పవన్, జగన్ అంటూ.. విశాల్ తెలివిగా తప్పించుకున్నాడు
విధాత: ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. ఒకవైపు కుల రాజకీయాలు మిన్నంటు తున్నాయి. కులాల కుంపట్లలో రాజకీయ నాయకులు వేడి కాచుకుంటున్నారు. అందునా ఇది చలికాలం. కులాల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరాంధ్ర నుంచి ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణ , గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, రాయల సీమ, పల్నాడు ఇలా రోజూ ఏదో ఒక కార్చిచ్చు రగులుతూనే ఉంది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వీరాభిమానులు చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బాహాటంగానే రౌడీయిజం చేస్తూ, కత్తులు […]

విధాత: ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. ఒకవైపు కుల రాజకీయాలు మిన్నంటు తున్నాయి. కులాల కుంపట్లలో రాజకీయ నాయకులు వేడి కాచుకుంటున్నారు. అందునా ఇది చలికాలం. కులాల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరాంధ్ర నుంచి ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణ , గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, రాయల సీమ, పల్నాడు ఇలా రోజూ ఏదో ఒక కార్చిచ్చు రగులుతూనే ఉంది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వీరాభిమానులు చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బాహాటంగానే రౌడీయిజం చేస్తూ, కత్తులు చేత పట్టుకొని హల్చల్ చేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ మాచర్ల సంఘటన.
ఏపీలో కులాల సమీకరణలు మొదటి నుంచి సాధారణమే. కానీ నాడు ఎన్టీఆర్ అధికారం పీఠం ఎక్కడంలో ఆయనకున్న సినీ చరిష్మా, వాగ్దాటితోపాటు కాంగ్రెస్‌పై వ్యతిరేకత.. ఎంతకాలం రెడ్లే పాలించాలా? అనే భావన రావడం ముఖ్య కారణం. నాడు కమ్మ కులస్తులందరూ టిడిపికి విపరీతమైన ప్రచారం చేసి ఎన్టీఆర్ విజయంలో… కేవలం పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లో అధికారంలోకి తెచ్చిన ఘనత సాధించడంలో కీలక భూమిక వహించారు.
కానీ ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మాత్రం ఈ స్థాయిలో కులాల మధ్య కొట్లాటలు, కులాలుగా విడిపోవడానికి జరగలేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ కులాల కొట్లాటలు పెద్దగా లేవు. తెలంగాణలో మరీ ఏపీ అంత కులపిచ్చి లేకపోవడం ఆయనకు ప్లస్ అయింది.
కానీ జగన్ మోహన్ రెడ్డి విభజిత ఏపీలో అధికార పీఠం అధిరోహించాలని నిర్ణయించుకున్న వెంటనే ఏపీలోని రెడ్డి కులస్తులందరూ అప్పటివరకు తాము కొమ్ముకాస్తోన్న కాంగ్రెస్‌ను వీడి వైయస్సార్సీపికి జై కొట్టారు. ఏపీలో బలమైన ఆర్థిక మూలాలు ఉన్న రెడ్డి కులస్తులందరూ సమైక్యంగా నిలిచి.. జగన్ రెడ్డినే గెలిపించాలని నిర్ణయించుకొని అనుకున్నది సాధించారు.
ఇక ప్రస్తుతం ఏపీ రాజకీయం మూడు కులాల చుట్టూ తిరుగుతోంది. అవే ఇక్కడ బలమైన కమ్మ, రెడ్డి, కాపు సామాజిక వర్గాలు. కమ్మవారు టిడిపికి, రెడ్డి కులస్తులు వైఎస్సార్సీపీకి, కాపు కులస్తులు జనసేన పవన్ కళ్యాణ్‌కి అన్నట్టుగా విడిపోయారు.
ప్రస్తుతం ఏపీలో సామాన్య పౌరుడి నుంచి ప్రతి ఒక్కరూ కులం మాయలో పడిపోతున్నారు. ఇక విషయానికి వస్తే చాలా కాలం కిందటే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీకి ఎవరిని పోటీ పెట్టాలి? చంద్రబాబుని ఓడించాలంటే ఏమి చేయాలి? అని కసరత్తులు మొదలయ్యాయి.
