నాలుగేళ్ల కొడుకును ఎందుకు చంపింది? ఆమె భర్త ఎక్కడ?

బెంగ‌ళూరుకు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకురాలు గోవాలో తన నాలుగేళ్ల కొడుకును చంపేసింది

నాలుగేళ్ల కొడుకును ఎందుకు చంపింది? ఆమె భర్త ఎక్కడ?
  • గోవాలో బెంగ‌ళూరుకు చెందిన సీఈవో ఘాతుకం
  • మృతదేహంతో కర్ణాటక వెళ్లే ప్ర‌య‌త్నంలో పోలీసుల‌కు
  • చిక్కిన స్టార్టప్ వ్యవస్థాపకురాలు సుచనా సేథ్

విధాత‌: బెంగ‌ళూరుకు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకురాలు గోవాలో తన నాలుగేళ్ల కొడుకును చంపేసింది. బాలుడి మృత‌దేహాన్ని బ్యాగ్‌లో కుక్కి క‌ర్ణాట‌కకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించి పోలీసుల‌కు ప‌ట్టుబ‌డింది. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్‌కు చెందిన‌ సహ వ్యవస్థాపకురాలు 39 ఏండ్ల‌ సుచనా సేథ్ శ‌నివారం తన నాలుగేండ్ల కుమారుడితో కలిసి ఉత్తర గోవాలోని కాండోలిమ్‌లో ఓ హోటల్‌లో దిగింది. అక్కడ‌ తన కొడుకును హత్య చేసింది. మృత‌దేహాన్ని బ్యాగ్‌లో కుక్కివేసింది. దానిని తీసుకుని ట్యాక్సీలో క‌ర్ణాట‌క‌కు బ‌య‌లుదేరింది. సోమవారం ఆమె హోట‌ల్ నుంచి చెక్ఔట్ అయింది. హోట‌ల్‌ నుంచి ఒంటరిగా బయటకు వ‌చ్చిన ఆమె బెంగళూరుకు టాక్సీ బుక్ చేయమని హోటల్ సిబ్బందిని కోరింది. విమానంలో వెళ్లమని సలహా ఇచ్చినప్పటికీ ఆమె ట్యాక్సీనే కావాల‌ని పట్టుబట్టింది.


ఆమెతో ఉండాల్సిన త‌న కొడుకు కనిపించకుండా పోయినట్టు హోట‌ల్‌ సిబ్బంది గమనించారు. ఆమె వెళ్లిన తర్వాత హౌస్ కీపింగ్ సిబ్బంది కూడా ఆమె గ‌దిలో రక్తపు మరకలను గమనించారు. అవి తన బహిష్టుస్రావం మరకలని సర్దిచెప్పింది. అయితే.. హోటల్‌ యాజమాన్యానికి అనుమానం వచ్చి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఆమె అప్ప‌టికే క‌ర్ణాట‌క ప‌రిధిలోకి వెళ్లిపోయింది. పోలీసులు ట్యాక్సీ డ్రైవ‌ర్ ఫోన్‌కు కాల్ చేసి ఆమెను విచారించారు. తన కొడుకు గురించి అడగ్గా, అతను స్నేహితుడితో ఉన్నాడని, ఆమె చిరునామా ఇచ్చింది. విచారించ‌గా, అది నకిలీ అని తేలింది. ఆమె పొంత‌న లేని స‌మాధానాలు చెప్పడంతో స‌మీపంలోని పోలీస్‌స్టేష‌న్‌కు ఆమెను తీసుకెళ్లాల‌ని పోలీసులు ట్యాక్సీ డ్రైవ‌ర్‌ను ఆదేశించారు.


సోమవారం కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీస్‌స్టేష‌న్‌లో ఆమె లగేజ్‌ను త‌నికీ చేయ‌గా, బ్యాగ్‌లో ఆమె కుమారుడి మృతదేహం ల‌భించింది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, క‌న్న కొడుకును చంప‌డానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. కాగా, మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ లింక్డ్‌ఇన్ పేజీ ప్రకారం.. సుచ‌నా సేథ్ టాప్ “2021 సంవ‌త్స‌రంలో ఏఐ ఎథిక్స్‌లో 100 మంది తెలివైన మహిళల” జాబితాలో ఉన్నారు.


భర్తతో విభేదాలు

భర్తతో ఆమెకు విభేదాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఆమె భర్త ప్రస్తుతం జకార్తాలో ఉన్నారు. ఈ ఘటనపై ఆయనకు సమాచారం అందించారు. తన భర్తతో విడాకుల ప్రక్రియ నడుస్తున్నదని ఆమె పోలీసులు చెప్పినట్టు బెంగళూరు నార్త్‌ ఎస్పీ నిధి వలసన్‌ మంగళవారం మీడియాకు తెలిపారు. ఆమె భర్త పేరు వెంట్‌రామన్‌. ఆయన కేరళకు చెందినవారు. వీరిద్దరికీ 2010లో వివాహం జరిగినట్టు కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు హత్యకు గురైన కుమారుడు 2019లో జన్మించాడు.


ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపడంతో 2020 నుంచి విడాకుల కేసు నడుస్తున్నది. తన కుమారుడిని వెంకట్‌రామన్‌ చూడకూడదనే పంతంతో కొడుకుతో కలిసి గోవా వెళ్లేందుకు ప్లాన్‌ చేసిందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. తన కుమారుడిని ఎందుకు హత్య చేసిందనే విషయంలో ఇంకా పోలీసులు నిర్ధారణకు రాలేదు. ఆమెను ఇంకా ఇంటారేట్‌ చేయలేదని చెప్పారు. బాలుడి మృతికి కారణం ఏంటనేది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టంగా తెలుస్తుందన్నారు.