YS Sharmila | షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారా? పొత్తు పెట్టుకుంటారా?

YS Sharmila | విధాత‌: వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిల రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? తెలంగాణ కోడలిగా ఈ ప్రాంతానికి చెందిన తాను తెలంగాణ కోసమే పార్టీ పెట్టానని గతంలో చెప్పిన మాటలకే కట్టుబడి ఉంటారా? లేక ఏపీలో జరుగుతున్న రాజకీయ పొత్తులకు అగుణంగా తాను అడుగులు వేయబోతున్నారా? ఏపీ రాజకీయాలపై ఆమె దృష్టి సారించారా? అంటే రాజకీయవర్గాల్లో ఔననే సమాధానం వస్తున్నది. షర్మిల కాంగ్రెస్‌ ఫార్టీలో చేరుతారనే ప్రచారం కొన్నిరోజులుగా జరుగుతున్నప్పటికీ […]

YS Sharmila | షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారా? పొత్తు పెట్టుకుంటారా?

YS Sharmila |

విధాత‌: వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిల రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? తెలంగాణ కోడలిగా ఈ ప్రాంతానికి చెందిన తాను తెలంగాణ కోసమే పార్టీ పెట్టానని గతంలో చెప్పిన మాటలకే కట్టుబడి ఉంటారా? లేక ఏపీలో జరుగుతున్న రాజకీయ పొత్తులకు అగుణంగా తాను అడుగులు వేయబోతున్నారా? ఏపీ రాజకీయాలపై ఆమె దృష్టి సారించారా? అంటే రాజకీయవర్గాల్లో ఔననే సమాధానం వస్తున్నది. షర్మిల కాంగ్రెస్‌ ఫార్టీలో చేరుతారనే ప్రచారం కొన్నిరోజులుగా జరుగుతున్నప్పటికీ ఆమె దాన్ని ఖండించారు.

అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం షర్మిల ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కలిసి అభినందించారు. దానికి రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని డీకేతో తమ కుటుంబానికి ఉన్న సుదీర్ఘ కాల అనుబంధంతోనే కలిసినట్టు వివరణ ఇచ్చారు. కానీ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ భేటీ అయినట్టు సమాచారం. ఆమె పార్టీ ని కాంగ్రెస్‌ విలీనం చేస్తారనే అంశంపై రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లక ముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు ముఖ్య నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని, తనను ఆశీర్వదించాలని అక్కడ బహిరంగసభ పెట్టి విజ్ఞప్తి చేశారు. ఆ సభకు వచ్చి విజయమ్మ కూడా తన బిడ్డను ఆదరించాలని కోరారు. ఆ సమయంలోనే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆపార్టీకి చెందిన ఒక్క అభ్యర్థిని కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వబోనని శపథం చేశారు. ఆయన కూడా షర్మిలతో భేటీ అయ్యారు.

దీంతో ఆయన షర్మిల పార్టీలో చేరుతారా? లేక షర్మిల పార్టీతో పొత్తుపెట్టుకుంటారా? అనే చర్చ జరిగింది. ఇవన్నీ ప్రచారాలుగానే మిగిలిపోయి ఆయన కాంగ్రెస్‌ చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం నడిబొడ్డునే బహిరంగ సభ ద్వారా బీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసురుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో కాంగ్రెస్‌ సహకారం లేకుండా షర్మిల పాలేరు గెలవడం అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది. అంతేకాదు తెలంగాణలో పాదయాత్ర చేస్తూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి.

ఆమె పాదయాత్ర అంశం హైకోర్టు వరకు వెళ్లింది. బీఆర్‌ఎస్‌ నేతలపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను హైకోర్టు కూడా తప్పుపట్టింది. దీంతో ఇక్కడ ఎంత చేసినా రాజకీయంగా ప్రయోజనం లేదనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నది. ఇక్కడ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. బీజేపీ పోటీలో ఉన్నా ఆపార్టీ ప్రభావం కొన్ని స్థానాలకే పరిమితమైంది. అందుకే కాంగ్రెస్‌లో చేరడానికి షర్మిలకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే అందుకు సుముఖంగానే ఉన్నట్టు.. దీనిపైనే డీకే, కేసీ వేణుగోపాల్‌లతో షర్మిల పార్టీకి చెందిన ముఖ్య నేతలు చర్చించినట్టు సమాచారం.

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని అంటున్నారు. బీజేపీ కూడా ఏపీలో తన ఉనికిని చాటుకోవడానికి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి లాంటి వాళ్లను పార్టీలో చేర్చుకున్నది. వైసీపీ వర్సెస్‌ ప్రతిపక్షాలు అంటున్న ఈ సమయంలో ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తే కొంత పుంజుకోవడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని వైతెపా నేతలు కాంగ్రెస్‌ పెద్దల వద్ద వ్యక్తం చేసినట్టు సమాచారం. వైఎస్‌ఆర్‌ అభిమానులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఆయన ప్రభావం ఏపీలోనే ఎక్కువ ఉంటుంది.

వైఎస్‌ కుటుంబానికి ఏపీలో ఉన్నంత ఆదరణ తెలంగాణలో ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కనుక షర్మిల కాంగ్రెసపార్టీలో చేరుతారా? ఆపార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అన్న విషయాలపై స్పష్టత రాహుల్‌గాంధీ విదేశీ పర్యటన తేలవచ్చు అంటున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రాహుల్‌ గాంధీ పుట్టినరోజు సందర్భంగా షర్మిల ఆయనకు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ కుటుంబం దూరమైనప్పటి నుంచి ఎప్పుడూ ఇలా విషెస్‌ చెప్పకపోవడం గమనార్హం.