భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని.. బీఎస్‌ఎఫ్ జవాన్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని.. బీఎస్‌ఎఫ్ జవాన్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
  • సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్
  • జ‌మ్ముక‌శ్మీర్‌లో ఘ‌ట‌న‌.. మృతుడిది రాజ‌స్థాన్‌



విధాత‌: జమ్ముక‌శ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ బీఎస్‌ఎఫ్ జవాన్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఫోన్‌లో గొడవపడి రాజస్థాన్‌లో ఉన్న‌ తన భార్య ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో అత‌డు కాల్చుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడ్డాడు. వీరికి ఎనిమిది నెల‌ల క్రితం వివాహం జ‌రిగింది.


వివ‌రాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీ-బెహ్రోర్ జిల్లాలోని ధీర్‌పూర్ గ్రామానికి చెందిన అన్షు యాదవ్ (24) మంగళవారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె మృతి సమాచారం అందుకున్న కుప్వారాలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) హెడ్ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న ఆమె భ‌ర్త‌ రాజేంద్ర యాదవ్ (28) బుధ‌వారం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు.


పోస్టుమార్టం అనంతరం మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు హర్సౌరా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రాజేశ్‌ మీనా తెలిపారు. ఫోన్‌లో ఆలుమ‌గ‌ల మధ్య గొడవ జరిగింద‌ని, ఆ తర్వాత మహిళ ఆత్మహత్యకు పాల్పడిన‌ట్టు తెలుస్తున్న‌ద‌ని పేర్కొన్నారు. రాజేంద్ర యాదవ్ మృతదేహాన్ని గురువారం జైపూర్ తీసుకొచ్చారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.