రాష్ట్రంలో ఖాళీల సంగతి సరే.. దేశంలో ఖాళీల మాటేమిటి?

బీజేపీ నేతలు వినూత్న నిరసన మెట్రో రైల్లో భిక్షాటన విధాత‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందంటూ బీజేపీ నేతలు వినూత్న నిరసన తెలిపారు. పదవులు మీకు పస్తులు మాకా అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. యువ గ్రాడ్యుయేట్ల వేషధారణలో వాళ్లంతా హైదరాబాద్‌లోని మెట్రో రైల్లో భిక్షాటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుద్యోగులను భిక్షాటన చేసే పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో అందరూ తెలుసుకోవాలని […]

రాష్ట్రంలో ఖాళీల సంగతి సరే.. దేశంలో ఖాళీల మాటేమిటి?
  • బీజేపీ నేతలు వినూత్న నిరసన
  • మెట్రో రైల్లో భిక్షాటన

విధాత‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందంటూ బీజేపీ నేతలు వినూత్న నిరసన తెలిపారు. పదవులు మీకు పస్తులు మాకా అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. యువ గ్రాడ్యుయేట్ల వేషధారణలో వాళ్లంతా హైదరాబాద్‌లోని మెట్రో రైల్లో భిక్షాటన చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుద్యోగులను భిక్షాటన చేసే పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో అందరూ తెలుసుకోవాలని వారు కోరారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. సోషల్‌మీడియాలో బీఆర్‌ఎస్‌ అనుకూల వర్గాలు దానికి గట్టి కౌంటర్‌ ఇస్తున్నారు.

అయితే నిరుద్యోగుల పక్షాన ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యతను నిర్వర్తించడంలో తప్పులేదు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా గడిచిన ఎనిమిదిన్నరేళ్లుగా ఉద్యోగాల భర్తీ చేపట్టడం లేదనే వాస్తవాన్ని కూడా బీజేపీ నేతలు అంగీకరించాలని అంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఐదేళ్లలో వేలాది ఉద్యోగాలు భర్తీ చేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదటి మూడేళ్లు నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూశారు అన్నది వాస్తవం. కానీ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. దానికి అనుగుణంగా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి.

ఇదే సమయంలో కేంద్రం ప్రభుత్వంలో ఖాళీలను మొన్న పార్లమెంటులో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో సుమారు 9.79 లక్షల ఖాళీలు ఉన్నట్టు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభలో తెలిపారు.

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్స్‌ పే రీసెర్చ్‌ యూనిట్‌ వార్షిక నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల పరిధిలో 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

బీజేపీ నేతలు ఎప్పుడూ ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే గాని వాళ్ల ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇక్కడ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేయడం మంచిదే. అదే సమయంలో అక్కడ కేంద్రం ప్రభుత్వం సాక్షాత్తూ పార్లమెంటులో ప్రకటించిన 9.79 లక్షల ఉద్యోగాల భర్తీ గురించి కూడా మాట్లాడితే బాగుటుంది.

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో ఎన్నడూ లేనంత స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయిందని అధికారిక లెక్కలే తెలుపుతున్నాయి. భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ రేటు ప్రస్తుతం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ నేతల నుంచి సరైన సమాధానం ఉండదు. ఇక్కడ ఖాళీల గురించి మాట్లాడేవారు అక్కడ ఖాళీల గురించి కూడా మాట్లాడితే దానికి విలువ ఉంటుందని నిరుద్యోగులు అంటున్నారు.