‘డేంజర్ జోన్’లో ఆ ఏడుగురు విపక్ష సీఎంలు!
30 రోజులు జైల్లో ఉంటే పదవీచ్యుతులే ...‘డేంజర్ జోన్’లో! ఆ ఏడుగురు విపక్ష సీఎంలు ..బిల్లు కనుక చట్టం రూపందాల్చితే.. ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో 42 శాతం మంది డేంజర్ జోన్‌లో ఉన్నట్టేనని తెలుస్తున్నది. వీరిపై తీవ్రమైన నేర అభియోగాలు ఉన్నాయి.

- దేశంలో 13 మందిపై తీవ్ర నేరారోపణలు
- ఏడీఆర్ 2024 డిసెంబర్ నివేదిక
- పది మందిపై తీవ్ర అభియోగాలు
- చంద్రబాబు సహా ఇద్దరు బీజేపీ మిత్రులు
- ఒకరు బీజేపీ సీఎం ఫడ్నవీస్
- ప్రభుత్వాలు కూల్చేందుకు
- కొత్త పద్ధతిని ప్రవేశపెట్టనున్న బిల్లు
- 30 రోజులు జైల్లో ఉంటే పదవీచ్యుతులే
- కేంద్రంలో అధికార పక్షం కక్షగడితే
- పడిపోనున్న ప్రతిపక్షాల ప్రభుత్వాలు
న్యూఢిల్లీ : తీవ్ర అభియోగాలపై అరెస్టయి, 30 రోజుల పాటు జైల్లో ఉంటే ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులను 31వ రోజున అనర్హులుగా ప్రకటించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బుధవారం లోక్‌సభకు సమర్పించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు కనుక చట్టం రూపందాల్చితే.. ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో 42 శాతం మంది డేంజర్ జోన్‌లో ఉన్నట్టేనని తెలుస్తున్నది. వీరిపై తీవ్రమైన నేర అభియోగాలు ఉన్నాయి. ముఖ్యమంత్రులను ఇష్టారాజ్యంగా తొలగించి, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అసలు ఈ బిల్లు పరిధిలోకి వచ్చే ముఖ్యమంత్రుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్.. ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా క్రోడీకరించింది.
అభియోగాలు రుజువు కాకముందే ముఖ్యమంత్రి, మంత్రులను బర్తరఫ్ చేసేందుకు అధికారాలు కలిగి ఉన్న బిల్లు.. అత్యంత ప్రమాదకరమైనదని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక విధంగా హిట్లర్ తరహా పాలనను మోదీ సర్కారు తీసుకొస్తున్నదని, దేశంలో పోలీసు రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నాల్లో ఉన్నదని బిల్లు ప్రవేశపెట్టిన రోజే ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
నేటి బిల్లు రేపు చట్టంగా మారితే ఏం జరుగుతోంది? అనే అంశంపై ఇఫ్టు నేత ప్రసాద్ దీనిపై రెండే రెండు వాక్యాల్లో స్పందించారు. ‘క్రిమినల్ కేసులలో జైలుకెళ్ళి బెయిలు రాకుండా రిమాండ్ లో ముప్పై రోజులు దాటిన ముఖ్యమంత్రులు సహా మంత్రులు పదవులను కోల్పోవడం థియరీ. గద్దె దింపాలనుకున్న ముఖ్యమంత్రి సహా మంత్రులను అక్రమ కేసుల్లో కేంద్రం జైలుకు పంపి ముప్పై రోజులు బెయిలు రాకుండా నిర్భంధంలో ఉంచడం ప్రాక్టీస్. ఇది నేటి ప్రకటిత థియరీ.. అది రేపటి అప్రకటిత ప్రాక్టీస్’ అని వ్యాఖ్యానించారు.
