చదవడం రావడం లేదు! బాధ్యత టీచర్లదా? ప్రభుత్వాలదా?

ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రథమ్‌ వార్షిక స్థాయి విద్యా నివేదిక (ASER)-2023 విస్తుపోయే విషయాలు వెల్లడించింది

చదవడం రావడం లేదు! బాధ్యత టీచర్లదా? ప్రభుత్వాలదా?

(విధాత ప్రత్యేకం)

ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రథమ్‌ వార్షిక స్థాయి విద్యా నివేదిక (ASER)-2023 విస్తుపోయే విషయాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 గ్రామీణ జిల్లాల్లో 1,664 గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించారు. మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని 49 గ్రామాల్లో 14-18 సంవత్సరాల యువతీ యువకులపై సర్వే జరిపారు. రాష్ట్రంలో అభ్యసన సామర్థాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ నివేదిక తెలియజేసింది. రాష్ట్రంలో 17-18 ఏళ్ల వయసు ఉన్న గ్రామీణ ప్రాంత యువతీ యువకుల్లో 40 శాతం మంది పదో తరగతి తర్వాత చదువు మానేస్తున్నారు. 14-16 ఏళ్ల వారిలో 22 శాతం మంది పాఠశాలలో గానీ.. కళాశాలలో గానీ చేరడం లేదని ఆ సర్వేలో తేలింది. 14-16 ఏళ్ల వయసు వారిలో 42.20, 17-18 ఏళ్ల వారిలో 50.30 శాతం మందే 2వ తరగతి పాఠం సరిగ్గా చదవగలుగుతున్నారు. పిల్లల్లో అభ్యసనా సామర్థ్యాల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఈ బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదా? లేక ఉపాధ్యాయులదా? అనే చర్చ జరుగుతున్నది. 

అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచడానకి ప్రభుత్వం ‘తొలిమెట్టు’ అనే కార్యక్రమం మొదలుపెట్టింది. అయితే కొంతమంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని తెలుస్తోంది.అభ్యసన సామర్థ్యాలు పెంచడానికి ప్రభుత్వాలు ఏదో ఒక కార్యక్రమం తీసుకోవడం వల్ల అంతోఇంతో మెరుగుదల కనిపిస్తున్నదని విద్యా నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కార్యక్రమం తీసివేయాలని కోరుతున్నవారే పిల్లలకు చదువు రాకపోవడానికి బాధ్యత వహించాలి. పిల్లలకు చదువు ఎందుకు రావడం లేదు అనే విషయంలో ఉపాధ్యాయుని బాధ్యతను పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యావంతులు కోరుతున్నారు. తరగతుల వారీగా పిల్లల అభ్యసనా సామర్థ్యాలు పెంచే బాధ్యత ఉపాధ్యాయునిదే అని విద్యాహక్కు చట్టం చెబుతున్నదని ఈ సందర్భంగా వారు గుర్తుచేస్తున్నారు. కాబట్టి ఏ విద్యార్థి అయినా తరగతి వారీగా సామర్థ్యం సాధించకపోతే దానికి ప్రభుత్వం, ఉపాధ్యాయులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీన్ని కోర్టులో సవాల్ చేయవచ్చు. ఎవరైనా తల్లిదండ్రులు గాని, స్వచ్ఛంద సంస్థలుగా గాని ఈ అంశంపై కోర్టుకు వెళ్తే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. 

