జగన్ నేలవిడిచిన సాము!

ఏపీలో వైఎస్ జగన్ చాలావేగంగా బలహీనపడుతున్నారు. దిద్దుబాటుకోసమని ఆయన తీసుకుంటున్న చర్యలు పరిస్థితిని సరిదిద్దకపోగా ఆ పార్టీని మరింత గందరగోళంలోకి నెడుతున్నాయి

  • By: Somu    latest    Dec 18, 2023 12:22 PM IST
జగన్ నేలవిడిచిన సాము!
  • వేగంగా బలహీనపడుతున్న సీఎం
  • ఏక వ్యక్తి పాలనే అందుకు కారణం
  • అసలు విషయం గుర్తించని అధినేత
  • ఎమ్మెల్యేలపై నెపం నెట్టేసే యత్నం
  • ఆగ్రహంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం
  • ఈసారి జగన్‌ను ఓడించేది వాళ్లే?



(కొండపల్లి సిద్ధార్థ సాగర్‌)



ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చాలావేగంగా బలహీనపడుతున్నారు. దిద్దుబాటుకోసమని ఆయన తీసుకుంటున్న చర్యలు పరిస్థితిని సరిదిద్దకపోగా ఆ పార్టీని మరింత గందరగోళంలోకి నెడుతున్నాయి. తన పార్టీ ఇంత వేగంగా ప్రజల మద్దతు కోల్పోవడానికి అసలు కారణాలు ఏమిటో గుర్తించకుండా ఎమ్మెల్యేలను బలిచేసేందుకు పూనుకుంటున్నారు. తన పనితీరు వల్ల, తన నిర్ణయాల వల్ల, ఏకవ్యక్తి పాలన వల్ల జరుగుతున్న నష్టాన్ని గుర్తించకుండా తప్పులన్నీ కిందివారిపై మోపే ప్రయత్నం చేస్తున్నారు.


ఇంతాచేస్తూ కూడా తాను ఘనవిజయం సాధించబోతున్నట్టు చాలా గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆయన రెండే రెండు అంశాలపై ఆధారపడి తన బలాన్ని అంచనా వేసుకుంటున్నారు. గ్రామ సచివాలయాలు తనకు అనుకూల ఓటును తెచ్చిపెడతాయని ఆయన ప్రగాఢంగా నమ్ముతున్నారు. అంతేగాక తాను పంపిణీ చేస్తున్న నిధులు తనకు నికర ఓటు బ్యాంకుగా ఉపయోగపడతాయని కూడా ఆయన భావిస్తున్నారు. కానీ ఆయన విస్మరించిన ప్రధాన విషయం ఒకటి ఉంది.



ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఆగ్రహం


నాయకుడికి, ప్రజలకు మధ్య చాలా రాజకీయ యంత్రాంగం ఉంటుంది. గ్రామస్థాయి నాయకులు, సర్పంచులు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు- ఇలా రాష్ట్రమంతా విస్తరించి ఉన్న ద్వితీయశ్రేణి నాయకత్వ వ్యవస్థను జగన్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వారికి ప్రభుత్వంలో ఎటువంటి పనీ, పాత్రా లేకుండా చేశారు. వారంతా జగన్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలు చెల్లని రూపాయలు అయ్యారు. ఇప్పుడు జగన్ వారు ఫెయిలయ్యారని చెప్పి, వచ్చే ఎన్నికల్లో తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.


కొన్ని చోట్ల అప్పుడే ప్రత్యామ్నాయ అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా చాలాచోట్ల ఇలా చేయబోతున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. కానీ ఈ ద్వితీయశ్రేణి నాయకత్వం దూరమైతే గ్రామాల్లో, కిందిస్థాయిలో చేసే నష్టం మామూలుగా ఉండదు. ఈసారి జగన్‌ను ఓడించబోయేది చంద్రబాబు-పవన్ కల్యాణ్ కాదు, ఈ ద్వితీయశ్రేణి రాజకీయ నాయకత్వమే. వీరు చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లతో చేరిపోయి నష్టం కలిగించవచ్చు లేక పార్టీలో ఉండే జగన్ ప్రయత్నాలకు గండికొట్టవచ్చు. ఇది ద్వితీయ శ్రేణి నాయకత్వం పరిస్థితి.


అనేక వర్గాలు ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకం


జగన్ గెలవాలని గత ఎన్నికల్లో ఎంతెంతో ఆధారపడిన వర్గాలలో ఇప్పుడు ఎంత మంది ఆయనతో ఉన్నారు? ప్రభుత్వోద్యోగులు లేరు. జగన్ మీటలు నొక్కుడు చూసి మధ్యతరగతి, మేధావి వర్గాలు విస్మయానికి లోనవుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఏ తీరానికి తీసుకెళతారోననే ఆందోళనతో మండిపడుతున్నాయి. సామాజిక వర్గాలు కూడా ముందటిమాదిరిగా ఏకపక్షంగా లేవు. జగన్‌ను నెత్తికెత్తుకున్న రెడ్డి సామాజిక వర్గం కూడా ఇప్పుడు జగన్‌తో సంతృప్తిగా లేదు. రెడ్డి సామాజికవర్గానికి ప్రభుత్వంలో, పదవుల్లో పెద్ద పీట వేసినా రెడ్డి సామాజిక వర్గంలో చాలా మంది జగన్ పనితీరు చూసి దూరమయ్యారు.


కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారడం, కొందరు రాజీనామా చేయడం ఇందుకు సూచనలు. కాపు సామాజిక వర్గంలో విభజన వచ్చింది. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి చేస్తున్న విమర్శలు కాపు సామాజికవర్గంలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక బీసీ మంత్రం కూడా పనిచేయడం లేదు. బీసీలకు కూడా జగన్ కిరీటం పెట్టింది ఏమీ లేదని ఆ సామాజిక వర్గాలు విమర్శిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నదో జగన్ గుర్తించడం లేదు. తెలుగుదేశం, వారి అనుకూల మీడియాపై ఎదురు దాడి చేయడం తప్ప లోపాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.



 


తాను పెంచుకున్న వ్యతిరేకతే


జగన్‌పై ఐదేళ్లలోనే ఎందుకు ఇంతటి విభ్రమ వచ్చింది? ఎందుకంటే.. కారణం ఆయనే. పనిచేసే సచివాలయం లేదు. మంత్రి మండలి లేదు. ముఖ్యమంతి ఒక దుర్భేద్యమైన సౌధంలో ఉంటారు. ఆయన ఎవరినీ కలవరు. ఎవరికీ అపాయింటుమెంట్లు ఉండవు. ముఖ్యమంత్రికి, ప్రజలకు మధ్య సజీవ వారధిగా ఉండాల్సిన నాయకత్వం పూర్తిగా సంబంధాలు కోల్పోయి ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉండగా అన్నింటినీ మించి ఆయన చేసిన చారిత్రక తప్పిదం మూడు రాజధానులను ప్రకటించడం.


విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయడానికి 1953లో రాయలసీమ నాయకత్వం ఎలా గండికొట్టిందో అదే పద్ధతిని ఈసారి కూడా జగన్ అమలు చేశారు. రాజధానిని ఒకసారే నిర్ణయిస్తారని, ఐదేళ్లకు ఒకసారి మార్చరని, అలా చేసే పని అయితే ప్రతి ఐదేళ్లకు రాజధానులు మార్చాల్సి వస్తుందని ఆయనకు ఎవరూ చెప్పలేకపోయారు. పోనీ ప్రకటించారు. అక్కడ విశాఖలో ఇక్కడ కర్నూలులో ఏమన్నా అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. విశాఖలో రియల్ ఎస్టేట్ మాఫియాను ప్రోత్సహించి, భూముల ధరలు పెంచేసి, సామాన్యులు నివసించలేని పరిస్థితి తీసుకువచ్చారు.


 


చిచ్చు రేపిన మూడు రాజధానులు


ముఖ్యమంత్రి త్వరలో తన నివాసాన్ని రిషికొండకు మారుస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి నివాసం మారినంతనే రాజధాని మారుతుందా? ఆయన నివాసం మారితే కలిగే ప్రయోజనం సంగతి తెలియదు కానీ ఇటువంటి తలాతోకా లేని ఆలోచన వల్ల రాష్ట్రంలో ఒక అస్థిరత ఏర్పడింది. రాజధాని ఎప్పుడు ఎక్కడ ఉంటుందో అన్న భావన పెట్టుబడి పెట్టే వర్గాల్లో వచ్చింది. ఆ తప్పును దిద్దుకునే అవకాశం వచ్చినా ఆయన పట్టించుకోలేదు. తన మొండి పట్టుదలతోనే ముందుకెళుతున్నారు. మూడు రాజధానులు అన్నంతనే ఉత్తరాంధ్ర లేక రాయలసీమ జగన్‌కు వరమాల వేశాయా అంటే అదీ లేదు.


ఉత్తరాంధ్రలో గ్రాడ్యుయేట్లు తమ తీర్పును స్పష్టంగా చెప్పారు. రాయలసీమవాసులు కూడా తమ తీర్పు ఎలా ఉండబోతున్నదో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేల్చి చెప్పారు. ఇక మిగిలింది కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాలు. రాజధాని విషయంలో తమ ఆగ్రహాన్ని ప్రకటించబోయేది ఈ జిల్లాలే. పవన్ కల్యాణ్-చంద్రబాబు కూటమి జగన్ చావుదెబ్బకొట్టబోయేదీ ఈ జిల్లాలలోనే. లబ్దిదారులంతా ఓటర్లు కావచ్చు. కానీ లబ్ధిదారుల సంఖ్యను చూసుకుని మురిసిపోయిన ఏ నాయకుడూ అసాధారణ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. తెలంగాణ అనుభవమే ఇందుకు ఉదాహరణ.