ఉద్యాన వన యూనివర్సిటీ బంద్ విజయవంతం
హైకోర్టు భవన నిర్మాణానికి వ్యవసాయ, ఉద్యాన వన యూనివర్సిటీల 100ఎకరాల భూములను కేటాయించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు యూనివర్సిటీ బంద్ నిర్వహించారు

- హైకోర్టుకు భూకేటాయింపు జీవో రద్దుకు డిమాండ్
విధాత : తెలంగాణ హైకోర్టు భవన నిర్మాణానికి వ్యవసాయ, ఉద్యాన వన యూనివర్సిటీల 100ఎకరాల భూములను కేటాయించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలో భాగంగా శుక్రవారం యూనివర్సిటీ బంద్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూ కేటాయింపుల జీవోను ఉపసంహరించుకోవాలని, యూనివర్సిటీల భూముల కేటాయింపును అడ్డుకోవడంలో విఫలమైన వీసీలు, రిజిస్ట్రార్లు రాజీనామాలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతో కలిసి అప్పటి బీఆరెస్ ప్రభుత్వంపై పోరాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీ భూముల విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. వెంటనే భూ కేటాయింపులను ఉపసంహరించుకోవాలన్నారు. నెల రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఫుడ్ స్టాల్ నిర్వాహకురాలు కుమారి ఆంటీ సమస్యను పట్టించుకున్న ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందంటూ విమర్శలు గుప్పించారు.