సీఎం రేవంత్‌రెడ్డి నాకు టైం ఇవ్వట్లేదు: వీహెచ్
పార్టీ సీనియర్‌గా తాను స్వయంగా కలిసి మా సమస్యలు చెబుదామంటే నాకు టైమ్ ఇవ్వడం లేదని, అదే ప్రతిపక్ష నేతల ఇళ్లకు వెళ్లి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడని సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు

- సీఎం రేవంత్‌రెడ్డిపై విహెచ్ కీలక వ్యాఖ్యలు
విధాత, హైదరాబాద్ : పార్టీ సీనియర్‌గా తాను స్వయంగా కలిసి మా సమస్యలు చెబుదామంటే నాకు టైమ్ ఇవ్వడం లేదని, అదే ప్రతిపక్ష నేతల ఇళ్లకు వెళ్లి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడని సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నీవు ముఖ్యమంత్రి అని, నిన్ను కలవాలంటే నీ దగ్గరకు వాళ్ళు రావాలని, నువ్వు ప్రతిపక్ష నేతల దగ్గరికి వెళ్లి ఆహ్వానించడం కరెక్ట్ కాదని, నీ స్థాయి నువ్వే తగ్గించుకుంటున్నావని విహెచ్ చురకలేశారు.
తక్కువ సమయంలో నాలుగేళ్లలోనే సీఎం అయ్యింది రేవంత్ రెడ్డి ఒక్కడేనని, పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాడని, ప్రజలు బీఆరెస్ వద్దని కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. కాంగ్రెస్ క్యాడర్‌కు న్యాయం చేయకుండా మన కార్యకర్తల పై కేసులు పెట్టినవాళ్లకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తు పార్టీలోకి చేర్చుకుంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చూసి ఇప్పుడు కార్యకర్తలు బాధపడుతున్నారన్నారు.
ఇన్నాళ్లు అధికారంలోకి ఉండి అక్రమంగా డబ్బు సంపాదించిన వారే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లోకి వస్తున్నారని, అటువంటి వారు పార్టీలోకి ఎందుకు వస్తున్నారో సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచించాలన్నారు. రేవంత్ రెడ్డి ఒక్క సైడ్ వినవద్దని, రెండు సైడ్స్ వినాలని కోరుతున్నానని, పార్టీ కార్యకర్తలలకు అన్యాయం వద్దనే తాను మాట్లాడుతున్నానని చెప్పారు.
నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని, ఎవ్వరికి అన్యాయం జరగొద్దనేది నా ఆవేదన అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో మేం ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా బీఆరెస్ పాలకులు కేసులు పెట్టారని, వాటి కోసం కోర్టుల చుట్టు తిరుగాల్సివస్తుందన్నారు. బీఆరెస్ పీడ పోయిందన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు బీఆరెస్ పాలకులు పెట్టిన కేసులపై ఏం మాట్లాడుతలేరని ఆవేదన వ్యక్తం చేశారు. మాపై వున్నా కేసులు ఎత్తివేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతున్నామన్నారు.