YCP, BRS చెలగాటం.. BJPకి ప్రాణ సంకటం.. APలో బీజేపీకి బీఆర్‌ఎస్ చెక్ పెట్టనున్నదా?
YCP, BRS మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందా..!! విధాత: ఏపీలో బీజేపీ నేతలకు బీఆర్‌ఎస్ వేదిక కానున్నదా? అంటే ఔననే అంటున్నారు. తోట చంద్రశేఖర్‌ను బీఆర్‌ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత అక్కడ సభ ఏర్పాటు.. పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అది ఆచరణలో జరగలేదు. మహారాష్ట్రలో సభ ఏర్పాటు చేసి కొంతమంది నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో పార్టీ విస్తరణపై కేసీఆర్ దృష్టి సారించలేదా? […]

YCP, BRS మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందా..!!
విధాత: ఏపీలో బీజేపీ నేతలకు బీఆర్‌ఎస్ వేదిక కానున్నదా? అంటే ఔననే అంటున్నారు. తోట చంద్రశేఖర్‌ను బీఆర్‌ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత అక్కడ సభ ఏర్పాటు.. పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అది ఆచరణలో జరగలేదు. మహారాష్ట్రలో సభ ఏర్పాటు చేసి కొంతమంది నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో పార్టీ విస్తరణపై కేసీఆర్ దృష్టి సారించలేదా? లేక బీజేపీలో ఉన్న నేతలను పార్టీలోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అక్కడి బీఆర్‌ఎస్ నేతల మాటలు చూస్తుంటే అదే అనిపిస్తున్నది.
మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్ బాబులు సోము వీర్రాజు వైఖరి వల్లే పార్టీని వీడామని చెబుతున్నారు. రావెల ఇప్పటికే బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోగా, కన్నాను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న రావెల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అభివృద్ధి లేక ఇక్కడి ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రానికి వలస పోతున్నారని ఆయన అన్నారు.
ఏపీలో కుల రాజకీయాలతో 5కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. సోము వీర్రాజును భరించలేకనే తాను ముందుగా బీజేపీ నుంచి బైటికి వచ్చినట్టు, ఆయన వైఖరితో ఏపీలో బీజేపీ తర్వలోనే ఖాళీ అవుందన్నారు. రావెల వలె కన్నా కూడా సోము వీర్రాజునే టార్గెట్ చేశారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నా, వీర్రాజు వైఖరి నచ్చకే పార్టీ వీడాల్సి వచ్చిందన్నారు.
కన్నా లక్ష్మీనారాయణ తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదంటూనే తానేమిటో పార్టీ పెద్దలకు తెలుసు అన్నారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వారాహి పూజ సమయంలో బీజేపీలో పొత్తులోనే ఉన్నామని జనసేన అధినేత చేసిన ప్రకటనను వీర్రాజు గుర్తు చేశారు. అయితే ఈ మూడు పార్టీలు విడిగా పోటీ చేస్తే వైసీపీ ప్రభుత్వానికి చెక్ పడుతుందని ఇటీవల సర్వేలు వెల్లడిస్తున్నాయి. అలాకాకుండా ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే అంతిమంగా అది జగన్‌కే లాభం జరుగుతుందనేది కూడా ఆ సర్వేల సారాంశం.
ప్రధాని కూడా వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని ఆ మధ్య అక్కడి పర్యటనలో నేతలకు సూచించారు. దీంతో ఏపీలో బీజేపీని దెబ్బకొట్టి జగన్‌కు పరోక్షంగా మేలు చేయాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ అధినేత ఉన్నారా? అనేది ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా 40-50 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి అందులో మెజారిటీ సాధించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఏపీలో 25 సీట్లు ఉన్నాయి. అందులో మెజారిటీ సీట్లు వైసీపీ, బీఆర్‌ఎస్‌లే చేజిక్కించుకునేలా లోపాయికారి ఒప్పందం ఏమైనా జరిగిందా? అనే వాదనలను కొట్టిపారేయలేమంటున్నారు. ఎందుకంటే ఏపీలో ఎంపీలు ఏ పార్టీ నుంచి గెలిచినా కేంద్రం తెచ్చే బిల్లులకు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి బీఆర్‌ఎస్ అధినేత దాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం.
బీజేపీ విధానాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో కేసీఆర్ కొంతకాలం కిందట సమావేశమయ్యారు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఏపీలో ఎలా ముందుకు వెళ్లాలన్నది ఇరువురి మధ్య చర్చ జరిగే ఉంటుందని, దాన్నే అమలు చేస్తున్నారని అంటున్నారు.