ఇండియా కూటమికి ఉమ్మడి కార్యాచరణ ఇంకెప్పుడు?

  • By: Somu    latest    Dec 15, 2023 12:01 PM IST
ఇండియా కూటమికి ఉమ్మడి కార్యాచరణ ఇంకెప్పుడు?
  • ఇప్పటికే ఎన్నికలకు బీజేపీ కసరత్తు
  • ప్రతిపక్ష కూటమి ఏర్పడినా.. కొరవడిన ఐక్యత!
  • కాంగ్రెస్‌ పార్టీ అనుసరించే వైఖరే కీలకం



(విధాత ప్రత్యేకం)


సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. మూడు రాష్ట్రాల్లో గెలిచిన కమలనాథులు రెట్టించిన ఉత్సాహంతో కేంద్రంలో హ్యాట్రిక్‌ కోసం అప్పుడే కసరత్తు మొదలుపెట్టారు. మూడు రాష్ట్రాల్లో ముగ్గురు కొత్త ముఖ్యమంత్రులను ఎంపిక చేసి అన్నివర్గాల వారికి రాజకీయంగా సమన్యాయం చేసేది బీజేపీనే అన్న సంకేతాలు పంపింది. ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుదేవ్‌ సాయి (ఆదివాసీ), మధ్యప్రదేశ్‌ మహేశ్‌ యాదవ్‌ (ఓబీసీ), రాజస్థాన్‌లో భజన్‌లాల్‌ శర్మ (ఓసీ) లకు అవకాశం కల్పించింది. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వీరిని ఎంపిక చేసిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాదు పార్టీలో సుదీర్ఘకాలంగా ఉంటూ ఏ వర్గంతో అంటగాకపోవడంతో వీరిపట్ల పార్టీ అధిష్ఠానం సానుకూలత వ్యక్తం చేసిందనే వాదన ఉన్నది.


కానీ ఇదంతా మోదీ-షా ల మార్క్‌ రాజకీయం అనేది వాస్తవం. ప్రధాని మోదీ తన 50 ఏళ్లకు పైగా ప్రజా జీవితంలో 15 ఏళ్లు ఆరెస్సెస్‌లో క్రియాశీల కార్యకర్తగా, 15 ఏళ్లు బీజేపీ ప్రచారక్‌గా, 15 ఏళ్లు గుజరాత్‌ సీఎంగా పనిచేసిన అనుభవం ఆయనకు పార్టీలో పట్టుదొరికేలా చేసింది. తాజాగా ఎంపిక చేసిన ముగ్గురు ముఖ్యమంత్రుల మూలాలు కూడా ఆరెస్సెస్‌ మొదలు ఏబీవీపీ, బీజేవైఎం, బీజేపీలో చాలాకాలం పార్టీ విధేయులుగా పనిచేసిన వారే కావడం గమనార్హం. అందుకే కాంగ్రెస్‌ పార్టీ ఎంత త్వరగా మేలుకొంటే అది ఆ పార్టీకి దేశానికి మంచిదే అనే వాదన ఉన్నది.


ఎవరికి వారే అన్నట్టు ఇండియా కూటమి


బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐక్యతా రాగం వినిపించినా ప్రస్తుతం ఎవరికి వారే అన్నట్టు ఉన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాలు ఐక్యంగానే ఉన్నాయనే సంకేతాన్ని పంపడానికి ఈ నెల 6న కాంగ్రెస్‌ పార్టీ కూటమి సమావేశం ఏర్పాటు చేసింది. నితీశ్‌కుమార్‌, మమతా బెనర్జీ ఇతర కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి రాలేమన్నారు. అఖిలేశ్‌ యాదవ్‌ మొదటి నుంచీ కాంగ్రెస్‌ వైఖరి పట్ల విముఖతతోనే ఉన్నారు.


పైగా మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కొన్ని సీట్లు ఇవ్వాలని కోరినా కమల్‌నాథ్‌ తోసిపుచ్చడంతో ఈ రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది. ఇండియా కూటమిలోని విపక్ష పార్టీలు ఇప్పుడు దూరంగా ఉండటానికి వాళ్లు చెప్పేకారణాల కంటే ఉత్తరాదిలో బీజేపీ, కాంగ్రెస్‌ నేరుగా తలపడే చోట ఆ పార్టీ ఓడిపోవడంతో కూటమిలోని ఇతర భాగస్వామ్యపక్షాలు ఆలోచనలో పడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే 2018లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయినా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు కాషాయపార్టీ కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.


