బిడ్డను గుండెలకు హత్తుకొని 16వ అంతస్తుపై నుంచి దూకిన తల్లి
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. ఆర్నెళ్ల బిడ్డను గుండెలకు హత్తుకొని 16వ అంతస్థు నుంచి దూకి మహిళ (33) ఆత్మహత్య చేసుకున్నది

- నోయిడాలో ఆర్నెళ్ల బిడ్డతో 16వ అంతస్థునుంచి దూకి బలవన్మరణం
- యూఎస్ నుంచి వచ్చి తల్లి గారింట్లో దారుణం
విధాత: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. ఆర్నెళ్ల బిడ్డను గుండెలకు హత్తుకొని 16వ అంతస్థు నుంచి దూకి మహిళ (33) ఆత్మహత్య చేసుకున్నది. అమెరికా నుంచి ఇటీవలే తల్లిగారింటికి వచ్చిన ఆమె మంగళవారం అర్ధరాత్రి బిడ్డతోసహా బలవన్మరణానికి పాల్పడింది. ఆర్నెళ్ల క్రితం బిడ్డ పుట్టిననాటి నుంచి తనను అనారోగ్య సమస్యలు వేధిస్తుండటంతో మానసిక ఒత్తడికి గురైన తల్లి కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. తల్లి బిడ్డ ఇద్దరూ స్పాట్‌లోనే చనిపోయారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..
నోయిడాకు చెందిన మహిళకు 2021లో వివాహమైంది. భర్తతో కలిసి అమె అమెరికాలో వెళ్లిపోయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. రెండు వారాల క్రితమే తల్లిగారి ఇల్లు అయిన గ్రేటర్ ఉత్తర నోయిడాకు వచ్చింది. రెండు రోజుల క్రితం ఆమె నాలుగేండ్ల కుమారుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. భర్త తిరిగి అమెరికా వెళ్లిపోయాడు.
మంగళవారం రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత ఎవరి గదుల్లోకివారు వెళ్లి నిద్రకు ఉపక్రమించారు. కానీ, ఆమె ఆర్నెళ్ల బిడ్డను తన ఒళ్లోకి తీసుకొని 16వ అంతస్థు నుంచి దూకేసింది. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావమైన తల్లి బిడ్డ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఆరు నెలల క్రితం ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. నాటి నుంచి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నది. ఈ క్రమంలో ఆమె తీవ్ర ఒత్తిడికి గురై మానసికంగా బాగా కృంగిపోయింది. ఈ నేపథ్యంతో ఆత్మహత్య నిర్ణయం తీసుకొని ఉంటుందని ఆమె సోదరుడు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు జరుపుతున్నారు.