Bihar
విధాత: ఆమెకు పెళ్లైంది. భర్తతో వివాహ జీవితం సాఫీగా సాగిపోతోంది. కానీ మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో భర్త లేని సమయంలో ప్రియుడితో కాలం గడుపుతోంది. విషయం తెలుసుకున్న భర్త.. భార్యకు ప్రియుడితో వివాహం జరిపించాడు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని నవాడ గ్రామానికి చెందిన ఓ వివాహిత అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో ప్రేమలో ఉంది. వారిద్దరూ శారీరకంగా కూడా దగ్గరయ్యారు.
అయితే ఓ రోజు రాత్రి తన భర్త వేరే పనిమీద బయటకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో భార్య తన ప్రియుడిని కలిసేందుకు వెళ్లింది. అతడి ఇంట్లో ఇద్దరూ ఏకాంతంగా ఉన్నారు. వీరిద్దరిని స్థానికులు, బంధువులు గమనించారు.
అనంతరం వారిద్దరిని చెట్టుకు కట్టేసి.. తీవ్రంగా గాయపరిచారు. ఊరు నుంచి బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. కానీ అంతలోనే తిరిగి వచ్చిన భర్త.. ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. భార్యతో పాటు ఆమె ప్రియుడిని తీసుకెళ్లి.. స్థానికంగా ఉన్న గుడిలో భర్త వివాహం జరిపించాడు. దీంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె ప్రియుడికి గతంలోనే వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ అతడినే ఆమె ఇష్టపడింది. మొత్తంగా ఈ ఘటనపై ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.