WhatsApp Status | వాట్సాప్ స్టేటస్‌లో ఇక 60 సెకన్‌ల వీడియోలు.. త్వరలో అందుబాటులోకి ఆప్షన్..!

WhatsApp Status : వాట్సప్ స్టేటస్‌లో ప్రస్తుతం గరిష్ఠంగా 30 సెకన్ల నిడివి వరకుగల వీడియోలను మాత్రమే పోస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. అంతకంటే పెద్ద వీడియోలను అప్‌లోడ్ చేయాలంటే మరో స్టేటస్ పెట్టుకోక తప్పదు. ఇలా వీడియో నిడివి ఎంత పెద్దగుంటే స్టేటస్ అప్‌డేట్ల సంఖ్య అంతలా పెరుగుతూ పోతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వాట్సప్ సిద్ధమైంది.
ఇక నుంచి 60 సెకన్ల నిడివి వరకు ఉన్న వీడియోలను సైతం స్టేటస్‌లో అప్‌లోడ్ చేసే సదుపాయాన్ని వాట్సాప్ కల్పించబోతున్నది. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వాబీటా వెల్లడించింది. బీటా వెర్షన్ 2.24.7.3 డౌన్‌లోడ్ చేసుకున్న వారికి ఈ ఫీచర్ దశల వారీగా అందుబాటులోకి వస్తుంది. త్వరలో మిగిలిన యూజర్లందరికీ ఇది అందుబాటులోకి రానుంది.
అదేవిధంగా పేమెంట్స్‌ను సైతం వాట్సాప్ మరింత సులభతరం చేస్తున్నది. ప్రస్తుతం వాట్సాప్‌లో చెల్లింపులు చేయాలంటే త్రీ డాట్స్ మెనూలో పేమెంట్స్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం లేకుండా మనం ఎంచుకున్న కాంటాక్ట్ చాట్‌లోనే పైభాగంలో క్యూఆర్ కోడ్ సింబల్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఇది కూడా ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉన్నది.