King Cobra Bite | 15 ఏండ్ల బాలుడికి నాగుపాము కాటు.. 2 గంటల్లో 76 ఇంజక్షన్లు.. మరి బతికాడా..?
King Cobra Bite | అత్యంత విషపూరితమైన నాగుపాము( King Cobra ) ఓ 15 ఏండ్ల బాలుడి( Boy )ని కాటేసింది. దీంతో ఆ బాలుడిని ప్రాణాలతో కాపాడేందుకు 2 గంటల్లో 76 ఇంజక్షన్లు( Anti Venom Injections ) ఇచ్చాడు డాక్టర్.

King Cobra Bite | లక్నో : అత్యంత విషపూరితమైన నాగుపాము( King Cobra ) ఓ 15 ఏండ్ల బాలుడి( Boy )ని కాటేసింది. దీంతో ఆ బాలుడిని ప్రాణాలతో కాపాడేందుకు 2 గంటల్లో 76 ఇంజక్షన్లు( Anti Venom Injections ) ఇచ్చాడు డాక్టర్. ఈ ఘటన ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని కన్నౌజ్ జిల్లా( Kannauj District )లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కన్నౌజ్ జిల్లాలోని ఉదయ్తాపూర్ గ్రామానికి చెందిన ఓ 15 ఏండ్ల బాలుడు కట్టెలను తీసుకొచ్చేందుకు తన ఇంటి సమీపంలో ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లాడు. అక్కడ అతన్ని నాగుపాము కాటేసింది. దీంతో బాధిత బాలుడు నొప్పి భరించలేక గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అప్రమత్తమయ్యారు.
నాగుపామును చంపి దాన్ని ఒక డబ్బాలో వేసుకుని, బాధిత బాలుడిని చికిత్స నిమిత్తం బైక్పై జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్ హరి మాధవ్ యాదవ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. యాంటీ వీనమ్ ఇంజక్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. పాము విషం బాలుడి శరీరమంతా వ్యాపించకుండా ఉండేందుకు డాక్టర్ శతవిధాలా ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు గంటల్లో యాంటీ వీనమ్ ఇంజక్షన్లు 76 ఇచ్చారు. అంటే 90 సెకన్లకు ఒక ఇంజక్షన్ ఇచ్చారు. అలా బాలుడిని ప్రాణాలతో కాపాడారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడని డాక్టర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ స్థాయిలో యాంటీ వీనమ్ ఇంజక్షన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. గతంలో 50 నుంచి 60 ఇంజక్షన్లు ఇచ్చి ఒకరి ప్రాణాలు కాపాడినట్లు డాక్టర్ గుర్తు చేశారు.