కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు కోరడంలేదు: కిషన్ రెడ్డి

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు కోరటం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు

  • By: Somu    latest    Jan 04, 2024 10:08 AM IST
కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు కోరడంలేదు: కిషన్ రెడ్డి
  • నా ఆదాయం..రేవంత్ ఆదాయాలపై విచారణకు సిద్ధమా
  • అభయ హస్తం పేరుతో మోసం
  • కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి



విధాత: సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు కోరటం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నేతగా తాను బాధ్యతగా నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు అహంకారంతో తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. కాళేశ్వరంపై పూర్తి వివరాలు ఎంపీ హోదాలో సీబీఐకు ఇస్తానన్న రేవంత్.. సీఎంగా ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.


తెలంగాణకు సీబీఐ రాకుండా కేసీఆర్ చట్టం చేశారని… లేకుంటే కేంద్రమే సీబీఐ విచారణ చేపట్టేదన్నారు. ప్రధాని మోడీని గజదొంగ అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. కాంగ్రెస్ నేతలే గజ దొంగలని, వారికి యముడు మోడీ అని, అవినీతిపరులెవ్వరని వదలబోరన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్థానం…తన ప్రస్థానం ఎలా సాగిందో..ఆయన ఎలా సంపాదించారో ఎన్నికేసులున్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. సీఎం ఆదాయం ఎంతో.. తన ఆదాయం ఎంతో విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు.


కాళేశ్వరంలో బీజేపీకి వాటా ఉందని చెబుతున్న కాంగ్రెస్‌కు దమ్ముంటే నిరూపించాలన్నారు. లంకె బిందెల కోసమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారా? అని ప్రశ్నించారు. కాళేశ్వం అవినీతి విషయంలో కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వమే రక్షిస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌కు తాను కాదు.. కాంగ్రెస్ పార్టీనే బినామీ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 15 రోజుల్లోనే ఫార్మా సిటీపై యూ టర్న్ ఎందుకు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీల లాబీయింగ్‌కు సీఎం రేవంత్‌ లొంగిపోయారన్నారు.


అభయహస్తం పేరుతో మోసం..


ప్రజాపాలన సభల్లో అభయ హస్తం పథకం ఆరుగ్యారంటీల దరఖాస్తుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, దరఖాస్తుల వెనుక ఏదో మతలబు ఉందని విమర్శలు గుప్పించారు. దరఖాస్తు అవసరం లేకుండా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల వరకు కాలయాపన కోసమే ఆరు గ్యారంటీల దరఖాస్తుల తంతుకు తెరలేపారన్నారు. పార్లమెంట్ ఎన్నికల దాకా ప్రజలను కాంగ్రెస్ నేతల ఇళ్ల చుట్టు తిప్పుకోవాలని భావిస్తోందన్నారు. గత బీఆరెస్ ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ఇవ్వలేదన్న సంగతి తెలిసికూడా పథకాల కోసం రేషన్ కార్డుల వివరాలు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.


రైతు భరోసా, గ్యాస్ సిలిండర్ వాడే వారి డేటా ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉందని, అలాంటప్పుడు కొత్తగా మళ్లీ దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరమేంటన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఎఫ్ఐఆర్ కాపీలు ఎందుకు పెట్టాలని, ఉద్యమకారుల అరెస్టులు.. జైలుకు వెళ్లిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గరనే ఉన్నప్పుడు మళ్లీ ఎఫ్ఐఆర్ కాపీలు అడగడం ఎందుకని ప్రశ్నించారు. రైతు భరోసాకు వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉండగా మళ్లీ దరఖాస్తు చేసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభయ హస్తం ఆరు గ్యారంటీల అమలుపై కాలయాపన ఎత్తుగడ అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో బీఆరెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో బిచాణా ఎత్తివేస్తుందని, బీఆరెస్‌కు ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లేనన్నారు.


రాహుల్‌గాంధీ ఉన్నంత వరకు ప్రధాని మోడీనే


రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా చేసేందుకు ప్రజలు సిద్ధంగాలేరని కిషన్ రెడ్డి అన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా షర్మిల దేశానికి రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని వైఎస్ కోరుకున్నారని, అందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పిన వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందించారు. రాహుల్‌గాంధీ ఒక ఫెయిల్యూర్ పొలిటిషియన్ అని, రాహుల్‌గాంధీ ఎక్స్‌పైర్ మెడిసిన్ అయితే ప్రధాని మోడీ ఆప్‌డేట్ మెడిసిన్ వంటివారని, మోదీ మెడిసిన్ ప్రపంచానికి సంజీవని అన్నారు.


షర్మిలగాని మరెవరో గాని రాహుల్‌గాంధీని ప్రధాని చేయలేరని, ఎవరైనా ప్రధానమంత్రి కావాలంటే ప్రజలు చేయాల్సిందేన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు దేశం ప్రజలు సుముఖంగా లేరన్నారు. అయోధ్యలో ఈ నెల 22న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్యార్యక్రమం‌ కోసం ప్రతి దేవాలయంలో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తామన్నారు. సంక్రాంతి నుంచి 22వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. అన్ని దేవాలయాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్ర్కీన్స్ ఏర్పాటు చేయనున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.