Warangal | మంత్రి KTR వస్తున్నాడని అధికారుల స్పందన.. ఇన్నర్ రింగ్ రోడ్డు భూ బాధితులకు కలెక్టర్ హామీ

Warangal 30వ తేదీ వరకు నోటిఫికేషన్ 60 రోజుల్లో సమస్యకు పరిష్కారం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఐదేళ్లుగా స్పందించని అధికారులు మంత్రి కేటీఆర్ వస్తున్నాడని ఎట్టకేలకు స్పందించారు. ఐదేళ్లగా తమ పరిహారం కోసం ఎదురు చూస్తున్న వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు భూ బాధితుల సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హామీ ఇచ్చారు. ఈనెల 17న వరంగల్లో రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో […]

Warangal | మంత్రి KTR వస్తున్నాడని అధికారుల స్పందన.. ఇన్నర్ రింగ్ రోడ్డు భూ బాధితులకు కలెక్టర్ హామీ

Warangal

  • 30వ తేదీ వరకు నోటిఫికేషన్
  • 60 రోజుల్లో సమస్యకు పరిష్కారం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఐదేళ్లుగా స్పందించని అధికారులు మంత్రి కేటీఆర్ వస్తున్నాడని ఎట్టకేలకు స్పందించారు. ఐదేళ్లగా తమ పరిహారం కోసం ఎదురు చూస్తున్న వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు భూ బాధితుల సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హామీ ఇచ్చారు.

ఈనెల 17న వరంగల్లో రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు స్పందించడం గమనార్హం. మంత్రి పర్యటన నేపథ్యంలో వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు పనుల ప్రారంభ కార్యక్రమం చేపట్టనున్నారు.

ఈ సమాచారం తెలిసిన ఇన్నర్ రింగ్ రోడ్డు భూ బాధితుల సమాఖ్య ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. తమ భూమికి పరిహారం చెల్లించకుండా పనులు చేపడితే అడ్డుకుంటామని బాధితులు నిరసన చేపట్టారు. ఈ ధర్నాకు వివిధ రాజకీయ పక్షాలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

దశాబ్దం క్రితమే ప్రతిపాదన

వాస్తవానికి ఈ 200 ఫీట్ల రింగురోడ్డు నిర్మాణానికి దశాబ్దం క్రితం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ప్రతిపాదనలు రూపొందించగా 2019లో భూసేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. వరంగల్ నాయుడు పంపు నుంచి ఆరేపల్లి వరకు 13 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ కోసం ప్రతిపాదనలు రూపొందించారు.

తొలిదశలో నాయుడు పంప్ నుంచి వరంగల్ ఏనుమాముల మార్కెట్ వరకు 8 కిలోమీటర్ల పరిధి, రెండవ దశలో ఏనుమాముల మార్కెట్ నుంచి ఆరేపల్లి వరకు ఐదు కిలోమీటర్ల పరిధిలో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు.

160 మంది బాధితుల ఎదురుచూపులు

ఈ మేరకు ఇన్నర్ రింగ్ రోడ్డు తొలిదశ 8 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 360 మందికి చెందిన ఇళ్ల ప్లాట్లు, వ్యవసాయ భూములు సేకరించేందుకు నిర్ణయించి గత రెండేళ్ల క్రితం ఇందులో 200 మంది భూ నిర్వాసితులకు రూ.160 చెల్లించారు. మరో 160 మంది బాధితులకు దాదాపు మరో 100 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంది. ఈ పరిహారం చెల్లించడం జాప్యం చేస్తూ వచ్చారు.

తొలిదశలో చెల్లించిన పరిహారం కూడా బాధితుల ఆందోళనలు, ఆవేదనలతోనే చెల్లించారు. మిగిలిన బాధితుల సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. బాధితులు ఆందోళనలు చేపట్టి, అధికారులకు వినతి పత్రాలు, ప్రజాప్రతినిధులకు విన్నపాలు చేసినప్పటికీ స్పందన కరువైంది.

తాజాగా రింగ్ రోడ్డుపనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో విషయం తెలిసిన భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు రెండు రోజులుగా ధర్నా కొనసాగిస్తున్నారు. మంత్రి పర్యటనకు ఆటంకాలు కలగకుండా అధికారులు బాధితులతో చర్చలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం వరంగల్ కలెక్టరేట్లో భూ బాధితులతో అధికారులు చర్చలు జరిపారు.

ఈ నెల 30వ తేదీ లోపు విధివిధానాలు రూపొందించి భూసేకరణకు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య హామీ ఇచ్చారు. అనంతరం 60 రోజులలో నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ భరోసా ఇచ్చినట్లు బాధిత ప్రతినిధులు తెలిపారు. పరిహారం చెల్లించేంతవరకు భూమిని స్వాధీనం చేసుకోమని అధికారులు ఇచ్చిన హామీతో బాధితులు తమ ఆందోళన విరమించారు.

సమస్య పరిష్కరించి ఇన్నర్ రింగ్ రోడ్డు కు ఉన్న ఒక అడ్డంకులు తొలగించాలని నగరవాసులు భావిస్తున్నారు. కలెక్టర్ తో జరిపిన చర్చలలో భూ బాధితుల సమాఖ్య అధ్యక్షుడు గంగుల దయాకర్ రియాజుద్దీన్, ఉమా శంకర్ గౌడ్ సోల్తి రామస్వామి, పాలకుర్తి సత్యనారాయణ, చుంచు ఆనందరావు, సిరబోయిన వెంకన్న, బజ్జూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.