ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతుంటే.. మంత్రి సంక్రాంతి డ్యాన్సులు
ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే.. ఆ ప్రాజెక్టు గేట్లు కొట్టుకు పోతుంటే మంత్రి డ్యాన్సుల్లో మునిగితేలుతున్నారని మంత్రి అంబటి రాంబాబుపై షర్మిల సైటర్లు వేశారు

- అంబటిపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సైటర్లు
- ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిశీలన
- వైఎస్సార్ కట్టిన ప్రాజెక్టును పట్టించుకోని వీరు..
- ఎలా వైఎస్సార్ వారసులు అవుతారంటూ వ్యాఖ్యలు
విధాత: ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే.. ఆ ప్రాజెక్టు గేట్లు కొట్టుకు పోతుంటే మంత్రి సంక్రాంతి డ్యాన్సుల్లో మునిగితేలుతున్నారని మంత్రి అంబటి రాంబాబుపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సైటర్లు వేశారు. శనివారం ఆమె గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.750 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించి, లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చారని గుర్తుచేశారు. ఒంగోలు పట్టణంతో పాటు 12 మండలాల ప్రజల దాహార్తిని గుండ్లకమ్మ ప్రాజెక్టు తీరుస్తోందని చెప్పారు.
వైఎస్సార్ నిర్మించిన ఈ ప్రాజెక్టును ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేశాయని విమర్శించారు. నిర్వహణను అటకెక్కించారని అన్నారు. ఈనేపథ్యంలోనే ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని, మరమ్మతులు చేయాల్సింది పోయి.. ప్రాజెక్టు నిర్వహణ లోపాలు ఎత్తిచూపడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. అధికారుల నిర్వహణ లేకపోవడంతోనే ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని షర్మిల అన్నారు.
అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ‘జలయజ్ఞం దోపిడీ’ అంటూ అర్థం లేని ఆరోపణలు చేసిందన్నారు. ‘మనం ఇల్లు కట్టుకున్నా నిర్వహణ అవసరం. పట్టించుకోకుంటే ఏదైనా తుప్పు పడుతుంది. ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతుంటే వైసీపీ ప్రభుత్వం డ్యాన్సులు చేస్తోంది. మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారు తప్పా.. తన శాఖను పట్టించుకోవడం లేదు’ అని అంబటి రాంబాబుపై మండిపడ్డారు. ‘జగన్ అన్నకు ప్రాజెక్టు మరమ్మతులు చేయించడానికి మనసు రావడం లేదట. ఇదేనా వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టడం అంటే.. వైఎస్సార్ కట్టిన ప్రాజెక్టును పట్టించుకోని వీరు ఎలా వైఎస్సార్ వారసులు అవుతారు’ అంటూ ఘాటుగా విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, లేదంటే ప్రాజెక్టు మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే ప్రాజెక్టు కింద వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, రూ.10 కోట్లు ఇస్తే ప్రాజెక్టు నిలబడుతుందని షర్మిల అన్నారు. 40 టీఎంసీల సామర్థ్యం ఉన్న అతిపెద్ద వెలుగొండ ప్రాజెక్టునూ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. గత పదేళ్లలో చంద్రబాబు, జగన్ తట్టెడు మట్టి కూడా మోయలేదని విమర్శించారు. 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు సైతం మూలనపడిందని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.