Warangal | KCR ..దోపిడీ చేసిన ప్రతి రూపాయి కట్టిస్తాం: భ‌ట్టి

Warangal ప్రజల సంపాదన ప్రజలకు పంచుతాం దశాబ్దంలో కుంటుపడిన రాష్ట్ర అభివృద్ధి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇందిరమ్మ రాజ్యం రాగానే కేసీఆర్ చేసిన అవినీతిపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరిపిస్తాం… దోపిడీ చేసిన ప్రతి రూపాయిని వెనక్కు తీసుకుని ప్రజలకు చెందేలా చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. 42వ రోజు గురువారం నారాయణగిరి నుంచి ప్రారంభమైన పీపుల్స్ మార్చ్ యాత్ర నారాయణగిరి, మొట్టు […]

Warangal | KCR ..దోపిడీ చేసిన ప్రతి రూపాయి కట్టిస్తాం: భ‌ట్టి

Warangal

  • ప్రజల సంపాదన ప్రజలకు పంచుతాం
  • దశాబ్దంలో కుంటుపడిన రాష్ట్ర అభివృద్ధి
  • వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇందిరమ్మ రాజ్యం రాగానే కేసీఆర్ చేసిన అవినీతిపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరిపిస్తాం… దోపిడీ చేసిన ప్రతి రూపాయిని వెనక్కు తీసుకుని ప్రజలకు చెందేలా చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు.

42వ రోజు గురువారం నారాయణగిరి నుంచి ప్రారంభమైన పీపుల్స్ మార్చ్ యాత్ర నారాయణగిరి, మొట్టు తండా, బండి తండా, కమ్మరిపేట, వేలేరు, చలపల్లి, పీచర్ల ముద్దెలగూడెం, కొమ్ము గుట్ట వరకు కొనసాగింది. హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ప్రజల కోసమే పనిచేస్తూ సంపదను ప్రజలకే పంచుతుందన్నారు.

నీళ్లు లేవు.. నిధులు లేవూ.. నియామకాలు లేవు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం పేరుతో సంపద మొత్తం కేసీఆర్ లూటీ చేశాడని ఆరోపించారు. మన సొమ్మును దోపిడీ చేసిన కేసీఆర్ ను తెలంగాణ నుంచి పారదోలాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఉద్యోగాలు, పేదలకు ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు రాకుండా చేశాడు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచేసీ… అప్పుల పాల్జేశారని కేసీఆర్ అవినీతి మొత్తం ప్రజలకు అర్థమయిందన్నారు.

సంపదను నలుగురు కుటుంబ స‌భ్యుల దోపిడీ

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సంపద నాలుగుకోట్ల మంది ప్రజలకు పంచాల్సి ఉండగా, నలుగురు కుటుంబ సభ్యులు దోపిడీ చేశారని విమర్శించారు. దశాబ్దకాలంగా అభివృద్ధి లేక విసిగి, వేశారి.. కేసీఆర్‌ను ఇంటికి పంపించాలన్న లక్ష్యంతో కనిపిస్తున్నారన్నారు. ఆదిలాబాద్ నుంచి ప్రతి చోటా ప్రజలు ఇలాగే చెబుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

విక్రమార్కకు సమస్యల వినతి

తన పాదయాత్రలో భాగంగా భట్టి క‌మ్మ‌రిపేటలో ఈ మ‌ధ్య కురిసిన అకాల వ‌ర్షాల‌కు నాశ‌న‌మైన మొక్క‌జొన్న పంట‌ను సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా రైతు లావుడ్య చంద్రు, తార‌తో మాట్లాడారు. అకాల వ‌ర్షాల‌కు పంట మొత్తం నాశ‌న‌మైందని, నష్ట‌ప‌రిహారం ఇప్పించాల‌ని కోరారు. త‌ప్ప‌కుండా మీలాంటి రైతుల‌కు కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని విక్ర‌మార్క హామీ ఇచ్చారు.

డ‌బ్బున్న‌వారికే ద‌ళిత బంధు ఇస్తున్నారని, ఇండ్లు ఇవ్వ‌డం లేదని తమగోడు వెళ్ళబోసుకున్నారు.
ఇందిర‌మ్మ రాజ్యంతో అన్నీ వ‌స్తాయ‌ని విక్ర‌మార్క ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు న్యాయం రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.