Narayanaswamy |
విధాత : రానున్న సాధారణ ఎన్నికల్లో జనసేన, టిడిపితో కలిసి పొత్తు ఉంటుందని, వారితో కలిసి ఎన్నికలకు వెళ్తాం అని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయమంత్రి నారాయణస్వామి అన్నారు. సోమవారం అనంతపురం జిల్లా మడకశిర లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో 2014లో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు అన్నిటినీ మళ్ళీ కలుపుకుని 2024 ఎన్నికలకు వెళ్తామని, ఈ క్రమంలోనే గతంలో తమతో కలిసి ప్రయాణించిన టిడిపి, జనసేనలు మళ్ళీ తమతో కలిసి వస్తాయని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా ఈనెల 18న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో బిజెపి ఓ సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీనికి గతంలో తమతో బాటు ఉన్న పార్టీలను పిలుస్తోంది. ఇదిలా ఉండగా టిడిపి, బిజెపి, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్ళాలని ఇటు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ పొత్తు విషయమై పలుమార్లు ఢిల్లీ బిజెపి పెద్దల వద్ద ప్రస్తావించడానికి చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు.
గతంలో 2018లో ఎన్డీయే నుంచి బయటకు వస్తూ చంద్రబాబు చేసిన ప్రకటనలు, బిజెపికి వ్యతిరేకంగా చేసిన దర్మపోరాట దీక్షలు బిజెపిని అప్పట్లో బాగా బాధించాయి. అంతేకాకుండా తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం బిజెపిలో కోపాన్ని మరింత పెంచింది.
అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి, చివరకు బిజెపి సైతం ఘోరంగా ఓడిపోగా కేసీఆర్ విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయి వైయస్సార్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తరువాత చంద్రబాబు నలుగురు రాజ్యసభ సభ్యులను టిడిపికి రాజీనామా చేయించి బిజెపిలో చేర్చారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, కనకమేడల
రవీంద్రబాబులు ఇక్కడ టిడిపి ఓడిపోగానే బిజెపిలో చేరిపోయారు.
అయినా ఇప్పటివరకు చంద్రబాబును బిజెపి దగ్గరకు తీయలేదు. బిజెపితో పొత్తు ఉంటే జగన్ను ఎన్నికల్లో అడ్డుకోవచ్చని చంద్రబాబు భావిస్తూ వస్తున్నారు. ఆమధ్య విశాఖలో మోడీని పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు సైతం ఇదే పొత్తుల విషయం చర్చకు రాగా మోడీ, అమిత్ షా తిరస్కరించారని అంటారు.
అయితే మళ్ళీ ఇప్పుడు పొత్తుల వ్యవహారం తెరమీదకు వస్తోంది. బిజెపితో పొత్తు ఉంటుందని నారాయణ స్వామి చెప్పడాన్ని బట్టి చూస్తుంటే టిడిపికి ఇది సంతోషం కలిగించే వార్త అని తెలుస్తోంది. మరి దీనిమీద ఢిల్లీ పెద్దల అభిప్రాయం ఎలా ఉందో చూడాలి