రాయడం, చదవడం, గుణించడం, భాగించడం అనేది 2వ తరగతి చదివే విద్యార్థి చేయగలుగుతాడు. కానీ ఇవి 14-16 ఏళ్ల పిల్లల్లో ఇవి లేవని ‘అసర్‌’ నివేదిక చెబుతున్నది. ఇన్నేళ్లు స్కూళ్లో ఉన్న విద్యార్థిని ఒక నిరక్షరాస్యుడిగా బైటికి పంపించడం సరైనదేనా అని విద్యా నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అందుకే విద్యా ప్రమాణాలకు పడిపోవడానికి మొదట బాధ్యత ఉపాధ్యాయుడే తీసుకోవాలంటున్నారు. ఆరు నెలల్లో పిల్లలకు చదవడం, రాయడం, లెక్కలు చెప్పడం అన్నది దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్తేనే ఈ సంక్షోభం నుంచి బైటపడవచ్చు సూచిస్తున్నారు. ఉద్యోగులు, డిగ్రీ, వర్సిటీ విద్యార్థులందరినీ ఇందులో భాగస్వాములు చేయాలి. పిల్లలను కూర్చుబెట్టుకుని వాళ్ల అభ్యసన సమస్యలకు పరిష్కారానికి మార్గాలు చూపెట్టాలి. వాళ్లంతా వాలంటీర్‌గా ఒక ఉద్యమంగా దీన్ని చేపట్టాలి. కొత్త ప్రభుత్వం సీఎం రేవంత్‌ రెడ్డి దీనికి నాయకత్వం వహిస్తే ఈ అభ్యసన సంక్షోభం నుంచి రాష్ట్రం బైటపడుతుంది. ఫర్ఫార్మెన్స్‌ గ్రేడ్‌ ఇండెక్స్‌ (PGI) లోనూ రాష్ట్రం 12వ స్థానంలో ఉన్నది. విద్యలో పరిపాలన-పర్యవేక్షణ సూచికలో 22వ స్థానంలో ఉన్నది. దీనంతటికీ కారణం పర్యవేక్షణా వ్యవస్థ లేదని అర్థం. డీఈవోలు, ఎంఈవోలు, ప్రధాన ఉపాధ్యాయులు లేరు. 2014కు ముందు ఈ వ్యవస్థ బాగానే పనిచేసింది. కానీ ఆ తర్వాత గత ప్రభుత్వం సర్వీస్‌ నిబంధనలలు, కోర్టు కేసులు తదితర అంశాలను అడ్డం పెట్టుకుని ఈ నియామకాలు చేపట్టలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గెలిచి వారిని సవాల్‌ చేసిన వర్గాల ఇద్దరినీ కూర్చోబెట్టి సర్వీస్‌ సమస్యను పరిష్కరించాల్సింది. కానీ ఆ దిశగా ప్రయత్నించలేదు. ఒకవైపు ప్రమోషన్లు రాలేదన్న అసంతృప్తి టీచర్లలలో మరోవైపు కొత్త నియామకాలు లేవని నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉన్నది. ఇదిలా ఉండగా మరోవైపు డీఈవో, ఇతర ఆఫీసుల్లో పనిచేసే క్లర్కులు, సూపరిండెంట్లు, డైట్‌ కాలేజీల్లో ఉన్న లెక్చరర్లు, ప్రధానోపాధ్యాయులను ఇలాంటివారందరినీ ఇన్‌ఛార్జి డీఈవోల పేరుతో పెట్టి నడిపిస్తున్నారు. కానీ వీళ్లంతా డీఈవోలు కాదు. వాళ్లకు స్కేల్‌ లేదు, మానిటరింగ్‌ బెనిఫిట్స్‌ లేవు. వాళ్లకు ఇచ్చినవి ప్రమోషన్లు కావు. వాళ్లు వెట్టి చాకిరి చేయాలి. వీళ్లను విద్యా ప్రమాణాల బాధ్యులుగా చేయడం ఎంత వరకు సమంజసం? ఈ పరిణామం వల్ల విద్యావ్యవస్థలో అవినీతికి ఆస్కారం ఏర్పడింది. క్లర్లులు,సూపరిండెంట్లు, డీఈవో ఆఫీసుల్లో పనిచేసే అడిషనల్‌ డైరెక్టర్లు, డైట్‌ లెక్చరర్లు వాళ్లకు అర్హత ఉండి డీఈవోలుగా పదోన్నతి పొందితే నైతికంగా బలంగా నిలబడుతారు. చాలాచోట్ల డైట్‌ లెక్చరర్లే డీఈవోలుగా ఉన్నారు. వాళ్లు డైట్‌ పాఠాలు చెప్పకుండా మా వెంబడి ఎందుకు పడుతున్నావని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. వాళ్లు ఇన్‌ఛార్జీ డీఈవోలు కాబట్టి ఎంతకాలం ఆ పోస్టులో కొనసాగుతారో తెలియదు. అందుకే వృత్తి బాధ్యతల్లో కచ్చితంగా పనిచేయలేకపోయారు. పర్యవేక్షణ అధికారులు లేరు. అడిగేవారు లేరు. ఇలా గత ప్రభుత్వం విద్య విధ్వంసానికి పాల్పడిందని అంటున్నారు. దీనికితోడు పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ల ఆదేశాలు. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మూల్యాంకనంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తూ గ్రేడ్లు పెంచుకుంటూ వెళ్లారనే విమర్శలున్నాయి. దీనివల్ల ఏం జరిగిదంటే పిల్లలకు చదువు రాలేదు గానీ పదవ తరగతిలో జీపీఏ వచ్చిందని ప్రైవేట్‌ కాలేజీల్లో చేర్చారు. ఫలితంగా ప్రైవేట్‌ కాలేజీ బిజినెస్‌ పెరిగింది.

