Warangal : వెంటాడుతున్న అకాల వర్షం.. రైతన్నకు తీరని నష్టం
Warangal దుఃఖ సాగరంలో వరంగల్ జిల్లా రైతన్నలు చేతికందిన పంటలన్నీ నాశనం వాన పాలైన ధాన్యం రాశులు అక్కరకురాని మొక్కజొన్న పంట ఈదురు గాలులతో బీభత్సం నేల రాలిన 'మామిడి' ఆశలు వెంటాడుతున్న అకాల వర్షాలు, వడగండ్ల వాన, ఈదురుగాలుల బీభత్సం వరంగల్ జిల్లా రైతాంగాన్ని కంటనీరు పెట్టిస్తోంది. గత ఏడాది అకాల వర్షాల నుంచే కోలుకోని రైతాంగం. ఈ ఏడాది పంటలపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది కూడా అన్నదాతకు ప్రకృతి శాపంగా మారి […]

Warangal
- దుఃఖ సాగరంలో వరంగల్ జిల్లా రైతన్నలు
- చేతికందిన పంటలన్నీ నాశనం
- వాన పాలైన ధాన్యం రాశులు
- అక్కరకురాని మొక్కజొన్న పంట
- ఈదురు గాలులతో బీభత్సం
- నేల రాలిన ‘మామిడి’ ఆశలు
వెంటాడుతున్న అకాల వర్షాలు, వడగండ్ల వాన, ఈదురుగాలుల బీభత్సం వరంగల్ జిల్లా రైతాంగాన్ని కంటనీరు పెట్టిస్తోంది. గత ఏడాది అకాల వర్షాల నుంచే కోలుకోని రైతాంగం. ఈ ఏడాది పంటలపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది కూడా అన్నదాతకు ప్రకృతి శాపంగా మారి పంట చేతికి వచ్చే దశలో రైతన్న ఇంటా విషాదం నింపుతోంది.
గోరుచుట్టు పై రోకటి పోటు లాగా, ఆదాయం సంగతేమోగాని, చేసిన అప్పులు తీర్చడం ఎలా అనే బెంగ పట్టుకుందని రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఒక పంట నష్టపోయింది, మరో పంట ఆదుకుంటుందనుకుంటే దశలవారీగా వస్తున్న వడగండ్ల వాన ఒక్కో పంటను నాశనం చేయడంతో కళ్ళల్లో నీరింకి పోయిందని వైరాగ్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆఖరికి రోజువారి ఆదాయం ఇచ్చే కూరగాయల సాగు కూడా దెబ్బతిందని, ఆర్థికంగా ఆదుకునే మామిడి తోటలు కాయలతో పాటు ఆశలను కూడా నేలరాల్చాయని రైతులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. కొందరు రైతులు అయితే తమ కుటుంబాల్లో పెద్ద దిక్కు తమను వదిలిపోయినట్టు ఇంటిల్లిపాది దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దెబ్బ మీద దెబ్బ, వరుస దెబ్బలతో రైతాంగం అతలాకుతలమైతుంది. చిన్న, సన్నకారు రైతులు గుండె పగిలి గొల్లుమంటున్నారు. ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలోని రైతులు ఒక్క ఏడాది కాలంలోనే మూడు సార్లు కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టం పోవాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరవుతున్నారు. ధాన్యం, మొక్కజొన్న, జొన్న పంటలు, మామిడి తోటలు, పండ్లతోటలు, కూరగాయలు రాళ్లవానకు నేలకొరిగాయని, చెడగొట్టువానలు రైతులను తీవ్రమైన కష్టాల పాలు చేశాయని వాపోయారు.