దేశంలో మొత్తం 31 మంది ముఖ్యమంత్రులు ఉండగా.. వారిలో 13 మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని ఏడీఆర్ 2024 డిసెంబర్‌లో సిద్ధం చేసిన నివేదిక పేర్కొంటున్నది. వారిలో పది మంది హత్యాయత్నం, అపహరణ, లంచం, నేరపూరిత చర్యలు వంటి తీవ్ర అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఆ పదిమందిలో కూడా చూస్తే ఏడుగురు ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు ఉంటే.. ఇద్దరు బీజేపీ మిత్రపక్షాల సీఎంలు, ఒకరు బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నారు. ముఖ్యమంత్రినే తీసుకుంటే.. కేంద్ర ప్రతిపాదిస్తున్న బిల్లు ప్రకారం.. ఒక ముఖ్యమంత్రిపై కేసు పెట్టి జైలుకు పంపించి, 30 రోజుల పాటు బయటకు రాకుండా చూడగలిగితే.. ఆటోమేటిక్‌గా ఆయన పదవీచ్యుతుడు అవుతాడు. రాజకీయ దురుద్దేశంతో ఈ చర్యకు పాల్పడితే కచ్చితంగా 30 రోజులకుపైగానే ఉంచుతారనడంలో సందేహం లేదు. ఈ సమయంలో ఆ పార్టీలో అంతర్గత సమస్యలు తలెత్తడమో, లేదా కొంతమందిని ఈలోపే చేరదీసి.. వేరు కుంపటి పెట్టించడమో లేదా తిరుగుబాటు లేవదీయించడమో అధికార పక్షాలకు పెద్ద కష్టమేమీ కాదు. భారతదేశంలోనే అనేక పార్టీల్లో చీలికలు, తిరుగుబాట్లకు దారి తీసిన పరిణామాలు, వాటి వెనుక నేపథ్యాలు ప్రజలకు తెలియందేమీ కాదు. కాకపోతే.. ఇప్పుడు ఈ బిల్లు ద్వారా ఇది బహిరంగంగా, చట్టప్రకారం సాగిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీని ప్రకారం చూసినప్పుడు ఏడుగురు ప్రతిపక్ష సీఎంలు తక్షణం ఈ డేంజర్ జోన్ పరిధిలోకి వస్తున్నారు. వీరిపై ఐదేళ్లకు మించి జైలు శిక్ష పడేందుకు అవకాశం ఉన్న కేసులు సహా వివిధ రకాల కేసులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క కేసును అధికార పక్షం పట్టుకున్నా.. ఆ రాష్ర్ట ప్రభుత్వం అస్థిరమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇదీ వారి జాబితా; బ్రాకెట్‌లో వారిపై ఉన్న కేసుల సంఖ్య
ఎనుముల రేవంత్‌రెడ్డి,
కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మొత్తం 89 కేసులు ఉన్నాయి. వాటిలో 72 కేసులు తీవ్రమైనవి. అన్నింటికంటే ప్రధానమైనది ఓటుకు నోటు కేసు. ఈ కేసులో కొంతకాలం ఆయన జైల్లో ఉండి వచ్చారు కూడా. నేరపూరిత చర్యలు, రెండు వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, బహిరంగ దుష్ప్రవర్తన, తప్పుడు అక్కౌంట్లు వంటి పలు అభియోగాలపై ఇతర కేసులు నమోదయ్యాయి.
ఎంకే స్టాలిన్
ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై మొత్తం 47 కేసులు ఉన్నాయి. అందులో తీవ్రమైన అభియోగాల కింద నమోదైన కేసులు 11 ఉన్నాయి.
నారా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై 19 కేసులు ఉన్నాయి. ఇందులో కొన్ని తీవ్ర అభియోగాల ఆధారంగా నమోదైన కేసులు కూడా ఉన్నాయి.
సిద్ధరామయ్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మొత్తం 13 కేసులు ఉండగా.. అందులో తీవ్ర అభియోగాల కింద ఆరు కేసులు నమోదయ్యాయి.
హేమంత్ సోరెన్
జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌పై మొత్తం ఐదు కేసులు ఉన్నాయి. ఈ కేసులలో తీవ్రమైన ఐపీసీ అభియోగాలు ఏడు ఉన్నాయి.
దేవేంద్ర ఫడ్నవీస్
బీజేపీకి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై మొత్తం నాలుగు కేసులు ఉండగా.. అందులో తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద రెండు కేసులు నమోదయ్యాయి.
సుఖ్విందర్ సింగ్
కాంగ్రెస్ పార్టీకి చెందిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్‌పై నాలుగు కేసులు ఉన్నాయి. అందులో ఒకటి తీవ్రమైన ఐపీసీ సెక్షన్ కింద ఒక కేసు ఉన్నది.
పినరయి విజయన్
సీపీఎంకు చెందిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై రెండు కేసులు ఉండగా.. అందులో తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు రెండు ఉన్నాయి.
పీఎస్ తమాంగ్
సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం)కు చెందిన సిక్కిం ముఖ్యమంత్రి పీఎస్ తమాంగ్‌పై ఒక కేసు ఉన్నది. ఈ ఒక్క కేసు కూడా తీవ్రమైన ఐపీసీ సెక్షన్ కింద నమోదైనది.
భగవంత్ సింగ్ మాన్
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌పై ఒక కేసు ఉండగా అది కూడా తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద నమోదైనది కావడం గమనార్హం.