కూతురి జ్ఞాపకాలను క్యూఆర్​ కోడ్​గా మలిచిన తల్లిదండ్రులు

ఒక దంపతుల సరికొత్త ఆలోచన తమ దివంగత కూతురి స్మృతులు ఎల్లకాలం గుర్తిండిపోయేలా చేసింది. తన  గురించి తెలుసుకోవడానికి, ఆమె ఆలోచనలు, ఫోటోలు, విడియోలు, సాధించిన విజయాలు, సోషల్​ మీడియా లింకులు అన్నీ ఓ క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేసి ఎవరైనా తెలుసుకోవచ్చు. అదెక్కడో తెలుసా?

కూతురి జ్ఞాపకాలను క్యూఆర్​ కోడ్​గా మలిచిన తల్లిదండ్రులు

సాధారణంగా క్యూఆర్​ కోడ్​(QR Code)ను కంపెనీ వెబ్​సైట్​ కోసం, షాపులు, కాలేజీలు, ఆఖరికి విజిటింగ్​ కార్డుగానూ వాడటబ చూసాం. కానీ, ఇక్కడ అది ఇంకోలా ఉపయోగించబడింది.

తమ కళ్లముందే కూతురు మరణించడం ఏ తల్లిదండ్రులు తట్టుకోగలరు? అది కూడా ఎదిగి వచ్చిన అమ్మాయిని, పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన వేళలో అకాల మరణం కబళిస్తే, ఆ దు:ఖం భరించలేము. కేరళలోని కొల్లం (Kollam district in Kerala)జిల్లాలో నివసించే రెజీ, మినీ(Reji, Mini) దంపతుల కుమార్తె, 22 ఏళ్ల అఖిల(Akhila)కు ఓ రోజు జ్వరం వచ్చింది. సరే.. అదే తగ్గిపోతుందిలే అని టాబ్లెట్​ వేసుకుని పడుకున్న ఆ అమ్మాయి ఆరోగ్యం తెల్లారేసరికల్లా విషమించింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అఖిల చనిపోయింది(Died with fever). ఇది ఆ దంపతులకు ఆశనిపాతంగా తగిలింది. నిన్న బాగానే ఉన్న చిట్టితల్లి ఇంతలోనే తమను, ఈ లోకాన్ని వదిలి వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. క్రమంగా అఖిల స్నేహితుల సాహచర్యంలో బాధను దిగమింగుకున్న ఆ తలిదండ్రులు రోజూ ఆ స్నేహితులు చెప్పే కూతురి విశేషాలు, విజయాలు, వేసిన జోకులు, చేసిన విడియోలు(photographs, videos, achievements, and social media links ) చూస్తూ, వింటూ మెల్లమెల్లగా బాధనుండి బయటపడుతూండగా, వారికి ఓ ఆలోచన వచ్చింది. తమ కూతురి జ్ఞాపకాలు, విశేషాలు నలుగురికి తెలిసేలా చేస్తే ఎల్లకాలం ఎంతోమంది మదిలో చెదరని జ్ఞాపకంగా ఉంటుందని తలపోసారు. అనుకున్న వెంటనే వారు అమ్మాయి పేరు మీద ఒక వెబ్​సైట్​(Website) తయారుచేసారు. దాన్లో అఖిలకు సంబంధించిన విషయాలు, విశేషాలు, ఫోటోలు, విడియోలు, జోకులు, సోషల్​ మీడియా లింకులు అన్నీ పొందుపరిచారు. ఇక్కడే వారికి ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది.

తన కూతురి సమాధి ఫలకంపై తన వెబ్​సైట్​ వివరాలు తెలుపుతూ ఒక క్యూఆర్​ కోడ్​(QR code on Gravestone) పెడితే ఎలా ఉంటుందీ అని. వెంటనే సమాధి ఉన్న మార్​ థోమా వలియపల్లి చర్చ్​ (Mar Thoma Valiyapally Church) ప్రధానాధికారిని సంప్రదించారు. కానీ, వారి నిబంధనల మేరకు చనిపోయిన వారి పేరు, పుట్టిన, మరణించిన తేదీలను తప్ప వేరే వివరాలను సమాధి ఫలకంపై రాయడాన్ని అనుమతించరు.  అయినా వారు పట్టువదలకుండా ఆ చర్చి ప్రాంతీయ కార్యాలయం(Mar Thoma Kottarakkara-Punalur diocese) లో సంప్రదించి ఆ ప్రాంతానికి అధిపతి అయిన బిషప్​ అనుమతి సంపాదించారు. తమ కూతురి సమాధి ఫలకంపై క్యూఆర్​ కోడ్​ ముద్రించారు. ఇప్పుడు ఆ సమాధి ఎందరినో ఆకర్షిస్తూ, సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది(Got viral on Social Media).

అఖిల తల్లి మినీ మాట్లాడుతూ, తమ ఆశలను, కలలను చెరిపేస్తూ కూతురు డిసెంబర్​ 2022లో తమకు దూరమైందని, ఆమె తమ ప్రాణమని, తను లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని వ్యాఖ్యానించింది. తన మొదటి సంవత్సరీకం(First death anniversay) సందర్భంగా 2023 డిసెంబర్​లో తనకు అశ్రు నివాళిగా ఏదైనా చేయాలని అనిపించడంతో తన స్నేహితుడిచ్చిన ఓ అమూల్యమైన సలహా మేరకు ఓ వెబ్​సైట్​ రూపొందించి, అఖిల సమాధి ఫలకంపై దాని క్యూఆర్​ కోడ్​ను ముద్రించాలనే నిర్ణయానికొచ్చినట్లు మినీ తెలిపింది. ఆ వెబ్​సైట్​ను రాబోయే రోజుల్లో మరిన్ని అఖిల విశేషాలతో నింపుతామని ఆశాభావం వ్యక్తం చేసింది మినీ.

చర్చి ఫాదర్​ రెవరెండ్​ మామచన్​(Rev P J Mamachan) మాట్లాడుతూ, తమ చర్చి నిబంధనల మేరకు ఇటువంటివి అనుమతించమనీ, కానీ అఖిల విషయంలోని సున్నితత్వం, భావోద్వేగాలను తన ప్రజలు అర్థం చేసుకున్నారని, వారి అభ్యర్థన మేరకు రెజీ, మినీలకు బిషప్​ అనుమతి మంజూరు చేసినట్లు చెప్పారు.

ఏదేమైనా, తమ మధ్య భౌతికంగా లేకపోయినా, తమ కూతురు నలుగురి జ్ఞాపకాల్లో బతికుండడం కోరుకున్న ఆ తల్లిదండ్రుల ఆలోచన  వారికి మనశ్శాంతిని ప్రసాదించింది.