విధాత, హైదరాబాద్ : ఖమ్మం లోక్‌సభ సీటు కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు రాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అడ్డం పడుతున్నారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. భట్టి నా ఎంపీ టికెట్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదని, మొదట టికెట్ ఇచ్చేలా సహకరిస్తానని చెప్పి ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు భట్టి కాంగ్రెస్‌లో డిప్యూటీ సీఎం స్థాయికి ఎదగడంలో నా ప్రోత్సాహం, సహకారం ఉందని చెప్పారు. గతంలో తాను భట్టిని ఎమ్మెల్సీగా చేశానని, అలాంటిది నా టికెట్‌కు సహకరించక ద్రోహం చేయడం అన్యాయమని వాపోయారు. నేను పార్టీ కోసం జీవితమంతా పనిచేశానని, చచ్చే వరకు పార్టీలోనే ఉంటానని, చనిపోయిన తర్వాత కూడా పార్టీ జెండా నాపై ఉంటుందని, నేను పార్టీ మారనని స్పష్టం చేశారు. నేను పార్టీలో ఎందరికో సహాయం చేశానన్నారు. నా కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరని, పార్టీ కోసం పదవులు ఆశించకుండా పని చేసిన తనకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాకు న్యాయం చేయాలని కోరారు.
ఖమ్మంకు నేను లోకల్ కాదు అంటున్నారని, రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్య నాయుడు వీళ్లంతా లోకలా?’’ అని వీహెచ్ హన్మంత రావు ప్రశ్నించారు. ఖమ్మం లోక్‌సభ స్థానం తనకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. నా వయసు నాకు ఎన్నికల్లో పోటీకి అడ్డంకి కాదని, ఈ వయసులోనూ రన్నింగ్ రేసులో పాల్గొంటానని, రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే నేను తప్పుకుంటానని, రాహుల్ రాకపోతే నేను ఖమ్మం నుంచి పోటీకి అర్హుడినని వీహెచ్ హన్మంత రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు బీసీ ఓట్లు అవసరం లేదా బీసీలు ఓట్లు వేసే మిషన్లా అని వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు. జోడో న్యాయ యాత్ర, కులగణన అంటున్న రాహుల్‌గాంధీ నాకు పార్టీలో న్యాయం చేయాలని కోరారు.