Viveka murder case | త‌ప్పుడు వాంగ్మూలాన్ని తొలగించేలా ఆదేశాలివ్వండి: అజయ్‌ కల్లం పిటిషన్‌

Viveka murder case చార్జీషీట్‌లో సీబీఐ పూర్తిగా అవాస్తవాలను పేర్కొంది కావాలని దర్యాప్తును తప్పుదారి పట్టిస్తోంది కొందరిని ఇరికించే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తోంది తెలంగాణ హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్‌ కల్లం పిటిషన్‌ హైద‌రాబాద్‌, విధాత: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ.. హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేసిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలంగాణ […]

Viveka murder case | త‌ప్పుడు వాంగ్మూలాన్ని తొలగించేలా ఆదేశాలివ్వండి: అజయ్‌ కల్లం పిటిషన్‌

Viveka murder case

  • చార్జీషీట్‌లో సీబీఐ పూర్తిగా అవాస్తవాలను పేర్కొంది
  • కావాలని దర్యాప్తును తప్పుదారి పట్టిస్తోంది
  • కొందరిని ఇరికించే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తోంది
  • తెలంగాణ హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్‌ కల్లం పిటిషన్‌

హైద‌రాబాద్‌, విధాత: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ.. హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేసిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు.

చార్జిషీట్‌ నుంచి తన వాంగ్మూలం తొలగించేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. చార్జీషీట్‌లో సీబీఐ పూర్తిగా అవాస్త‌వాల‌ను పేర్కొన్న‌ద‌ని, అలా సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేయడం చట్టవిరుద్ధమని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. సీబీఐ డైరెక్టర్‌ని, వివేకా కేసు విచారణాధికారి (ఏఎస్పీ)ని ప్రతివాదులుగా చేర్చారు.

పిటిషన్‌లో ఆయన పేర్కొన్న వివరాలు..

‘ఏప్రిల్‌ 29న నేను వాంగ్మూలం ఇస్తుండగా.. అధికారి మరొకరిని లోపలికి పిలిచారు. ఆయన లాప్‌ట్యాప్‌తో వచ్చి ఏదో రికార్డు చేసుకున్నాడు. ఆయన ఏం రికార్డు చేసింది నాకు చూపించలేదు. కనీసం చదివి కూడా వినిపించలేదు. నాకు తెలిసినంతవరకు నా వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డు కూడా చేయలేదు. ఇదిలా ఉండ‌గా.. మే 17న ఓ పత్రికలో ప్రచురితమైన వార్త ద్వారా తెలుసుకున్నా.. సీబీఐ నా స్టేట్‌మెంట్‌ను తప్పుడు రికార్డు చేసింద‌ని.

నా వాంగ్మూలం గురించి నేను ఎవరి వద్దా ప్రస్తావించలేదు. కానీ, ఆ పత్రికలో ఎలా వచ్చిందో నాకు అర్థంకాలేదు. ఆ పత్రికలో పేర్కొన్నదంతా అసత్యపూరితం. పత్రికలో వచ్చిన దానిపై ఎలక్ట్రానిక్‌ మీడియా చర్చా కార్యక్రమాలు పెట్టడంతో నేను విలేకరుల సమావేశం పెట్టి.. ఆ పత్రికది కట్టుకథ అని చెప్పాను. సీబీఐ నమోదు చేసింది కూడా నేను చెప్పింది కాదని తెలిసింది. అయితే సీఆర్‌పీసీ 161 కింద రికార్డు చేసిన కాపీ నావద్ద లేనందున నా వాంగ్మూలం తప్పుగా పేర్కొన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాను.

2019 మార్చి 15న ఉదయం 5.30 గంటల సమయంలో అటెండరు వచ్చి అమ్మ (భారతి) పిలుస్తున్నారంటూ జగన్‌కు చెప్పాడని తాను చెప్పినట్లు, బయటకు వెళ్లిన జగన్‌ పది నిమిషాల తరువాత వచ్చి చిన్నాన్న ఇక లేడ‌ని అన్నారని, షాక్‌కు గురైన మేము కడపకు వెళ్లాలని ఆయనకు సూచించి బయటకు వచ్చేశామని జూన్‌ నెలలో వేసిన చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది. ఈ విషయం పత్రికల్లో వచ్చిన సమాచారం ద్వారా నాకు తెలిసింది.

సీబీఐ అధికారికి నేను చెప్పింది..

ఏప్రిల్‌ 29న నన్ను విచారించిన అధికారికి స్పష్టంగా ఏం చెప్పానంటే.. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో తయారీ సమావేశం 2019 మార్చి 15న ఉదయం సుమారు 5 గంటలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట్లో ప్రారంభమైంది. గంటన్నర తర్వాత ఒక అటెండర్‌ సమావేశగది ద‌గ్గ‌రికి రావ‌డంతో బయటికి వెళ్లి విషయం తెలుసుకుని వచ్చిన ఓఎస్డీ.. జగన్‌ చెవిలో ఏదో చెప్పారు. దీంతో జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి గురయ్యారు. ‘చిన్నాన్న చనిపోయారు’ అని చెప్పారు. అంతేతప్ప జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన జీవిత భాగస్వామిని పిలవడం లాంటివి ఏమీ చెప్పలేదు.

దురదుష్టవశాత్తు నేను చెప్పింది సీబీఐ సరిగ్గా రికార్డు చేయలేదు. చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది పూర్తిగా అసంబద్ధం. దర్యాప్తును తప్పుదారి పట్టించి.. ఇతరులను కేసులో ఇరికించే ధోరణితోనే సీబీఐ ఇలా తప్పుగా పేర్కొంది. నా స్టేట్‌మెంట్‌పై సంతకం చేసిన అధికారి, నన్ను విచారించిన అధికారి ఒకరు కాదు. దర్యాప్తు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాజ్యాంగ ధర్మాసనాలు పదేపదే చెబుతున్నా.. కొందరు మాత్రం వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు.

దర్యాప్తు చేయడం అంటే అస్పష్టమైన సత్యాన్ని బయటికి తీసుకురావడం. కానీ, ఇక్కడ అధికారులు అలా వ్యవహరించలేదు. నేను చెప్పకున్నా చెప్పినట్లు సీబీఐ తప్పుడు వాంగ్మూలాన్ని సమర్పించడం ఎంతమాత్రం సరికాదు. ఇతర వ్యక్తులను చిక్కుల్లో పడేసేందుకే సీబీఐ తప్పుడు సమాచారం చేర్చింది. ఈ అంశాలను పరిశీలించి హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో సమర్పించిన చార్జిషీట్‌ నుంచి తప్పుడు వాంగ్మూలాన్ని తొలగించాలి..’ అని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.