బీఆరెస్ ‘ఢిల్లీ’ రంకెలు.. పిల్లి అరుపులేనా? ఏపీలో దుకాణం బంద్?
ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన టీఆరెస్.. బీఆరెస్‌గా మారడం ద్వారా తనలోని తెలంగాణ ఆత్మను చంపేసిందన్న విమర్శలు ఎదుర్కొన్నది.

- అందితే ఢిల్లీ నినాదం.. అందకుంటే తెలంగాణ సెంటిమెంట్!
- తెలంగాణే బీఆరెస్ కేంద్రమన్న కేటీఆర్
- ‘కేంద్ర’ రాష్ట్రంలో చేజారిన అధికారం
- లోక్‌సభ ఎన్నికల్లో ఎదురీదే పరిస్థితులు
- మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ పైనే భారం
- మహారాష్ట్రలో కొన్ని సీట్లలోనైనా పోటీ చేస్తారా?
- ఏపీలో ఖాళీ అవుతున్న బీఆరెస్ దుకాణం
- ప్రహసనంగా మిగలనున్న టీఆరెస్ పేరు మార్పు!
- గందరగోళ చౌరస్తాలో నిలిచిన బీఆరెస్
ఇప్పుడు స్వరాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితిలో పడిపోయిన దుస్థితి చూస్తే.. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకు ఊడిందని.. మార్మానంబోతే.. మళ్లొచ్చే సరికి ఇల్లు ఆగమైందని.. మబ్బుల నీళ్లు చూసి ముంతల నీళ్లు ఒలకపోసుకున్నట్లయ్యిందని.. కేసీఆర్ తరచూ చెప్పే సామెతలే గుర్తుకొస్తున్నాయి.
(విధాత ప్రత్యేకం)
ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన టీఆరెస్.. దేశ రాజకీయాల్ల గుణాత్మక మార్పు తెస్తామని జాతీయ పార్టీ బీఆరెస్‌గా మారడం ద్వారా తనలోని తెలంగాణ ఆత్మను చంపేసిందన్న విమర్శలు ఎదుర్కొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఓటమి పిదప.. కేసీఆర్ తరచూ చెప్పే.. మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీగా బీఆరెస్ ‘జాతీయ పార్టీ’ తయారవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఫలించని సెంటిమెంట్
అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒక్కో ప్రచార సభలో ఒక్కో రీతిగా తెలంగాణ వాదాన్ని మళ్లీ రగిలించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రయత్నించారు. తమది కూడా జాతీయ పార్టీ అన్న సోయి మరిచి, జాతీయ పార్టీలను నమ్మొద్దని.. జాతీయ పార్టీలు తెలంగాణ ఆత్మ కాదని, బీఆరెస్ మాత్రమే తెలంగాణ ప్రజల ప్రతీక అని, ఢిల్లీ గులామ్‌లు మనకు వద్దంటూ ఎన్నికల్లో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించారు. దేశంలో రాబోయే రోజులన్ని ప్రాంతీయ పార్టీలవేనని, ఢిల్లీలో హంగ్ వస్తే ప్రాంతీయ పార్టీలేకింగ్ మేకర్ అన్నారు.
అయితే ప్రజలు బలంగా మార్పు కోరుకోవడంతో ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ వల్లె వేసిన తెలంగాణ సెంటిమెంట్ జపం పనిచేయలేదు. తాజాగా ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం సన్నాహక సమావేశంలో కేటీఆర్ మరోసారి బీఆరెస్ జాతీయ పార్టీ అన్న అంశం మరిచిపోయి మళ్లీ తెలంగాణ వాదాన్నే ఆశ్రయించారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అన్ని రాష్ట్రాల పరంపరలో తెలంగాణను కూడా ఒక రాష్ట్రంగా చూస్తాయని, అదే బీఆరెస్‌కు తెలంగాణే కేంద్రమని, తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్, బీఆరెస్ ప్రతీక అని చెప్పుకొన్నారు.
ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని తమకూ ఉన్నా తమ ప్రధాన కేంద్రం.. ఎజెండా తెలంగాణ అంటూనే జాతీయ పార్టీల ఎంపీలకు తెలంగాణ పట్ల ప్రత్యేక గౌరవం, ప్రేమ ఉండవని, తెలంగాణ గళం, బలం బీఆరెస్ మాత్రమేనన్నారు. ఇదే సమయంలో తమది కూడా తామే చెప్పుకొన్నట్లుగా జాతీయ పార్టీయేనని, తమ పార్టీ ఎంపీలు కూడా జాతీయ పార్టీ ఎంపీలేనన్న సంగతిని మరిచిపోవడం మరో విడ్డూరకర అంశం. బీఆరెస్ నేతల వైఖరి అందితే ఢిల్లీ నినాదం.. అందకపోతే తెలంగాణ సెంటిమెంట్ అన్నట్లుగా తయారైంది.
