లోక్ సభ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆరెస్ విజయ దుందుభి మ్రోగించ నున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేసారు

- హామీలు అమలు చేతగాకనే కాంగ్రెస్ ఎదురు దాడులు
- కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు అవిశ్వాసాలే నిదర్శనం
- వారం పదిరోజుల్లో ప్రజల ముంగిటకు కేసీఆర్
విధాత : రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆరెస్ విజయ దుందుభి మ్రోగించ నున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేసారు. ఇటీవల ఎన్నికల్లో జరిగిన పొరపాటును సరిదిద్దుకునేందుకు తెలంగాణా సమాజం సన్నద్ధం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన నల్లగొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఆత్మీయ సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చెయ్యలేకనే చెప్పులతో దాడులు అంటూ అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ, రైతుబంధు డిమాండ్లు ప్రజల నుండి వచ్చినవేనన్నారు. అధికారంలోకి వచ్చిందే తడవుగా వారి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని అమలు చేస్తామన్న రెండు లక్షల రుణమాఫీ ఏమైందని ఆయన సూటిగా ప్రశ్నించారు. దామరచర్ల పవర్ ప్లాంట్ విషయంలో అసెంబ్లీ సాక్షిగా న్యాయ విచారణ చేపట్టాలని చాలెంజ్ విసిరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వ్యక్తిగత విమర్శలకు తానూ దిగితే వారు రోడ్ల మీద కుడా తిరగలేరని పరోక్షంగా మంత్రి కోమటిరెడ్డి కి ఆయన వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఎప్పుడూ ఎవరికీ శాశ్వతం కాదని, తాము అధికారంలో ఉండగా ఈ తరహా దాడులకు ఉసి గొల్పలేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కృష్ణా జలాలను నాటి ముఖ్యమంత్రులు వైఎస్సార్, చంద్రబాబులు అక్రమంగా తరలించుకుని పోతుంటే చోద్యం చూస్తూ బీ-ఫారాలకు భయపడి పెదవులకు పదవులు అడ్డుపడి నోర్లు ముసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. వీరి బాస్ లు చంద్రబాబు, వైఎస్‌లు కేసులు పెట్టిన రోజునే తెలంగాణ ఉద్యమ పార్టీ నేతలు భయపడ లేదని వారి అడుగులకు మడుగులొత్తి అధికారంలోకి వచ్చిన వారికి మేము భయపడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. ఆ మాటకు వస్తే అసలు తెలంగాణ సమాజానికి పోరాటాలు నేర్పిందే నల్లగొండ జిల్లా అని అటువంటి జిల్లా నుండే ప్రభుత్వ హామీల అమలుకు పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.
బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు అవిశ్వాసాలే నిదర్శనం
అధికారంలోకి వచ్చిందే తడవుగా బీజేపీ తో కుమ్మక్కు ఆయిన అధికార కాంగ్రెస్ పక్షం మున్సిపల్ చైర్మన్ లపై అవిశ్వాస తీర్మానాలకు శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. అటువంటి అక్రమ పొత్తులను ఎండగట్టిన సూర్యాపేట పాలకవర్గం కాంగ్రెస్, బీజేపీల అక్రమ సంబంధాన్ని అడ్డుకుందన్నారు. మళ్ళీ గులాబీ విజయ కేతనం సూర్యాపేట నుండే మొదలైందని కాంగ్రెస్ బీజేపీ లు కలిసి చేసుకున్న ఒప్పందం బెడిసి కొట్టిందని ఆయన విరుచుకుపడ్డారు. జాతీయ స్థాయిలో కత్తులు ప్రాంతీయ స్థాయిలో పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ బీజేపీలు అసెంబ్లీ ఎన్నికల్లో లోపాయకారి ఒప్పందాలు మున్సిపల్ అవిశ్వాస తీర్మానాల విషయంలో బాహాటంగానే బయట పడ్డాయన్నారు. వారం పది రోజుల్లో గులాబీ బాస్ ప్రజలలోకి రానున్నారని ఆయన వెల్లడించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు గాను పార్టీ సుప్రీం కేసీఆర్ త్వరలో నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.
ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్.రవీంద్ర కుమార్, నల్లగొండ, భువనగిరి జడ్ పి చైర్మన్ లు బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం. సి కోటిరెడ్డి, మాజీ శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, ఎన్.భాస్కర్ రావు, బీఆరెస్ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, చాడ కిషన్ రెడ్డి, బొర్రా సుధాకర్, తండు సైదులు గౌడ్, సహదేవ రెడ్డి, కరీం పాషా,పంకజ్ యాదవ్ లతో పాటు తిప్పర్తి, కనగల్,నల్లగొండ మండలాలు, నల్లగొండ పట్టణ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి,భోనగిరి దేవేందర్ లతో పాటుగా మహిళా నాయకురాళ్లు శరణ్య రెడ్డి, యాటా జయప్రద రెడ్డి,పద్మ,స్వరూప,వనపర్తి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.