‘కోమటి రెడ్డి’ పొత్తు వ్యాఖ్యలు.. BRS, కాంగ్రెస్‌లకు నష్టం చేయడానికేనా?

బీజేపీకి లబ్ధి చేకూర్చడానికేనా? కాంగ్రెస్‌ను వీడి కాషాయ కండువా కప్పుకోవడానికేనా? ఉన్నమాట: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడే అవకాశం ఉన్నదని, బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుందని పొత్తులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా చేసిన కావు. మునుగోడు ఉప ఎన్నికకు ముందు నుంచే కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఒకే మాట మీద ఉన్నారు. అందుకే ఆ ఎన్నికలో తన తమ్ముడిని గెలిపించాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు వెంకట్‌రెడ్డి చేసిన ఫోన్‌ కాల్‌ అప్పుడు సంచలనంగా […]

  • By: krs    latest    Feb 14, 2023 4:21 PM IST
‘కోమటి రెడ్డి’ పొత్తు వ్యాఖ్యలు.. BRS, కాంగ్రెస్‌లకు నష్టం చేయడానికేనా?
  • బీజేపీకి లబ్ధి చేకూర్చడానికేనా?
  • కాంగ్రెస్‌ను వీడి కాషాయ కండువా కప్పుకోవడానికేనా?

ఉన్నమాట: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడే అవకాశం ఉన్నదని, బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుందని పొత్తులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా చేసిన కావు. మునుగోడు ఉప ఎన్నికకు ముందు నుంచే కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఒకే మాట మీద ఉన్నారు. అందుకే ఆ ఎన్నికలో తన తమ్ముడిని గెలిపించాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు వెంకట్‌రెడ్డి చేసిన ఫోన్‌ కాల్‌ అప్పుడు సంచలనంగా మారింది. దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానం ఆయన వివరణ కోరింది. దానికి వెంకట్‌ రెడ్డి ఇచ్చిన సమాధానంపై పార్టీ సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఆ వివాదం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నది.

రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత త్వరలో వెంకట్‌రెడ్డి కూడా అదే బాటలో నడుస్తారనే చర్చ జరిగింది. కానీ ఆ సమయంలో ఆ ప్రచారాన్ని ఖండించలేదు, అంగీకరించ లేదు. కానీ ఫలితాల అనంతరం కొంతకాలం కిందట ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానన్నారు.

ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నకు ప్రస్తుతం తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, ఎన్నికల కొన్ని నెలల ముందు ఏ పార్టీ నుంచి పోటీ చేసేది చెప్తానని అన్నారు. నాటి నుంచే ఆయనపై అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆయనపై చర్యలు తీసుకోలేదు. కానీ నేతలంతా కలిసి పనిచేయాలని సూచించింది. సీనియర్‌ నేతలు పార్టీని గెలిపించే బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది.

రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్‌ తమ అసంతృప్తిని వివిధ సందర్భాల్లో వ్యక్తం చేశారు. కానీ అధిష్ఠానం అండదండలు ఆయనకే ఉండటంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడిన మీడియాతో మాట్లాడుతూ.. మా అన్నదమ్ముల అభిప్రాయాలు ఒకేలా ఉంటాయని చెప్పారు. దీంతో వెంకట్‌రెడ్డి వ్యవహారశైలి అప్పటి నుంచి వివాదాస్పదం అవుతున్నది.

అయితే వెంకట్‌రెడ్డి చేసిన చేసిన వ్యాఖ్యల్లో ఒకటి వాస్తవమే అనే వాదన ఉన్నది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవచ్చు అనేది రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతున్నది. అయితే ప్రధాన పోటీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్యే ఉండబోతున్నదని, మొదటి రెండు స్థానాల్లో ఆ రెండు పార్టీలే ఉంటాయని వివిధ సర్వేలు కూడా తేటతెల్లం చేశాయి.

దీంతో బీజేపీ మూడో స్థానానికే పరిమితం కావడం తప్పా అధికారంలోకి వచ్చేది లేదు, అధికార పార్టీకి ప్రత్యామ్నాయం కాదన్న క్లారిటీ కూడా ఉన్నది. దీంతో వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్‌ కాంగ్రెస్‌తో కలవక తప్పదని అందుకే అన్నారు. బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమౌతున్నది.

కోమటిరెడ్డి వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భిన్నంగా స్పందించారు. తెలంగాణ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ లేదనేది వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలతో స్పష్టమైందన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనే తమ పార్టీని కేసీఆర్‌ లక్ష్యంగా చేసుకున్నారని, మా పార్టీని ఎదుర్కొవడానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, వామపక్షాలు ఏకమౌతాయని పేర్కొన్నారు.

సంజయ్‌ వ్యాఖ్యలు చూస్తే ఇదంతా ఆ పార్టీ అధిష్టానం వ్యూహంలో భాగమే అంటున్నారు. పొత్తులపై తన కామెంట్లతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు నష్టం జరుగుతుందని, ఒకవేళ కాంగ్రెస్‌ అధిష్ఠానం తనపై చర్యలు తీసుకుంటే.. దాన్ని కారణంగా చూపి కాషాయ కండువా కప్పుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు.