Delhi Liquor Case। 16 తర్వాత ఏమి జరుగబోతోంది?

ED, AMIT SHAH, KAVITHA, BRS ,BJP ఈడీ అడ్వకేట్‌ రాజీనామా వెనుక ఆంతర్యమేమిటి? అరెస్ట్‌లు ఖాయమంటున్న అమిత్‌షా విధాత: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Case) ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఎవరి ఊహకూ అందని విధంగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha)విచారణ సమయంలోనే ఈడీ (ED) తరఫున కేసులు వాదించే అడ్వకేట్‌ నితీశ్‌ రానా (Nitish Rana) తప్పుకోవడం చర్చనీయాశంగా మారింది. ఈడీ కేసులను వాదించే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నితీశ్‌ […]

Delhi Liquor Case। 16 తర్వాత ఏమి జరుగబోతోంది?

ED, AMIT SHAH, KAVITHA, BRS ,BJP

  • ఈడీ అడ్వకేట్‌ రాజీనామా వెనుక ఆంతర్యమేమిటి?
  • అరెస్ట్‌లు ఖాయమంటున్న అమిత్‌షా

విధాత: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Case) ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఎవరి ఊహకూ అందని విధంగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha)విచారణ సమయంలోనే ఈడీ (ED) తరఫున కేసులు వాదించే అడ్వకేట్‌ నితీశ్‌ రానా (Nitish Rana) తప్పుకోవడం చర్చనీయాశంగా మారింది. ఈడీ కేసులను వాదించే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నితీశ్‌ రానా అకస్మాత్తుగా వైదొలగడంతో ఈ కేసులను వాదించడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా? అన్న చర్చ కూడా జరుగుతున్నది.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ విచారించిన తరువాతనే నితీశ్‌ రానా తప్పుకోవడంలో ఆంతర్యం ఏమిటన్న చర్చ జరుగుతోంది. దీనితోపాటే ఈ నెల 16 వ తేదీ విచారణ తరువాత కవితను అరెస్ట్‌ (Kavitha Arrest) చేస్తారా? లేదా? వదిలేస్తారా? ఏమి జరుగనున్నదనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది.

ఢిల్లీలో హడావుడి

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈ నెల 11వ తేదీన మొదటి సారిగా విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణ సమయంలో ఏమి జరుగుతుందోనన్న ఆత్రుతతో సీఎం కేసీఆర్‌ (CM KCR) ఆదేశాల మేరకు కేటీఆర్‌ (KTR), హరీశ్‌రావు (Harish Rao) సహా పలువురు మంత్రులు, కీలక నేతలు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కేసు విచారణ సందర్భంగా అరెస్ట్‌ జరిగే అవకాశాలు లేకుండా చూసే క్రమంలో న్యాయ నిపుణులతో కూడా చర్చించారని వార్తలు వచ్చాయి.

మొత్తానికి ఎలాంటి అరెస్టు లేకుండా.. సుదీర్ఘ విచారణ అనంతరం కవితను అదే రోజు రాత్రి వదిలేశారు. అయితే.. మరోసారి ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని సూచించింది. ఇదిలా ఉంటే.. కవిత విచారణ తర్వాత ఈడీ అడ్వకేట్‌ నితీశ్‌రానా రాజీనామా ఇప్పుడు కొత్త రాజకీయ చర్చకు దారి తీస్తున్నది. దీని వెనకాల ఏదో మతలబు జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కవిత విచారణకు ముందు రోజే.. అంటే 15 తేదీన విచారణకు రావాలని బుచ్చిబాబుకు నోటీసులు ఇవ్వడం గమనార్హం.

ఏం చేద్దాం?

ఈ నెల 16 వ తేదీన జరిగే విచారణను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా చర్చలు జరిపారని సమాచారం. ముఖ్యంగా విచారణకు వెళ్లకుండా కొంత సమయం తీసుకోవడానికి ఉన్న మార్గాలపైనా సమాలోచనలు చేశారని తెలుస్తున్నది.

అసలు లిక్కర్‌ స్కాంలో ఈడీ వద్ద ఉన్న ఆధారాలేంటి? నోటీసులు జారీ చేయడానికి ఆధారాలు ఏంటి? తొలి రోజు విచారణలో అడిగిన ప్రశ్నలు, వాటికి కవిత ఇచ్చిన జవాబులు, అదే సమయంలో రామచంద్ర పిళ్లై, ఆడిటర్‌ బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్‌మెంట్లు తదితరాలపై సీఎం చర్చలు జరిపారని తెలుస్తున్నది.

అదే సమయంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా విచారణలో పేర్కొన్న అంశాలపైనా విశ్లేషించారని సమాచారం. రెండవ దఫా విచారణలో ఈడీ ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందన్న అంశంపైనా ముందస్తు అంచనాకు వచ్చారని తెలుస్తున్నది.

విచారణ వాయిదా కోరుతారా?

ఈ నెల 16న కవిత మరో దఫా విచారణ నిమిత్తం ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉన్నది. అయితే.. దీనిని వాయిదా వేసేందుకు అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అనే చర్చకూడా జరిగినట్టు తెలుస్తున్నది. అయితే.. అనుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయనను ఏఐజీ దవాఖాన (AIG)కు తీసుకు వెళ్లగా.. ఆయనకు కడుపులో అల్సర్‌ (Ulcer) ఉన్నట్టు తేలింది.

అయితే.. మందులతో సరిపోతుందని, రెస్ట్‌ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచించారు. అనుకోకుండా వైద్య సహాయం అందించాల్సిన కారణంగా కూతురుగా కవిత దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ కారణం చేత వాయిదా కోరే అవకాశం కూడా ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా.. కవిత విచారణకు వెళ్లాలనే ఆలోచనలో కూడా కేసీఆర్‌ ఉన్నట్టు చెబుతున్నారు.

ఆరోపణలు వచ్చినవారి అరెస్టు ఖాయం

రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amith Sha) ఇక్కడి నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమాన సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలోనే రాష్ట్ర నేతలు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లతో మంతనాలు జరిపారని సమాచారం. ఈ సందర్భంగా నేతలకు పలు సూచనలు చేశారని తెలిసింది.

సీబీఐ (CBI), ఈడీ తదితర దర్యాప్తు సంస్థల విచారణలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అరెస్టుల వంటివి అనివార్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయన్నారని సమాచారం. అప్పుడు బీజేపీ(BJP)కి వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్నిఎండగట్టేందుకు సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించినట్టు తెలిసింది.

మద్యం కుంభకోణంలో విచారణకు ఈ నెల 16న‌ మరోసారి రావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం విదితమే. కేంద్ర మంత్రి మాటలను బట్టి ఎమ్మెల్యేల కొనుగోలు, లిక్కర్‌ స్కాంలో అధికారపార్టీ నేతలను అరెస్టు చేస్తారా? ఈ నెల 16 తర్వాత రాష్ట్రంలో ఏం జరగబోతున్నది? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది.

పిళ్ళైని కోర్టులో హాజరు పరిచిన ఈడీ

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక నిందితుడిగా ఉన్న అరుణ్‌ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. మరో మూడు రోజులపాటు ఆయనను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ వేశారు.