అభ్యసన సంక్షోభం అన్నది మన దేశం, రాష్ట్రంలోనే కాదు అమెరికా లాంటి దేశంలోనూ గతంలో వచ్చింది. అప్పుడు అమెరికాలో రీడింగ్‌, అమెరికా కౌటింగ్‌ అని రెండు ఉద్యమాలు నడిచాయి. ఈ సంక్షోభ నివారణ కోసం బడిని కేంద్రంగా చేసుకుని యువత, డిగ్రీ చేసిన వాళ్లు ఇలా అందరూ భాగస్వాములయ్యారు. నూతన జాతీయ విద్యా విధానంలోనూ remedial instruction programme ఉన్నది. ఈ కార్యక్రమ ఉద్దేశం ఏమిటంటే ఒక డిగ్రీ విద్యార్థి ఒక బడిలొని కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకుని అభ్యసన సంక్షోభ నివారణ చర్యలు తీసుకుంటే అతను క్లాసులు తీసుకున్న సమయం ఆధారంగా క్రెడిట్స్‌ వస్తాయి. ఆ క్రెడిట్‌ అంటే ఒక పేపర్‌ పాసైనట్టు పరిగణనిస్తారు. ఒక సర్టిఫెకెట్‌ ఇస్తారు. ఇలా సర్వీస్‌ చేసే వారికి మార్కులు ఇస్తారు . వీళ్లే కాకుండా పదవీ విరమణ పొందిన వాళ్లు గాని, ఆఫీసులలో పనిచేసే వాళ్లు గాని తమ సేవలను స్వచ్ఛందంగా అందించడానికి ముందుకు వస్తే వారికి సర్టిఫికెట్‌తోపాటు గుర్తింపు ఇస్తారు. ఇట్లా సమాజ భాగస్వామ్యంతోని ఈ అభ్యసన సంక్షోభం నుంచి బైట పడాలని జాతీయ విద్యావిధానం-2019 ముసాయిదాలో పేర్కొన్నది. దానికి అనుగుణంగానే ఫౌండేషన్‌ లిట్రసీ, న్యూమరసీ అనే కార్యక్రమాన్ని అన్నిరాష్ట్రాలు ప్రారంభించాలని చెప్పింది. 2025 నాటికి మూడో తరగతి చదివే విద్యార్థులకు రాయడం, చదవడం, లెక్కించడం, భాగించడం రావాలని విద్యా విధానంలో స్పష్టం చేసింది. Functional Literacy and Numeracy (FLN) కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించింది. ఇందులో భాగంగానే మన రాష్ట్రంలో ‘తొలిమెట్టు’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం గత ఏడాది చేపట్టింది. ఇవే కాకుండా పిల్లల అభ్యసనా సామర్థ్యాలు పెంచడానికి ఉన్నతి, నిరంతర సమగ్ర మూల్యాంకనం(CCE) వంటి కార్యక్రమాలున్నాయి. వీటిని అమలు చేయాల్సిన ఉపాధ్యాయులు వాటిని పరిగణనలోకి తీసుకోకుండా తన అటెండెన్స్‌, తన సిలబస్‌ పూర్తయ్యిందా అనే విషయాలకే పరిమితమౌతున్నాడు. పిల్లలు ఎలాంటి సామర్థ్యాలు లేకుండా ఆరో తరగతిలో చేరుతున్నారని ఇప్పుడు వాళ్లకు మొదటి నుంచి చదువు చెప్పడం అంటే ఎట్లా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ సమస్యకు మూలకారణమంతా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నది. ఈ సంక్షోభ నివారణ కోసం పిల్లలకు చదువు రాకపోతే ఉపాధ్యాయుడిదే బాధ్యత అనాలి. వాళ్లకు చదువు రాకపోతే శాఖపరమైన చర్యలుంటాయని చెప్పాలి. మరో సమస్య ఏమిటంటే ఒకటో తరగతిలో చేరిన విద్యార్థి ఏం నేర్చుకోకుండా రెండో తరగతికి వస్తాడు. మళ్లా రెండో తరగతి నుంచి మూడో తరగతి వస్తున్నాడు. అంటే విద్యార్థి ఏ తరగతిలో నేర్చుకోవాల్సినవి నేర్చుకోకుండా ఆ తరగతి వెనుకబాటుతనాన్ని పై తరగతులకు మోసుకుపోతున్నాడు. దీనివల్లనే 14-16 ఏళ్లు వచ్చినా రాయడం, చదవడం రాని నిరక్షరాస్య తరాన్ని పాఠశాలలు తయారుచేస్తున్నాయి. పేదరికం నుంచి బైట పడాలని బడిలో చేరే వర్గాలు బడి ఇచ్చే అభ్యసన దారిద్ర్యం వల్ల మరింత పేదలుగా మిగిలిపోతారని ప్రపంచ నివేదికలు చెబుతున్నాయి. ఫలితంగా ఈ అభ్యసన సంక్షోభంలోకి బడుగు, బలహీనవర్గాల పిల్లలు నెట్టడుతున్నారు. భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధిలో వెనుకబడి మరింత పేదరికంలోకి నెట్టబడుతారని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

