మళ్లీ తెరపైకి ఆలూరు సీటు వివాదం

ఆంధ్రప్రదేశ్ లో రానున్న శాసన సభ, లోక్ సభ ఎన్నికలకు అధికార పార్టీ వైసీపీలో సీట్ల సర్దుబాటు ఉత్కంట రేపుతోంది

  • By: Somu    latest    Jan 26, 2024 11:05 AM IST
మళ్లీ తెరపైకి ఆలూరు సీటు వివాదం
  • జయరాంకు మంగళంపాడేందుకు సిద్ధమైన వైసీపీ?
  • కర్నూలు ఎంపీగా బీవై రామయ్య పేరు ఖరారు?
  • కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న వైసీపీ మంత్రి జయరాం?


విధాత: ఆంధ్రప్రదేశ్ లో రానున్న శాసన సభ, లోక్ సభ ఎన్నికలకు అధికార పార్టీ వైసీపీలో సీట్ల సర్దుబాటు ఉత్కంట రేపుతోంది. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు టికెట్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ప్రతిగా కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేయాలని గుమ్మనూరు జయరాంకు సూచించారు.


ఈక్రమంలో ఆలూరు టికెట్ కే పట్టుబట్టిన జయరాంకు.. అధిష్టానం ససేమిరా అంది. అప్పటినుంచి పార్టీ అధినాయకులకు జయరాం అందుబాటులో లేకుండాపోయారు. పలు సందర్భాల్లో అతన్ని సంప్రదించే ప్రయత్నం చేసినా లాభంలేకుండా పోయిందని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. తనకు కర్నూలు ఎంపీ టికెట్ తో పాటు ఆలూరు ఎమ్మెల్యే టికెట్ తనయుడు ఈశ్వర్ కు ఇవ్వాలని ప్రతిపాదనను జయరాం అధిష్టానం ముందు ఉంచినట్లు సమాచారం.


మరోవైపు జయరాం త్వరలో ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారన్న చర్చ జోరందుకుంది. ఈ రాజకీయ పరిణామాలతో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం మంత్రి జయరాంకు షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్యను రంగంలోకి దింపాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రానున్న ఐదో జాబితాలో ఆయన పేరును ఖరారు చేసినట్లు ఆపార్టీ వర్గాల సమాచారం. కాగా జయరాం వైసీపీకి గుడ్ బై చెబుతారనుకుంటే.. అంతకు ముందే అధిష్టానం ఆయనకు మంగళం పాడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.


నరసరావుపేట ఎంపీ స్థానం పేచీ


పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ స్థానం భర్తీ వైసీపీకి తలనొప్పిగా మారింది. సిటింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు టికెట్ నిరాకరిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగరేసింది. రానున్న ఎన్నికలకు ఎంపీ అభ్యర్థిగా బీసీ నేతకు అవకాశం ఇస్తున్నట్లు ఆపార్టీ నేతలు చెబుతున్నారు. సిటింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు ఎంపీ స్థానానికి మారుస్తూ నిర్ణయించారు. దీనికి లావు ఒప్పుకోకపోవడంతో తెరపైకి కొత్త నేతలు వస్తున్నారు. ఈ స్థానాన్ని బీసీలకు కేటాయించడంతో అనిల్‌కుమార్‌ యాదవ్ ను పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.


వైసీపీకి రాజీనామా యోచనలో ‘మక్కేన’


వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కేన మల్లికార్జునరావు వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ఆయన మంచి పట్టున్న నేతగా ఎదిగారు. సీట్ల మార్పుచేర్పులపై అసంతృప్తిగా ఉన్న మక్కేన.. వైసీపీకి రాజీనామా చేస్తే ఆయన బాటలో పలువురు నేతులు పయనించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు పల్నాడు జిల్లాతో పాటు అటు ప్రకాశం, కర్నూలు జిల్లాలకు కూడా రాజీనామా సెగ తగులుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఇప్పటికే జనసేన నేతలు మక్కేన మల్లికార్జునతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది.