ఆలస్యం అమృతం విషం!

దేశవ్యాప్తంగా బీజేపీ చేతిలో 12 రాష్ట్రాలున్నాయి. పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో సీఎం సీటు కోసం నెలకొన్నపోటీ, కొనసాగిన అంతర్గత కుమ్ములాటలు

ఆలస్యం అమృతం విషం!

విధాత : దేశవ్యాప్తంగా బీజేపీ చేతిలో 12 రాష్ట్రాలున్నాయి. పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో సీఎం సీటు కోసం నెలకొన్నపోటీ, కొనసాగిన అంతర్గత కుమ్ములాటలు కూడా ఆ రాష్ట్రాలు కాంగ్రెస్‌ చేజారడానికి కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. సెమీ ఫైనల్‌గా భావిస్తున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను బీజేపీ గెలుచుకున్నది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే ఉన్నది.

ఈ సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎంపీ సీట్లు కూడా కీలకం. కాబట్టి ఈ సమయంలో కాంగ్రెస్‌ నాయకులు ముఖ్యమంత్రి పదవికోసం కొట్టుకోవడం సరైందని కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆలస్యం అమృతం విషం అన్నట్టు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం త్వరగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై తాత్సారం చేయడం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, విపక్షాలు చేసే విమర్శలే వాస్తవాలుగా చెలామణి అవుతాయని అంటున్నారు. పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్‌ అధిష్ఠానం కొన్ని విషయాల్లో గట్టిగా ఉండాలని, అప్పుడే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని, లేని పక్షంలో మూడోసారి మోదీకి ప్రజలు జై కొట్టే పరిస్థితి వస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

అతికష్టంపై వచ్చిన గెలుపిది!

తెలంగాణ ఇచ్చినా వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయింది. దుబ్బాక, హుజురాబాద్‌, నాగార్జునసాగర్‌, మునుగోడు ఉప ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అపజయం పాలైంది. దుబ్బాక, హుజురాబాద్‌లలో గెలువగానే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అన్నట్టు బీజేపీ నేతలు ప్రచారం చేసుకున్నారు.

కేసీఆర్‌ వ్యవహారశైలి వల్లనో, కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ ఇక పుంజుకోవడం కష్టమనో కొంతమంది బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ తీర్థం పుచ్చుకోగానే బీజేపీ అధిష్ఠానం వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనన్న భావనలోకి వచ్చింది. అలాంటి సమయంలో పార్టీ ఎన్నికలకు ముందు ఆరు నెలల్లోనే తిరిగి పుంజుకున్నది. 2018 ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ కేసీఆర్‌ స్థాయి నేతల అటు బీజేపీలో, ఇటు కాంగ్రెస్‌లో లేరు. దీంతో ప్రజలు కూడా ప్రత్యామ్నాయం గురించి ఆలోచించలేదు.

అలాగే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించినా ఆ ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్‌ఎస్‌లోకి చేరిపోతారని బీజేపీ తాను బలపడటం కోసం ప్రచారం చేసింది. ఇటు బీఆర్‌ఎస్‌, బీజేపీని కాదని ఇవాళ కాంగ్రెస్‌ పార్టీవైపు ప్రజలు నిలిచారు. ఈ సమయంలో పార్టీ ఐక్యంగా ఉండి.. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత తెలంగాణ నాయకత్వానికి కూడా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.