పట్టాలెక్కేందుకు వందే భారత్‌ స్లీపర్‌ రెడీ..! తొలికూత ఈ మార్గంలోనే..!

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది

  • By: Somu    latest    Feb 06, 2024 11:53 AM IST
పట్టాలెక్కేందుకు వందే భారత్‌ స్లీపర్‌ రెడీ..! తొలికూత ఈ మార్గంలోనే..!

Vande Bharat Sleeper Train | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. 2019లో తొలిసారిగా సెమీ హైస్పీడ్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30కిపైగా రూట్లలో వందే భారత్‌ రైళ్లు పట్టాలెక్కాయి. ఈ రైళ్లతో ప్రయాణికులకు కొంత వరకు ప్రయాణ సమయం ఆదా అవుతున్నది. అయితే, ఇప్పటి వరకు తీసుకువచ్చిన వందే భారత్‌ రైళ్లలో కేవలం చైర్‌కార్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎంత దూరమైనా ప్రయాణికులు కూర్చొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఉన్నది.


ఈ క్రమంలో వందే భారత్‌ రైళ్లకు తోడుగా స్లీపర్‌ వర్షన్‌ను సైతం రైల్వేశాఖ తీసుకురానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, స్లీపర్‌ రైళ్లకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ అందుతున్నది. త్వరలోనే స్లీపర్‌ రైళ్లను ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దాంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సౌకర్యవంతమైన ప్రయాణం చేసే అవకాశం రైల్వేశాఖ కల్పించబోతున్నది. ప్రస్తుతం ఉన్న వందే భారత్‌ రైళ్లకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తున్నది. పలు మార్గాల్లో ఆక్సుపెన్సీ భారీగా ఉంటున్నది. ఈ రైళ్లలో స్లీపర్‌ బెర్తులు లేకపోవడంతో వృద్ధులకు కాస్త అవస్థలకు అసౌకర్యంగా మారాయి.


ఈ క్రమంలో త్వరలోనే తీసుకురాబోతున్న స్లీపర్‌ వర్షన్‌తో ఇబ్బందులు తీరనున్నాయి. తొలి విడదలో పది మార్గాల్లో రైళ్లను ప్రారంభించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి. మార్చిలో ట్రయల్‌ రన్‌ నిర్వహించి.. ఆ తర్వాత మార్చి నెలాఖరు లేదంటే ఏప్రిల్‌ మొదటి, రెండో వారంలో స్లీపర్‌ రైళ్లను పట్టాలెక్కించాలని రైల్వేశాఖ భావిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తొలి రైలు ఢిల్లీ-ముంబయి మధ్య ప్రారంభించే అవకాశాలున్నాయని.. దాంతో పాటు ఢిల్లీ – హౌరా మార్గంలోనే నడిపే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే, స్లీపర్‌ రైళ్లను సుదూర ప్రాంతాలకు నడిపించనున్నట్లు అధికారులు వివరించారు.


ప్రస్తుతం ఉన్న కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లలో కోచ్‌ల సంఖ్య దాదాపు 16-20 ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో వీటిని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న రాజధాని రైళ్ల వేగాన్ని అధిగమిస్తుందని.. ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేలా స్లీపర్‌ రైళ్లను నడుపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు గరిష్ఠంగా వంద కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లలోని ఇంటీరియర్‌కు సంబంధించిన ఫొటోలును సోషల్‌ మీడియా ద్వారా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.


ఇప్పటికే ఉన్న బెర్తులతో పోలిస్తే మరింత విశాలంగా ఉండేలా డిజైన్ చేశారు. ప్రతి బోగీలో మూడు మరుగు దొడ్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. వందే భారత్ స్లీపర్ కోచ్ మొత్తం స్ట్రక్చర్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందించగా.. డ్యూరబిలిటీతో పాటు స్లీక్‌ ఎక్స్‌టీరియన్‌ని ప్రయాణికులకు అందించనున్నది. స్ట్రయికింగ్‌ వైట్‌బాడీతో వైబ్రెంట్‌ ఆరెంజ్‌ స్ట్రయిప్స్‌తో అదిరిపోయే లుక్‌లో ఆకర్షించాయి. ట్రైన్‌ లోపల తేలికపాటి లేత గోధుమరంగులో డెకరేషన్స్, సాధారణ ప్రాంతాలతో పాటు ప్రతి సీటు వద్ద మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్‌ను సైతం ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు మంచి ట్రావెల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించేలా రైల్వేశాఖ చర్యలు తీసుకుంటున్నది. సీట్లు, బెర్త్‌లు అనుకూలమైన ఎత్తులో, ఖరీదైన కుషనింగ్‌తో బెస్ట్‌ కంఫర్ట్‌ అందించేలా రూపొందించారు.


వందే భారత్ స్లీపర్ రైలులో అప్పర్‌ బెర్త్‌లకు ఎక్కే ట్రెడిషినల్‌ హార్డ్ స్టీల్ స్టెప్స్‌ స్థానంలో సాఫ్టెర్‌ మెటీరియల్‌ను వినియోగించారు. ఈ అప్‌గ్రేడ్ ప్రయాణికుల కంఫర్ట్‌, యాక్సెసిబిలిటీని పెంచనున్నది. థాట్‌ఫుల్‌ లైటింగ్ డిజైన్ ప్రయాణికులను ఆకట్టుకుంటుంది. లైటింగ్ కాన్సెప్ట్ యూనిఫార్మ్‌గా, ఆహ్లాదకరంగా ఉంటుంది. రాత్రిపూట ప్రయాణాల్లో ప్రయాణికులకు మంచి సౌకర్యాన్ని అందివ్వనున్నది. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ బెటర్‌ టెంపరేచర్‌ కంట్రోల్‌తో అందుబాటులోకి ఉంటుంది. ఎక్స్‌టర్నల్‌ టెంపరచేర్‌కు అనుగుణంగా కోచ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మెయింటైన్‌ చేసే ఆటోమేటిక్ క్లయ్‌మెట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ఈ స్లీపర్‌ రైళ్లలో అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లలో దాదాపు 16 కోచ్‌ల వరకు ఉండనుండగా.. ఇందులో థర్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, ఫస్ట్‌ ఏసీ ఉండనున్నట్లు తెలుస్తున్నది.