కొమ్మాల జాతరలో పోటా పోటిగా రాజ‌కీయ ప్ర‌భ బండ్లు

కొమ్మాల జాతర భక్త జనంతో పోటెత్తింది. రాజకీయ ప్రభ బండ్లతో హోరెత్తింది. మూడు రోజులపాటు జరిగే జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది

కొమ్మాల జాతరలో పోటా పోటిగా రాజ‌కీయ ప్ర‌భ బండ్లు

– జాత‌ర‌కు హోరెత్తి భ‌క్తులు

– రాజకీయ ప్రభ బండ్ల ప్రదర్శనలో కోలాటాలు, డాన్సులు

– డీజేలతో దద్దరిల్లిన పరిసరాలు

– మొక్కులు సమర్పించుకున్న ఎమ్మెల్యేలు,రాజకీయ నేతలు

విధాత వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కొమ్మాల జాతర భక్త జనంతో పోటెత్తింది. రాజకీయ ప్రభ బండ్లతో హోరెత్తింది. మూడు రోజులపాటు జరిగే జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాలలో గుట్ట సొరికలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ప్ర‌తీ సంవ‌త్స‌రం మాదిరిగానే ఈ ఏడాది కూడా హోళీ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అత్యంత ఘనంగా ప్రారంభమై కన్నుల పండుగగా సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పరిసర జిల్లాల నుంచి కూడా వేలాది మంది భక్తులు జాతరలో పాల్గొని, మొక్కులు సమర్పించేందుకు తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు సంప్రదాయ పద్ధతిలో కుటుంబాలతో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో చేరుకున్నారు. వేలాదిమంది భక్తుల రాకతో కొమ్మాల జాతర పరిసరాలు హోరెత్తాయి.

రాజకీయ ప్రభ బండ్ల ప్రదర్శన డిజె సౌండ్ లు, భక్తుల కోలాటాలు, డ్యాన్సుల మధ్య ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల పై రాజకీయ ప్రభ బండ్లను ఊరేగించడంలో నాయకులు, కార్యకర్తలు ఒకరిని మించి ఒకరు పోటీపడ్డారు. దీంతో న‌ర్సంపేట‌, వ‌రంగ‌ల్ ప్ర‌ధాన ర‌హ‌దారి పై ట్రాఫిక్ నిలిచిపోయింది. కాంగ్రెస్‌, బీఆరెస్‌ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎదురుకావ‌డంతో పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరువ‌ర్గాల‌ను శాంతింప‌చేసేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించారు. కొమ్మాల‌ జాతర అంటేనే రాజకీయ ప్రభ బండ్ల ప్రదర్శనకు పోటీగా మారుతుంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసే రాజకీయ ప్రభ బండ్లు ఒక విధంగా ఆకర్షణీయం కాగా మరోవైపు పరస్పరం రాజకీయ ఆధిపత్యం కోసం ఈ జాతరను వేదికగా వినియోగించుకోవడం దశాబ్దాలుగా వస్తోంది.


 


నర్సంపేట ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో జాతర జరిగే కొమ్మాల ప్రాంతం పరకాల నియోజకవర్గ పరిధిలోని గీసుకొండ మండలంలో ఉండగా జాతరలో మాత్రం నర్సంపేట ప్రాంత రాజకీయ నాయకుల ప్రభ బండ్ల మధ్య పోటీ కొనసాగింది. అదేవిధంగా గీసుకొండ మండల భక్తులు కూడా ప్రభ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. డప్పుచప్పుల్లు, దరువుల మధ్య రాజకీయ పార్టీల జెండాలు రెపరెపలు, పాటలతో జాతర రాజకీయ రంగులను సంతరించుకుంది. గులాబీల ఆధిపత్యం కొమ్మాల జాతరలో గులాబీ ప్రభ బండ్లు ఎక్కువగా కనిపించినప్పటికీ కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్టులు వారితో పాటు పోటీపడ్డారు. ఒకప్పుడు నర్సంపేట ఎమ్మెల్యేగా ఓంకార్ కొనసాగిన కాలంలో ఈ జాతరంతా ఎరుపు ప్రభ బండ్ల మయంగా కనిపించేది. ఒక్కో బండిని సాగనంపేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేది. రెండు రాజకీయ పార్టీల ప్రభ బండ్లు ఎదురెదురైతే ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కారణంగానే కొమ్మాల జాతరొచ్చిందంటే భక్తుల కిటకిటతోపాటు, రాజకీయ ప్రభల ఆధిపత్యం అడ్డుకునేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసేవారు. ఈ పోటీని, ఉద్రిక్త పరిస్థితులను ఆపేందుకు గతంలో కొద్ది రోజులు ఈ రాజకీయ ప్రభ బండ్లను పోలీసులు నిషేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల అలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేనప్పటికీ రాజకీయ పార్టీల మధ్య పోటీ కొనసాగుతూనే ఉంది. సోమ‌వారం రాత్రి వ‌ర‌కు కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రభ బండ్ల ప్రదర్శన సాఫీగా కొన‌సాగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

– ఎమ్మెల్యేల సందర్శన

కొమ్మాల జాతరలో స్థానిక ఎమ్మెల్యేలు రేవూరి ప్ర‌కాష్ రెడ్డి జాతరను లాంఛనంగా ప్రారంభించారు. త‌దుప‌రి సాదాసీదాగా జాతర సాగింది. ఆదిసోమ‌వారాల్లో భక్తజనంతో జాతర కిటకిటలాడింది. సాయంత్రం ప్రారంభమైన ప్రభ బండ్లు తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డి కాంగ్రెస్ ప్రభలను , మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గులాబీ ప్రభను ప్రారంభించి అందులో పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఎం సి పి ఐ నాయకులు తమ తమ పార్టీల ప్రభ బండ్లతో ప్రదర్శనలు జరిపారు. ఈ జాతరకు స్థానికులే కాకుండా లంబాడా గిరిజనులు ఎక్కువ శాతంలో హాజరు కావడం ప్రత్యేకతగా చెప్పవచ్చు.