ఈ సమయంలో ప్రముఖ నిర్మాత చెన్నైలో బడా పారిశ్రామికవేత్త అయిన జీకే రెడ్డి తనయుడు విశాల్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గతంలో జీకే రెడ్డి.. చిరంజీవితో ఎస్పీ పరశురామ్ అనే చిత్రం కూడా తీసిన సంగతి తెలిసిందే. తమిళనాట, తెలుగు నాట విశాల్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్, తమిళ నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ చూపిన చాతుర్యం వంటివి జగన్‌ని ఆకట్టుకున్నాయి.
అందునా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు. ఇవ్వన్నీ కలిసి వచ్చే అంశాలుగా జగన్‌కి కనిపించాయి. విశాల్ రెడ్డికి ఏపీలో కూడా పలు వ్యాపారాలు ఉన్నాయి. తమిళంలోనూ మంచి పేరు ఉంది. అలాంటి విశాల్ రెడ్డి తమిళనాడుకు బార్డర్‌లో ఉన్న ఏపీలోని కుప్పం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని జగన్ అంచనా. దానికి తోడు స్వయంగా విశాల్‌కి.. తన తండ్రితో ప్రమేయం లేకుండా కుప్పంలో పలు వ్యాపారాలు ఉన్నాయి.
ప్రస్తుతం విశాల్ రెడ్డి సిహెచ్ వినోద్ దర్శకత్వంలో పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో ‘లాఠీ’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా తిరుపతిలో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విశాల్ కొందరు కాలేజీ విద్యార్థులతో కలిసి ముచ్చటించాడు. ఈ క్రమంలో కాలేజీ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు విశాల్ సమాధానాలు చెప్పాడు. ఓ విద్యార్థి ఆయనను ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్‌లో మీకు ఎవరంటే ఇష్టం? అని ప్రశ్నించాడు. దానికి విశాల్ సమాధానం చెబుతూ నాకు సీఎం జగన్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చాడు.
ఇంకా కుప్పంలో టిడిపికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి… అందులో ఎంతవరకు నిజం అనే ప్రశ్న కూడా ఎదురయింది. దానికి ఆయన సమాధానం చెబుతూ కుప్పంలో నాకు కొన్ని బిజినెస్‌లు ఉన్నాయనే మాట వాస్తవమే. అయితే నేను ఏ ఎన్నికల్లోను పోటీ చేయడం లేదు.
ప్రజలకు సేవ చేయాలంటే కేవలం రాజకీయాల్లోకి రావాలనే లేదు. సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రాకుండా కూడా సేవ చేయవచ్చని తెలిపాడు. ప్రస్తుతం తాను సినిమా రంగంలో చాలా సంతోషంగా ఉన్నానని, ఇదే రంగంలో తాను కొనసాగుతానని, రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన మాత్రం ఏమాత్రం లేదని తన పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు.
రాజకీయాల్లోకి రాకుండా విశాల్ ముందు చూపుతో వ్యవహరించాడనే చెప్పాలి. ఎమ్మెల్యే గా గెలుస్తాడా లేదా అనేది పక్కన పెడితే ఆయన కనక పోటీ చేస్తే ఆయనపై వైసీపీ ముద్ర పడుతుంది. ఆతర్వాత ఎవరు గెలుస్తారో తెలియదు. దాంతో రెంటికి చెడ్డ రేవడి అవుతాడు.
ఇప్పుడిప్పుడే తెలుగులో తన చిత్రాల ద్వారా కోలీవుడ్ లో లాగా ఫేమ్ సాధించుకుంటున్న విశాల్ రెడ్డి తొందరపడకుండా చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇదే హీరో.. తనకి నచ్చిన నటుడు పవన్ కల్యాణ్ అని తెలిపి.. అందరికీ షాకిచ్చాడు.
నటుడిగా పవన్ కల్యాణ్, పొలిటికల్‌గా జగన్ అంటే ఇష్టమని ఆయన చెప్పిన సమాధానంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలెవల్‌లో చర్చలు నడుస్తున్నాయి.