Yadagirigutta
విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండ కింద వాహనాల పార్కింగ్ ప్రాంతం ఒక్క వర్షానికే చెరువులా మారి వాహనాలు నీట మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. ఒక్కో కారు సగం ఎత్తు వరకు నీటిలో మునిగిపోగా వాహనదారులు వాటిని బయటకు తీసుకొని తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పలు కార్లు, ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు, ఇంజన్లలోకి నీళ్లు వెళ్లడంతో అవి స్టార్ట్ కాకుండా మొరాయించాయి. ప్రయాణికులు వాటిని తీసుకొని తిరిగి వెళ్ళడంలో నానా పాట్లు పడ్డారు. వర్షం నీరు పార్కింగ్ ఏరియా నుండి వచ్చింది వచ్చినట్లుగా వెళ్లిపోయే డ్రైనేజీ నిర్మాణాలు లేకపోవడంతో యాదాద్రి అభివృద్ధి పనులలో లోపాలకు నిదర్శనంగా నిలిచింది.
కొండపైన భక్తులకు వర్షం సమయంలో మాఢవీధుల్లో నిలువ నీడ లేకపోవడంతో పలువురు వర్షంలోనే తడిసిపోగా మరికొందరు ఆలయ ప్రాకారాల మధ్య నిలుచుని వర్షం బారిన పడకుండా తలదాచుకున్నారు. ఆలయ ప్రాకారాల మధ్య కూడా అక్కడక్కడ వర్షం నీళ్లు పడటం కనిపించింది.
మాడవీధుల్లో భక్తుల కోసం ఏర్పాటుచేసిన చలవ పందిళ్లు గాలివాన వర్షానికి పడిపోయాయి. 1000 కోట్ల కు పైగా వెచ్చించి అభివృద్ధి చేసిన ఆ యాదాద్రి ఆలయం, ప్రాంగణ పరిసరాల్లో భక్తులకు ఎండా, వానల నుండి తగిన రక్షణ లేకపోవడం విచారకరమని భక్తజనం వాపోయారు.