పెట్టి ఉక్కిరిబిక్కిరి చేసిన‌ట్లు అయిపోయింద‌ని.. దేవుని ద‌య‌తో బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డామ‌ని చెప్పుకొచ్చారు. ఎవ‌రి త‌ప్పిదం వ‌ల్ల ఈ అసాధార‌ణ దుర్ఘ‌ట‌న జ‌రిగింద‌నే దానిపై వివిధ సంస్థ‌లు ద‌ర్యాప్తు మొద‌లుపెట్టాయి.