ఉద్యోగం, ఉపాధి వేటలో శవాలవుతున్న యువత
తాజాగా 30 అడుగుల ట్రంప్ గోడ దూకి బ్రజ్‌కుమార్ మృతి ఉత్తర గుజరాత్ నుంచి అక్రమ మార్గాన విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో.. విధాత: ఉత్తర గుజరాత్ గంధీనగర్ జిల్లా కలోల్ సమీపంలోని బోరిసానా గ్రామం మునుపటిలా లేదు. ఎక్కడ చూసినా విషాధ ఛాయలు. ఎవరూ ఎవరితో మాట్లాడటం లేదు. కారణం.. ఆ ఊరినుంచి నెల రోజుల కిందట విహార యాత్రకని వెళ్లిన బ్రజ్‌కుమార్ యాదవ్ మెక్సికో సరిహద్దులో ట్రంప్‌వాల్ దూకుతూ చనిపోయాడని తెలిసింది. దాంతో ఊరు ఊరంతా […]

- తాజాగా 30 అడుగుల ట్రంప్ గోడ దూకి బ్రజ్‌కుమార్ మృతి
- ఉత్తర గుజరాత్ నుంచి అక్రమ మార్గాన విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో..
విధాత: ఉత్తర గుజరాత్ గంధీనగర్ జిల్లా కలోల్ సమీపంలోని బోరిసానా గ్రామం మునుపటిలా లేదు. ఎక్కడ చూసినా విషాధ ఛాయలు. ఎవరూ ఎవరితో మాట్లాడటం లేదు. కారణం.. ఆ ఊరినుంచి నెల రోజుల కిందట విహార యాత్రకని వెళ్లిన బ్రజ్‌కుమార్ యాదవ్ మెక్సికో సరిహద్దులో ట్రంప్‌వాల్ దూకుతూ చనిపోయాడని తెలిసింది. దాంతో ఊరు ఊరంతా చిన్నబోయింది.
ఇదే ఆరంభం కాదు..
ఈ ప్రాంతంలో ఇలాంటి వార్త ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ జరిగింది. ఈ ప్రాంతంలోని దింగుచా గ్రామం నుంచి వెళ్లిన ఓ కుటుంబం ఇలాగే చనిపోయింది. వారు కెనడా నుంచి అమెరికాకు వెళ్లేందుకు వక్ర మార్గాన్ని ఎంచుకున్నారు.
గత జనవరిలో మంచు ఎడారి గుండా కాలినడకన అమెరికా బయలు దేరారు. ఉష్ణోగ్రత మైనస్ 35 డిగ్రీలు ఉండటంతో గడ్డకట్టుకుపోయి భార్య, కొడుకుతో సహా తండ్రి మార్గమధ్యంలోనే మృతిచెందారు. ఈ వార్త ఈ ప్రాంతంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనాత్మకం అయ్యింది.
విహారయాత్రకు అని వెళ్లి…
తాజాగా బోరిసానా గ్రామానికి చెందిన 32 ఏండ్ల బ్రజ్‌కుమార్ యాదవ్ చిన్న వ్యాపారం చేస్తూ గ్రామంలో జీవించే వాడు. ఉన్నట్లుండి గత నెల నవంబర్ 18న విహార యాత్రకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలు దేరాడు. అప్పుడప్పుడు అతని భార్య ఫోన్ చేసి క్షేమంగా ఉన్నామని ఇంటికి తెలిపేది. కానీ ఇప్పుడు.. పిడుగులాంటి వార్త…
మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ మెక్సికో సరిహద్దులో ట్రంప్ హయాంలో నిర్మించిన గోడ దూకేందుకు ప్రయత్నించి చనిపోయాడని తెలిసింది. ట్రంప్‌గోడ 30 అడుగులు ఎత్తు ఉంటుంది. గోడ నుంచి దూకేటప్పుడు ఒడిలో మూడేండ్ల కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ ఘటనలో బ్రజ్‌కుమార్ అక్కడికక్కడే చనిపోయాడనీ, అతని భార్య పూజ కూడా తీవ్రంగా గాయ పడినట్లు తెలుస్తున్నది.
ఉద్యోగాల వేటలో యువత వలసబాట
ఉత్తర గుజరాత్‌లోని యువతలో ఎక్కువగా విదేశాలకు వెళ్లి డాలర్లు సంపాదించాలని అనుకునే వారు ఎక్కువ. అమెరికా, కెనాడా, మెక్సికో వెళ్లేందుకు యువత తాపత్రయ పడుతుంటారు. అందుకే మూడు వేల గ్రామ జనాభా ఉన్న బోరిసానాలో యువకులు అసలే కనిపించరు. అందరూ పక్క పట్టణాలకో, విదేశాలకో ఉద్యోగాల వేటలో వలసబాట పడతారు.
వక్రమార్గాన అమెరికా వెళ్లేందుకు యత్నాలు..
డాలర్ల సంపాదన కోసం అమెరికా వెళ్లాలి. అమెరికా వెళ్లాలంటే.. వీసా సమస్య ఉంటున్నది. అమెరికా వీసా దొరకటం కష్టం. కాబట్టి పొరుగు దేశాలైన కెనడా, మెక్సికో వెళ్లి అక్కడి నుంచి వక్రమార్గాన అమెరికా చేరాలనే దురాశతో ఈ దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది.
ఈ క్రమంలో వారు 60 నుంచి 65 లక్షల రూపాయల దాకా ఖర్చు చేస్తున్నారు. దాని కోసం ఉన్న భూమిని తాకట్టుపెట్టి, అప్పులు చేస్తున్నారు. ఇలా పోయిన వారు మెక్సికో, కెనడాలో ఉండి డబ్బులు సంపాదించటం కష్టం కాబట్టి వక్రమార్గాన అమెరికా చేరుకోవాలనే ఆశతో ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు.
పుట్టుకొచ్చిన నకిలీ ట్రావెల్ ఏజెన్సీలు..
ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని ఉత్తర గుజరాత్ ప్రాంతంలో అనేక నకిలీ ట్రావెల్ ఏజెన్సీలు వెలిశాయి. ట్రావెల్ ఏజెంట్లు ఆ ప్రాంతంలో గద్దల్లా తిరుగుతుంటారు. వక్రమార్గాన మెక్సికో, కెనడా పంపించే ట్రావెల్ ఏజెన్సీల సాయంతో యువత అక్రమంగా ఆయా దేశాలకు ప్రయాణమవుతారు. అక్కడి నుంచి అదను చూసుకొని అమెరికాలో చొరబడితే డాలర్లు సంపాదించవచ్చని ఆశ పడి ఇలాంటి ప్రమాదాలకు లోనై చనిపోతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి..
ఇలాంటి ఘటనలపై స్థానిక పోలీసులు, జిల్లా కలెక్టర్ లాంటి ఉన్నతాధికారులు కూడా స్పందించటం లేదు. అమెరికా నుంచి విస్పష్ట సమాచారం ఉంటే తప్ప అవసరమైన చట్టబద్దమైన చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని అంటున్నారు.
ఏదేమైనా.. ఉపాధి ఉద్యోగ వేటలో విదేశాల్లో చనిపోయిన వారిని తగు విధంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని ప్రజలు అంటున్నారు. బాధితలను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.