Hanumakonda: ఓరుగల్లులో కదంతొక్కిన కాషాయులు.. హనుమకొండలో నిరుద్యోగ మార్చ్
జనసంద్రమైన కేయూ టూ అంబేద్కర్ సర్కిల్ పాల్గొన్న బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, డప్పుల మోతలతో దద్దరిల్లిన హనుమకొండ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఓరుగల్లులో కాషాయులు కదం తొక్కారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రధాన రహదారి బిజెపి శ్రేణులతో కాషాయసంద్రంగా మారింది. నిరుద్యోగ మార్చ్ సందర్భంగా శనివారం సాయంత్రం కేయూ క్రాస్ రోడ్డు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన […]

- జనసంద్రమైన కేయూ టూ అంబేద్కర్ సర్కిల్
- పాల్గొన్న బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ,
- డప్పుల మోతలతో దద్దరిల్లిన హనుమకొండ
- భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఓరుగల్లులో కాషాయులు కదం తొక్కారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రధాన రహదారి బిజెపి శ్రేణులతో కాషాయసంద్రంగా మారింది. నిరుద్యోగ మార్చ్ సందర్భంగా శనివారం సాయంత్రం కేయూ క్రాస్ రోడ్డు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ర్యాలీ జనంతో కిక్కిరిసిపోయింది. విద్యార్థులు, నిరుద్యోగులకు తోడు పెద్ద సంఖ్యలో హాజరైన బిజెపి అనుబంధ సంఘాల కార్యకర్తలతో కిటకిటలాడింది.
పాల్గొన్న బిజెపి ముఖ్య నాయకులు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌తో కలిసి నిరుద్యోగ మార్చ్ లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంవీఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు రఘునందన్ ఇతర రాష్ట్ర, జాతీయ నాయకులు ర్యాలీలో భాగస్వామ్యం అయ్యారు. పార్టీ నాయకులతో కలిసి సెల్ఫీలు దిగేందుకు బీజేపీ కార్యకర్తలు ఎగబడ్డారు. ప్రజలకు అభివాదం చేస్తూ బండి సంజయ్, డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్ తదితరులు ముందుకు సాగారు.
నినాదాలతో ఫ్ల కార్డుల ప్రదర్శన
కాషాయ జెండాల రెపరెపల మధ్య వివిధ రకాల నినాదాలు రాసిన ప్లకార్డుల ప్రదర్శనతో ‘మాకు న్యాయం చేయాలి’ అంటూ పేపర్ లీకేజీలో దోషులను కఠినంగా శిక్షించాలి. సాలుదొర… ‘కేసీఆర్‌ను గద్దె దించుతాం. అంటూ నినాదాలు రాసిన భారీ బ్యానర్లు, ప్లకార్డులతో ప్రదర్శన పెద్ద ఎత్తున సాగింది.
మిస్టర్ కేటీఆర్… రాజీనామా చేయాలంటూ, భారత మాతాకీ జై అంటూ ఇదేమి ఇదేమి రాజ్యం – దోపిడి రాజ్యం దొంగల రాజ్యం… చెట్టు మీది కొంగ – కేసీఆర్ దొంగ అంటూ నినదించారు. కేటీఆర్‌ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలంటూ అడుగులో అడుగు వేస్తూ కదం తొక్కుతూ వేలాది మంది ఈ ర్యాలీలో భాగస్వామ్యం అయ్యారు. నిరుద్యోగ మార్చ్ తో ఓరుగల్లు ప్రధాన రోడ్డు కాషాయ సంద్రమైందీ. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన నినాదాలతో పరిసరాలు దద్దరిల్లాయి.
డప్పు చప్పులతో దద్దరిల్లిన నగరం
ర్యాలీ సందర్భంగా డప్పు చప్పుల్లు, డోలు మోతలతో హనుమకొండ ప్రాంతం దద్దరిల్లింది. ర్యాలీకి ముందు పెద్ద సంఖ్యలో ఏర్పాటుచేసిన డప్పు కళాకారులు, డోలు కళాకారులు వివిధ రకాల ప్రదర్శనలు చేస్తూ ఆకట్టుకున్నారు.
భారీగా పోలీసు బందోబస్తు
బిజెపి ర్యాలీ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగునా పోలీసులు నిఘా పెట్టారు. బిజెపి ర్యాలీ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ర్యాలీ సాగిన కేయూ ఎక్స్ రోడ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారు. ర్యాలీ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో జన సమీకరణకు కృషి చేశారు. ఈ ర్యాలీలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.