ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ ఆసుపత్రి.. ఆరోగ్య మైత్రి క్యూబ్‌ను ఆవిష్కరించిన భారత్
ప్రకృతి విపత్తు (Disaster) లను, మానవ ప్రమేయ ప్రమాదాలను ఎదుర్కొనే క్రమంలో భారత్ (India) కీలకముందడుగు వేసింది.

విధాత: ప్రకృతి విపత్తు (Disaster) లను, మానవ ప్రమేయ ప్రమాదాలను ఎదుర్కొనే క్రమంలో భారత్ (India) కీలకముందడుగు వేసింది. ప్రపంచంలోనే మొదటి పోర్టబుల్ (ఎక్కడ కావాలంటే అక్కడే ఏర్పాటు చేసే) ఆసుపత్రి (First Portable Hospital) ని ఆవిష్కరించింది. ఆరోగ్య మైత్రి క్యూబ్ అని పిలిచే ఆసుపత్రిని ఆరోగ్య శాఖ, రక్షణ శాఖ, జాతీయ భద్రతా మండలి సంయుక్తంగా రూపొందించాయి.
భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహ్యోగ్, హిత, మైత్రి (భీష్మ్) కార్యక్రమంలో భాగంగా ఈ పోర్టబుల్ ఆసుపత్రిని ఆవిష్కరించారు. ఏదైనా విపత్తులు సంభవించినపుడు ఆ ప్రదేశంలోనే ఈ క్యూబ్ సాయంతో గరిష్ఠంగా 200 మందికి వైద్య సేవలు అందించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఆసుపత్రిని అసెంబుల్ చేసి చికిత్స మొదలు పెట్టడానికి ఒక గంట కంటే ఎక్కువ సమయం పట్టదని ప్యాకర్స్ ప్రొడక్ట్స్ ఎండీ అమిత్ చౌధురి తెలిపారు.
ఈ పోర్టబుల్ ఆసుపత్రిని ఎక్కడైనా ఉపయోగించవచ్చు. వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, కార్చిచ్చులు, యుద్ధాలు అన్ని పరిస్థితుల్లోనూ దీనిని గంటలో ఏర్పాటు చేయొచ్చు. ఏ సమయంలోనైనా 200 మందికి అత్యున్నత వైద్యం అందించగలం అని ఆయన అన్నారు. ఒక వేళ అత్యవసరమైతే ఎక్కువ మంది సిబ్బంది సాయంతో 15 నిమిషాల్లోనే ఈ క్యూబ్‌ను అసెంబుల్ చేయొచ్చని భీష్మ్ ఫోర్స్ అదిపతి రిటైర్డ్ ఎయిర్ వైస్ మార్షల్ తన్మోయ్ రాయ్ అన్నారు. దీని కోసం సిబ్బందికి అత్యున్నత శిక్షణ ఇచ్చామని ఆయన అన్నారు.
ఈ పోర్టబుల్ ఆసుపత్రిలో ఏమేం ఉంటాయి?
ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకునే ఈ పోర్టబుల్ ఆసుపత్రిలో 20 శస్త్రచికిత్సలు చేయడానికి అవసరమైన పరికరాలు ఉంటాయి. 72 రకాల పరీక్షలు చేయడానికి సరిపోయే వసతులతో పాటు బుల్లెట్ గాయాలు, కాలిన గాయాలు, వెన్ను, తల, ఛాతికి తగిలే గాయాలు, రక్తం పోవడం వంటి ప్రాణాంతక సమస్యలకు చికిత్స చేయొచ్చు. ఆపరేషన్ థియేటర్, మినీ ఐసీయూ, వెంటిలేటర్లు, రక్త పరీక్షల సామగ్రి, ఎక్స్ రే మిషన్, వంట గది, ఆహారం, నీరు, పవర్ జనరేటర్ అన్నీ ఈ ఆరోగ్య మైత్రి క్యూబ్‌లో ఉంటాయని అధికారులు తెలిపారు.