టైమ్స్‌ నౌ సర్వేలో ఎన్డీయే ఆధిక్యం


ఇటీవల టైమ్స్‌ నౌ దేశవ్యాప్తంగా 543 స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది సర్వే నిర్వహించింది. అందులో బీజేపీ నేతృత్వంలోని భాగస్వామ్య పక్షాలకు 308-328 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 52-72, వైఎస్‌ఆర్‌సీపీ 24-25, డీఎంకే 20-24, టీఎంసీ 20-24, బీజేడీకి 13-15, బీఆర్‌ఎస్‌కు 3-5, ఆప్‌కు 4-7, ఇతరులకు 66-76 సీట్లు వస్తాయన్నది ఆ సర్వే సారాంశం. ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలల సమయం ఉన్నది. ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేలే పునరావృతం అవుతాయని చెప్పలేం.


అదే సమయంలో టైమ్స్‌ నౌ సర్వేపై పలు భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ సంగతి పక్కనపెడితే.. బీజేపీని ఎదుర్కొవాలంటే ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌ ఎంత అవసరమో, కాంగ్రెస్‌కు ప్రాంతీయ పార్టీలూ అంతే ముఖ్యమన్నది గుర్తించాలి. అందుకే ఈ నెల 19న ఢిల్లీలో జరగబోయే ఇండియా కూటమిలో ఉమ్మడి కార్యాచరణ, కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారు, కన్వీనర్‌గా ఎవరు ఉంటారన్న దానిపై దేశ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. దానికి అనుగుణంగా ఎన్నికల ప్రణాళిక రూపొదించుకుని పదేళ్ల ఎన్డీఏ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.


కాంగ్రెస్‌ వైఖరే కీలకం


కర్ణాటక, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో కాంగ్రెస్‌ ముఖాముఖి తలపడుతుంది. కాబట్టి ఇక్కడ ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలతో వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తున్నది. వీటితో పాటు యూపీ, ఢిల్లీ, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, కేరళ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో పట్టువిడుపులతో ముందుకు వెళ్లాలి. ప్రస్తుతం ఎన్డీఏ, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో ఇబ్బంది ఉండదు.


కానీ ఏ కూటమిలో లేకుండా ఉన్న పార్టీలతోనే ఇండియా కూటమికి ఎక్కువ నష్టం జరుగుతుంది. అంతేకాదు పరోక్షంగా అది బీజేపీకి మేలు చేస్తుందన్నది కొంతకాలంగా చూస్తున్నదే. పదేళ్ల మోదీ ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకోవాలంటే ముందుగా కూటమిలోని పార్టీలు సీట్ల పంపకంపై అవగాహనకు రావాలి. అసెంబ్లీ ఎన్నికలతో జాతీయ ఎన్నికలను ముడిపెట్టకుండా దేశ హితం కోసం కలిసి పనిచేస్తున్నామనే నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి.


ఎందుకంటే మోదీ ప్రభుత్వం పదేళ్ల కాలంలో అనేక ప్రజావ్యతిరేక విధానాలను తీసుకున్నా అంతా దేశం కోసం, ధర్మం కోసం అన్నట్టు ఆ పార్టీ వాట్సప్‌ యూనివర్సిటీ ద్వారా యువత మెదళ్లలోకి జొప్పించే ప్రయత్నం చేసి సక్సెస్‌ అయింది. ఈ అబద్ధాలను తిప్పికొట్టే వ్యూహాలు, యంత్రాంగం ఇండియా కూటమి ఏర్పాటు చేసుకోవాలి. అలా తాను నేరుగా తలపడే రాష్ట్రాలతో పాటు, భాగస్వామ్యపక్షాలను కలుపుకొని ఎన్నికలకు వెళితేనే కాషాయపార్టీని కట్టడి చేయడం వీలవుతుందనేది ప్రజాస్వామికవాదుల వాదన. అలాకాకుండా ఎవరికి వారు సొంత అజెండాతో పనిచేస్తే అది కూటమికి, దేశానికి నష్టం చేస్తుందని అంటున్నారు.