Nalgonda
విధాత: పది పరీక్షల మూల్యాంకనంలో జరిగిన తప్పులు ఓ నిరుపేద విద్యార్థి ఉన్నత చదువుల ఆశలకు ప్రతిబంధకమయ్యాయి. వార్షిక పరీక్షల ఫలితాల్లో 10జీపీఏకు బదులుగా తప్పుడు కౌంటింగ్‌తో 9.8 జీపీఏగా ఫలితాలు వెల్లడించడంతో తాను అనుకున్న కళాశాలల్లో సీటు నష్టపోయానంటు ఇందుకు ఎవరు బాధ్యులంటు బాధిత విద్యార్థి విద్యాశాఖను ప్రశ్నిస్తున్నాడు.
నల్లగొండ జిల్లా చండూర్ మండలం రేగట్ట గ్రామం పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన గొలనుకొండ శ్రవణ్ మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పదవ తరగతి చదివాడు. శ్రవణ్‌కు మార్చి 2023లో జరిగిన పదో తరగతి ఫలితాల్లో 9.8 గ్రేడ్ పాయింట్లు వచ్చాయి. ఎప్పుడు స్కూల్ టాపర్ గా ఉండే శ్రవణ్ కు10 గ్రేడ్ పాయింట్లు రాకపోవడాన్ని అనుమానించిన పాఠశాల యాజమాన్యం విద్యార్థితో రీకౌంటింగ్ కు ఎస్‌ఎస్‌సీ బోర్డుకు దరఖాస్తు చేయించింది.
బోర్డు నుంచి రీ-కౌంటింగ్ సమాధాన పత్రం జీరాక్స్ కాపీ పోస్టులో బుధవారం సాయంత్రం అందింది. అది తెరిచి చూస్తే తెలుగులో పార్ట్-ఏ లో 60 మార్కులకు 57 మార్కులని, పార్ట్- బీలో 20 మార్కులకు 19 మార్కులని, మొత్తం మార్కులు 66 అని ఉంది. వాస్తవంగా మొత్తం మార్కులు 76 అయితే 66 గా వేసామని, నీ మార్కులు 76, ఇంటర్నల్ మార్కులు 20 కలిపితే మొత్తం 96 మార్కులతో 10/10 జీపీఏ సాధించావని సవరించిన మెమోను, లెటర్ ను శ్రవణ్‌కు బోర్డు పంపించింది.
ఫలితాల్లో జరిగిన పొరపాటును తెలుసుకున్న విద్యార్థితో పాటు తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఎస్‌ఎస్‌సీ బోర్డు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థి శ్రవణ్ మాట్లాడుతు పదవ తరగతి ఫలితాలు మొదటగా ప్రకటించినప్పుడు 10/10 జీపీఏ వచ్చి ఉంటే రజక కులంలో పుట్టిన నాకు బీసీ రిజర్వేషన్ ద్వారా బాసరలో త్రిబుల్ ఐటీ సీటు వచ్చేదని లేదా ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫ్రీ సీటు వచ్చి ఉండేదని, అవన్నీ ఈరోజు నేను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
నేను బాగా చదువుతాననే నమ్మకంతో మా అమ్మానాన్నలు అప్పులు చేసి చదివిస్తున్నారని, పేపర్లు దిద్దే ఉపాధ్యాయుల పొరపాటు వలన నేను ఈరోజు అన్ని అవకాశాలను కోల్పోయానని, భవిష్యత్తులో నాలాంటి పరిస్థితి ఏ విద్యార్థికి రాకూడదని, నాకు జరిగిన అన్యాయానికి బాధ్యులు ఎవరు ? అని ప్రశ్నించాడు.
ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు, శ్రద్ధ వహించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, నాలాగా ఇంకెవరు నష్టపోకుండా చూడాలన్నారు. గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ బోర్డు తప్పిదంతో తెలివైన విద్యార్థి గొలనుకొండ శ్రవణ్ ఈరోజు మంచి విద్యావకాశాలు కోల్పోయాడని, ఇటువంటి పొరపాట్లు జరగకుండా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థి శ్రవణ్ ను విద్యాసంస్థల తరుపునా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు.