యాదగిరిగుట్ట ఈవో బదిలీ.. భట్టి, సురేఖల వివాదం ఎఫెక్ట్‌

యాదగిరిగుట్ట దేవస్థానం వీఐపీలకు ఆశీర్వచనం సమయంలో కూర్చోబెట్టేందుకు అవసరమైన 10 కొత్త పీటలను కొనుగోలు చేసింది. కొత్త పీటలు అన్ని ఒకే ఎత్తులో సమానంగా ఉండేలా చూసి మరి కొనుగోలు చేశారు.

  • By: Somu    latest    Mar 14, 2024 10:56 AM IST
యాదగిరిగుట్ట ఈవో బదిలీ.. భట్టి, సురేఖల వివాదం ఎఫెక్ట్‌
  • కొత్తగా పది పీటల కొనుగోలు

విధాత, హైదరాబాద్ : యాదగిరిగుట్ట ఆలయ ఈవో రామకృష్ణారావుపై ప్రభుత్వం బదిలీ వేటువేసింది. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఆలయ ఈవో రామకృష్ణ ప్రొటోకాల్ పాటించలేదన్న కారణంతో ఆయనను దేవాదాయ ధర్మాదాయ శాఖ బదిలీ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ పట్ల అమర్యాదగా వ్యవహరించడం రామకృష్ణారావుపై వేటుకు దారితీసింది.


నూతన ఈవోగా నియామితులైన యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఒకవైపు బ్రహ్మోత్సవాలు జరుగుతుండగానే ఈవో బదిలీ జరుగడం గమనార్హం. ఇటీవల ఆలయానికి వచ్చిన సందర్భంగా వేద ఆశీర్వచనం సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల కంటే కాస్త తక్కువ ఎత్తున్న స్టూల్‌పై డిప్యూటీ సీఎం భట్టిని, కొండా సురేఖలను కూర్చోబెట్టారు. దీంతో భట్టి, సురేఖలకు అవమానం అంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం స్పందించి తనకు ఎలాంటి అవమానం జరుగలేదని, తానే కావాలని కింద కూర్చున్నానని తెలిపారు. ప్రభుత్వం మాత్రం ఈ వివాదంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆలయ ఈవోపై బదిలీ వేటుతో చర్యలు తీసుకుంది.

యాదాద్రిలో పది కొత్త పీటల కొనుగోలు

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే 10 సమాంతర పీటలను ఆలయ సిబ్బంది కొనుగోలు చేసింది. పాతవి 4, కొత్తవి 10 పీటలతో సహా ఒకేసారి 14 మంది వీవీఐపీలకు వేద ఆశీర్వచనం చేసేలా దేవస్థాన అధికారులు చర్యలు తీసుకున్నారు.