Monsoon | ఈ ఏడాది.. సాధారణం కంటే తక్కువ వర్షపాతమే
విలన్‌గా మారనున్న ఎల్‌నినో ప్రభావం వర్షాల పరిస్థితిపై స్కైమెట్ అంచనా ఏంటంటే.. ఎల్ నినో ప్రభావం పెరుగుతున్న దరిమిలా.. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నదని ప్రైవేట్ వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ అంచనా వేసింది. రైతులు, వ్యవసాయం, దానికి అవసరమైన వర్షాలతో ముడిపడిన భారత ఆర్థిక వ్యవస్థకు ఇది చేదు వార్తే. విధాత: ఎండాకాలం మొదలవుతున్నదంటే రాబోయే వానాకాలం ఎలా ఉండబోతున్నదన్న అంచనాలు వెలువడుతుంటాయి. భారత వాతావరణ విభాగంతోపాటు, ప్రైవేటు సంస్థలు […]

- విలన్‌గా మారనున్న ఎల్‌నినో ప్రభావం
- వర్షాల పరిస్థితిపై స్కైమెట్ అంచనా ఏంటంటే..
ఎల్ నినో ప్రభావం పెరుగుతున్న దరిమిలా.. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నదని ప్రైవేట్ వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ అంచనా వేసింది. రైతులు, వ్యవసాయం, దానికి అవసరమైన వర్షాలతో ముడిపడిన భారత ఆర్థిక వ్యవస్థకు ఇది చేదు వార్తే.
విధాత: ఎండాకాలం మొదలవుతున్నదంటే రాబోయే వానాకాలం ఎలా ఉండబోతున్నదన్న అంచనాలు వెలువడుతుంటాయి. భారత వాతావరణ విభాగంతోపాటు, ప్రైవేటు సంస్థలు రాబోయే రుతపవన కాలాన్ని (Monsoon) అంచనా వేస్తుంటాయి. మొదటగా ప్రాథమిక అంచనాలు వెలువుడుతాయి. మార్పులు ఉంటే తదుపరి అంచనాల్లో సవరిస్తారు. సరిగ్గా చెప్పినట్టు వచ్చే అవకాశాలు లేకపోయినా.. ముందు జాగ్రత్తల కోసం ఈ అంచనాలు రూపొందుతాయి. ఈ క్రమంలో స్కైమెట్ అనే ప్రైవేటు వాతావరణ సంస్థ.. రాబోయే వర్షాకాలం అంత ఆశాజనకంగా ఉండబోవడం లేదని బాంబు పేల్చింది.
ఈ సారి వర్షపాతం సాధారణం కంటే దిగువన ఉండబోతున్నట్టు అంచనా వేసింది. స్కైమెట్ అంచనా ప్రకారం.. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల వానాకాలంలో సాధారణ స్థాయికి దిగువన 868.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని స్కైమెట్ వెల్లడించింది. అయితే.. ఎల్‌నినోతో పాటు.. రుతుపవనాలను ప్రభావితం చేసే అంశాలు వేరేవి కూడా ఉన్నాయని పేర్కొన్నది.
తటస్థంగా ఐవోడీ
రుతుపవనాలను ముందుకు నడిపే శక్తి, ఎల్‌నినో కారణంగా ఎదురయ్యే ప్రభావాలను నిరోధించడంలో ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) సామర్థ్యం కలిగి ఉంటుందని, అయితే అది అప్పటికి తగినంత బలంగా ఉండాలని స్కైమెట్ తెలిపింది. ఐవోడీ ప్రస్తుతం తటస్థంగా ఉన్నదని పేర్కొన్నది.
ఎల్ నినో అంటే ఏమిటి?
భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రత వేడెక్కడాన్ని El Nino గా చెబుతారు. ప్రతి రెండు నుంచి ఏడేళ్లకోసారి ఇది సంభవిస్తుంది. ఇది భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేయగలదు.
భారతేదేశంపై ప్రభావం ఏంటి?
ఎల్ నినో తీవ్రతను బట్టి వాతావరణంపై ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. భారతదేశంలో, ప్రత్యేకించి దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో ఎల్ నినో వల్ల వర్షపాతం తగ్గుతుంది. కరువు నెలకొనే అవకాశం ఉంటుంది. దేశంలోని ఎక్కువమంది రైతులు వ్యవసాయం కోసం వర్షాలపై ఆధారపడే పరిస్థితులు ఉన్నందున మొదట దెబ్బతినేది వ్యవసాయం రంగమే. దాని పర్యవసానాలు అనేక రంగాల్లో కనిపిస్తాయి.
ఉత్తర భారతదేశంలో వ్యవసాయోత్పత్తులకు పేరుగాంచిన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో వర్షాకాలం రెండో సగభాగంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉంటాయని స్కైమెట్ తెలిపింది.