రాష్ట్రస్థాయిలో ఉన్న అధికారుల బాధ్యత ఎంత?

రాష్ట్రస్థాయిలో ఉన్న విద్యాధికారుల క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేదు. దీంతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం వాళ్లు ఆఫీసుకు వచ్చి అధికారుల దృష్టికి తీసుకు వద్దామని అనుకున్నా వారు సమయ పాలన పాటించడం లేదు, ఒకవేళ ఉన్నా వినడం లేదనే విమర్శలున్నాయి. వారి వైఖరి వల్ల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. ఇవన్నీ ఉపాధ్యాయుల పనితీరుపై ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రస్థాయి అధికారులపై పనితీరుపై పర్యవేక్షించాలి. వాళ్ల పనితీరు ఆధారంగానే అక్కడ కొనసాగించాలి. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ విషయాలపై సీరియస్‌గా ఆలోచించి రాష్ట్రస్థాయి విద్యాశాఖలో ప్రక్షాళన చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 

అందరికీ టెట్‌ అర్హత తప్పనిసరి

ఉపాధ్యాయులన్నప్పుడు అందరూ ఉపాధ్యాయులు అవుతారు కనుక ఎప్పుడో ఒకసారి టెట్‌ అర్హత సాధించాలని విద్యాహక్కు చట్టంలో ఉన్నది. అయితే సర్వీస్‌లో ఉన్నవాళ్లకు అవసరం లేదని అనుకున్నారు. రాజస్థాన్‌లో ఒక సామాజిక కార్యకర్త ఉపాధ్యాయులకు టెట్‌ లేదనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో టెట్‌ అర్హత సాధించాలని తీర్పు చెప్పింది. ప్రస్తుతం పాఠశాలల్లో పనిచేస్తున్న వారిలో జూనియర్లు, సీనియర్ల మధ్య ఇదే విషయంపై వాదనలు జరుగుతున్నాయి. మేము టెట్‌ అర్హత సాధించామని, సీనియర్లకు టెట్‌ లేదు కాబట్టి వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వకూడదని జూనియర్లు వాదిస్తున్నారు. ప్రయోషన్లు ఆగడానికి కారణం ఇదే. వీళ్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలనే ప్రతిపాదన ఉన్నది.