అధికారులు, రాజకీయ నాయకులు సందర్శనలు, పరామర్శలతో అన్నదాతకు ఒరిగేదేమీ లేదని, ఇప్పుడు పంట నష్టం జరిగితే ఎప్పుడో వచ్చే పరిహారం వల్ల తమ కష్టాలు తీరిపోయేట్లు లేవని నిర్వేదంతో మాట్లాడుతున్నారు. జరిగే నష్టం కొండంత అయితే వచ్చే పరిహారం గోరంతగా ఉంటుందని కళ్ళల్లో నీరు, గుండెల్లో బాధను దిగమింగుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. అనేక గ్రామాల్లో చెట్లు నేలవాలాయి. గుడిసెలు, రేకుల షెడ్ల పై కప్పులు నేలమట్టమయ్యాయి. వేలాది ఎకరాల్లోని వరి, మామడి పంటలు నాశనమయ్యాయి. అర్ధరాత్రి వర్షం కురవడంతో ఎలాంటి రక్షణ లేకుండా రైతులు రోడ్లపై ఆరబోసిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. రైతులు కన్నీటి పర్యంతమవుతూ తడిచిన ధాన్యాన్ని కుప్పగా చేర్చేందుకు యత్నించారు.
వరి, మామిడి, కూరగాయ, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తీవ్రమైన గాలివానకు భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి., పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోగా సరఫరాకు అంతరాయం కలిగింది.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని హన్మకొండ జిల్లా పరకాల, చిట్యాల, మొగుళ్లపల్లి, దామెర, ములుగు హసన్‌పర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి, ధర్మసాగర్, వేలేరు, పరకాల డివిజన్‌లోని ఆరు మండలాలు, మానుకోట జిల్లా మరిపెడ, చిన్నగూడూరు, వరంగల్ జిల్లాలో నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, బచ్చన్నపేట, లింగాలఘణపురం, జనగామ, ఇప్పగూడెం, సముద్రాల, కోమటిగూడెం, అక్కపల్లిగూడెం తదితర గ్రామాలలో గాలివాన, వడగండ్లు బీభత్సం సృష్టించింది.
కమలాపూర్ మండలం అంబాలలో ఇల్లు పూర్తిగా కూలి కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు చికిత్స నిమిత్తం తరలించారు. గూడూరు, అంబాల ప్రధాన రహదారి వెంట విరిగిపడ్డ చెట్లు వాహనదారులకు ఇబ్బందులు కలిగించాయి. ఇదిలా ఉండగా ఇప్పుడిప్పుడే అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారు. అదివారం ప్రభావం కూడా కన్పిస్తుంది.
అకాల వర్షాలపై సర్కారు ఆదేశాలు
వివిధ ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు పంటలు దెబ్బతిన్నాయో అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నివేదికలు తెప్పించాలని సూచించారు.
ఎన్నికల ఏడాది కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కాస్తంత సానుకూలంగానే స్పందిస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఇచ్చే ఎకరానికి రూ.10వేల పరిహారం తమకు జరిగిన నష్టాన్ని పూడ్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కౌలు రైతుల పరిస్థితి దయనీయం
కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యలను ఇంతకాలం ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ పంటనష్ట పరిహారం విషయంలో మాత్రం ఈమధ్య అదికూడా ఎన్నికలు ఉన్నందున కావచ్చు, సీఎం కేసీఆర్ కంటి తుడుపు చర్యగా కౌలు రైతులకు పరిహారం చెల్లించాలని భూమి ఉన్న రైతులకు సూచించారు. ఇది అమలవడం అంత సులభమైన విషయం కాదని అంటున్నారు.
ప్రభుత్వం పరిహారం చెల్లించే క్రమంలోనే కౌలు రైతులను గుర్తించి వారికి పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటే తప్ప వారికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం లేదు. అడకత్తరలో పోక చెక్క మాదిరిగా కౌలు రైతుల పరిస్థితి మారింది. ఇప్పటికైనా కౌలు రైతుల పట్ల ప్రభుత్వం స్పష్టమైన పాలసీ రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగ నిపుణులు ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం పెడచెవిన పెడుతుందనే విమర్శలు ఉన్నాయి.