భగవంతునికి ఏ పూలతో పూజ చేయాలి..? ఎవరు చేయాలి?
విధాత: భౌతిక పూజ కోసం చాలా మంది తెలిసి చేస్తారో.. తెలియక చేస్తారో కానీ పరుగులు తీసి బయట ఎక్కడ పూలు కనిపించినా వాటిని తెచ్చి భగవంతుడికి సమర్పించి పూజ కానిచ్చేస్తారు. ఇంకొంత మంది అయితే డబ్బుతో కొన్న మాలలతో దైవాన్ని అలంకరించి పూజ చేస్తారు. కానీ దేవుడికి కావలసింది.. భౌతిక పూలు కాదు.. మానసిక పూలు. పత్రం ఫలం తోయం ఏమిచ్చావు అన్నది ముఖ్యం కాదు, దైవం కూడా స్వీకరించడు. ఎలాంటి మనస్సుతో.. నిర్మలత్వం.. ప్రశాంతతతో […]

విధాత: భౌతిక పూజ కోసం చాలా మంది తెలిసి చేస్తారో.. తెలియక చేస్తారో కానీ పరుగులు తీసి బయట ఎక్కడ పూలు కనిపించినా వాటిని తెచ్చి భగవంతుడికి సమర్పించి పూజ కానిచ్చేస్తారు. ఇంకొంత మంది అయితే డబ్బుతో కొన్న మాలలతో దైవాన్ని అలంకరించి పూజ చేస్తారు.
కానీ దేవుడికి కావలసింది.. భౌతిక పూలు కాదు.. మానసిక పూలు. పత్రం ఫలం తోయం ఏమిచ్చావు అన్నది ముఖ్యం కాదు, దైవం కూడా స్వీకరించడు. ఎలాంటి మనస్సుతో.. నిర్మలత్వం.. ప్రశాంతతతో ఇచ్చావు అన్నదే ప్రధానం. త్రికరణ శుద్ధితో అంటే మనసా వాచా కర్మణా పూజ చేయాలి.
మన కళ్లకు కనిపించే భౌతిక పూలతో ఆడంబరంగా.. పలువురి మెప్పు కోసం నటించే వారు చాలా మంది ఉన్నారు. అయితే మానసిక పూలతో చేసే పూజతో సంవత్సరాలు నటించడం.. ఆడంబరాలు చేయడం కష్టం. అది సాధ్యం కాదు.
దైవం మెచ్చే 8 పుష్పాలు..
శ్లో: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ
నిగ్రహః సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత
శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన తథైవచ
సత్యమష్టవిధం పుష్పం, శివ-విష్ణు ప్రీతికరం భవేత్
ఈ 8పుష్పాలతో అంటే ఈ గుణాలు ఎవరిలో ఉంటాయో వారు వేరే పూజలేవీ చేయనవసరం లేదు. వారి ప్రతీ మాట.. నడక.. క్రియ ఇలా ఏది చేసినా అది దైవారాధనయే. ఆ ఎనిమిది గుణాలను ఆచరణలో ఎలా పెట్టాలో తెలుసుకుందాం…
అహింసా: అంటే సమస్త జీవరాశులలో ఏ జీవిని మానసింకంగా కానీ భౌతికంగా కానీ బాధ పెట్టకుండా ఉండడం. పూజలో అహింసా పుష్పాన్నే భగవంతుడికి మొదట సమర్పించాలి.
ఇంద్రియ నిగ్రహం: మనసు ఇంద్రియాలను అదుపులో ఉంచడం. ఇష్టానుసారం ప్రవర్తించడం, మాట్లాడడం, తినడం లాంటి వాటిని నియంత్రణలో ఉంచి జీవించడమే రెండో పుష్పం.
దయ: ఆపదలో, కష్టాల్లో, బాధలో ఉన్న వారి పట్ల దయ కలిగి ఉండడం. వారికి చేతనైన సాయమందించడమే భగవంతుడికి సమర్పించే మూడో పుష్పం.
క్షమ: ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే తిరిగి వారితో కయ్యానికి వెళ్లకుండా ఓర్పుతో నిశ్చల మనస్తత్వంతో ప్రవర్తించడమే దైవానికి అర్పించే నాలుగో పుష్పం.
ధ్యానం లేదా శాంతి: ఈశ్వరుడిని నిరంతరం మనసులో స్మరిస్తూ ఆయనపై మనసు నిల్పడమే ఐదో పుష్పం.
తపస్సు: చేసే ప్రతి పనిలోనూ మనసా వాచా కర్మణా నియమాలను పాటించడం. త్రికరణ శుద్ధిగా మంచి నియమాలను పాటించడమే తపస్సు. ఇదే ఆరో పుష్పం.
జ్ఞానం: ఈ విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. ఏ వస్తువు మనది కాదు. ప్రజల్ని మోసం చేయవచ్చోమే కానీ పంచభూతాలను కాదు. ఈ విషయాలను తెలుసుకొని ఆచరిస్తూ పరమాత్మ వైపు అడుగులు వేయడమే జ్ఞానం. ఇది ఏడో పుష్పం.
సత్యం: ఇతరులను బాధ పెట్టకుండా నిజాన్ని వెలిబుచ్చడమే సత్యం. అంటే ప్రతి విషయంలో అబద్ధాలు చెప్తూ జీవించకుండా నిజాలు చెప్తూ జీవించడమే ఆ పరమాత్మకు మనం సమర్పించే ఎనిమిదో పుష్పం.
ఈ పుష్పాలతో దైవారాధన చేస్తే స్వామి కృపకు పాత్రులమవుతాము. మన అంతరంగంలో ఉండే ఈ పుష్పాలు ఎప్పుడూ తాజాగా ఉంటాయి. వాడిపోవడమనేదే ఉండదు. ఇవి ఎంత ధనం వెచ్చించినా బయట దొరకవు.