మరోసారి బీఆరెస్ జాతీయ పార్టీ అంశమన్న సంగతి నుంచి తమది ప్రాంతీయ పార్టీయేనంటూ స్వయంగా బీఆరెఎస్ అగ్రనేతలే యూటర్న్ తీసుకుంటున్నారా? అన్న అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆరెస్ పాలన పట్ల వ్యతిరేకతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోలేదని, సిటింగ్‌లపై వ్యతిరేకతతో ఓడామని కేటీఆర్ అన్నారు. అదే నిజమైతే లోక్‌సభ ఎన్నికల వ్యూహంలో పదేళ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాల కంటే ఎక్కువగా మళ్లీ తెలంగాణ రాగం అందుకోవడం ఆసక్తికర అంశంగా కనిపిస్తున్నది.
ఢిల్లీ రంకెలు.. పిల్లి అరుపులేనా..
నిజానికి బీఆరెస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందాక తాను దేశమంతా తిరిగి గాయి గత్తర లేపుతా.. ప్రధాని పీఠం ఎందుకు రాదో చూస్తా.. మోడీ బోడీ అంటూ కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లి పార్టీ విస్తరణ ప్రయత్నాలు గట్టిగానే చేశారు. పంజాబ్, ఢిల్లీ, బీహార్, బెంగాల్ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి సీఎంలను కలిసి హడావుడి చేశారు.
కర్ణాటకలో జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో, యూపీలో అఖిలేశ్‌తో చెట్టాపట్టాలేసుకున్నా ఇప్పుడు వారు కూడా ముఖం చేశారు. రైతు ఉద్యమంలో మృతి చెందిన పంజాబ్ రైతులకు, గల్వాన్ పోరులోని అమరుల కుటుంబాలకు చెక్కులిచ్చి తెలంగాణలో మాదంతా సంపన్న పాలన అన్నట్లుగా కలరింగ్ ఇచ్చారు. తీరా పదేళ్ల బీఆరెస్ పాలనలో 6.70 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రమైన ఘనత శ్వేతపత్రమై వెలుగులోకి వచ్చింది. అదంతా మా కష్టార్జితమంటూ స్వేదపత్రంతో బుకాయించేశారు.
జాతీయ రాజకీయాల పేరుతో కేసీఆర్ ఎన్నిరకాల ఫీట్లు వేసినా.. ఆయన కలసిన సీఎంలు అంతా ఇండియా కూటమికే జై కొట్టారు. ఇప్పుడు తెలంగాణలోనే బీఆరెస్ అధికారం కోల్పోవడంతో ఇక కేసీఆర్ పార్టీ వంక చూసే వారే కరువయ్యారు. అటు ఇండియా కూటమిలో చేరలేక..ఇటు ఎన్‌డీఏ వారు చేర్చుకోలేక గందరగోళ చౌరస్తాలో ఆగిపోయారు. నేల విడిచి సాము చేసి అధికారం మత్తులో బీఆరెస్ వేసిన జాతీయ పార్టీ రంకెలు కాస్తా పిల్లి పెడ బొబ్బలుగా మారిపోయాయి.
లోక్‌సభ పోరు పెను సవాల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి బీఆరెస్ ఎన్నికల్లో ఉనికి కోసం ఆరాటం.. పోరాటం చేస్తున్నా.. బీఆరెస్‌కు లోక్‌సభ ఎన్నికలు పెను సవాల్‌గా తయారవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర-రాష్ట్రాల్లోని అధికార జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లను కాదని ప్రజలు బీఆరెస్‌కు ఓటేయడం కష్టంగానే కనిపిస్తున్నది. బీఆరెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాలను గమనిస్తే గతం కంటే భారీగా సీట్లు తగ్గిపోతాయని అర్థమవుతున్నది.
ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలో కూడా కొన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే మాటేమోగానీ, పొరుగున ఉన్న ఏపీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మొదలైన బీఆరెస్ నేతల రాజీనామాల పర్వం ఇప్పుడు ఊపందుకుని, అక్కడ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితికి చేరుకుంటున్నది. సొంత రాష్ట్రంలో ఎన్నికల్లో ఎదురీదుతున్న బీఆరెస్ తిరిగి తెలంగాణ వాదాన్ని తలెకెత్తుకుంటున్న రీత్యా ఇక జాతీయ పార్టీ సర్కస్ ఫీట్లకు దూరంగా ఉండక తప్పని పరిస్థితుల్లో పడిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అధికారం కోల్పోయి లోక్‌సభ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను ఎదుర్కోవడంలో ఎదురీత సాగిస్తున్న బీఆరెస్ భవిష్యత్తుకు లోక్‌సభ ఎన్నికల్లో సాధించే ఫలితాలు కీలకం కానున్నాయి. అయితే వాస్తవ పరిస్థితులను అవగతం చేసుకోవడంలో విఫలమవుతూ తప్పటడుగులు వేస్తున్న బీఆరెస్ అధినాయకత్వం మాత్రం ‘మేం గేట్లు తెరిస్తే మా పార్టీలోకి కాంగ్రెస్ నుంచి వలసల వరదే’ అంటూ బీరాలు పలుపుకుతుంది. అధికార కాంగ్రెసోళ్లు ఒక ఎమ్మెల్యేను చేర్చుకుంటే మేం 10మందిని చేర్చుకుంటామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండటం కొసమెరుపు.