గిరిజ‌నులే కింగ్‌మేక‌ర్లు!

గిరిజ‌నులే కింగ్‌మేక‌ర్లు!
  • 32శాతం జ‌నాభా వారిదే
  • మొత్తం 90 సీట్ల‌లో ఎస్టీల‌వి 29
  • ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో గెలుపెవ‌రిదో!



రాయ్‌పూర్‌: ఈ నెల ఏడో తేదీన‌ తొలిద‌శ పోలింగ్‌కు ఛ‌త్తీస్‌గ‌ఢ్ సిద్ధ‌మ‌వుతున్న‌ది. దాదాపు 32శాతం గిరిజన జ‌నాభా ఉన్న ఈ రాష్ట్రంలో ఎస్టీ ఓట‌ర్లే కింగ్‌మేక‌ర్లు కానున్నారు. ఇక్క‌డ 90 సీట్ల‌కుగాను వారికి 29 సీట్లు రిజ‌ర్వ్ అయ్యాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి విడిపోయి ఛ‌త్తీస్‌గ‌ఢ్‌గా ఏర్ప‌డి 23 ఏళ్ల‌వుతున్న‌ది. రాష్ట్రం ఏర్ప‌డిన కొత్త‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. అయితే.. కొంత‌కాలానికే ప్ర‌భుత్వంలో త‌లెత్తిన స‌మ‌స్య‌ల‌తో అధికారానికి దూర‌మైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి, 2005 నుండి 2018 వరకు వరుసగా అధికారంలో ఉంటూ వచ్చింది.


దాదాపు 15 సంవత్సరాలు బీజేపీ ముఖ్యమంత్రిగా డాక్టర్ రమణ్ సింగ్ ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2023లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అంటే ఈ మొత్తం 23 సంవత్సరాల కాలంలో బీజేపీయే అత్యధిక సంవత్సరాలు అధికారంలో ఉంది. తాజా ఎన్నిక‌ల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. త‌దుప‌రి స్థానాల్లో జోగి కాంగ్రెస్, సమాజ్‌వాది, బీఎస్పీ, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ ముక్తి మోర్చా పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తిరిగి రెండోసారి కూడా అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. కాంగ్రెస్‌ను ఓడించి, మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతున్న‌ది.


అయితే.. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై ప్ర‌జా వ్య‌తిరేక‌త లేక‌పోవ‌డం ఆ పార్టీకి లాభించే అంశంగా క‌నిపిస్తున్న‌ది. పార్టీ నాయ‌క‌త్వం కూడా ఐక్యంగా, బ‌లంగా ఉన్న‌ది. ముఖ్య‌మంత్రి భూపేష్‌భ‌గేల్‌, ఉప ముఖ్య‌మంత్రి టీఎస్ సింహ‌దేవ్ మ‌ధ్య కొంత విభేదాలున్న‌ప్ప‌టికీ.. కేంద్ర స్థాయి పార్టీ కలిగించుకోవ‌డంతో అవి స‌ద్దుమ‌ణిగాయి. ప్ర‌త్యేకించి ముఖ్య‌మంత్రిపై ఎలాంటి ఆరోప‌ణ‌లు లేక‌పోవ‌డం కూడా కీల‌కాంశంగా ఉన్న‌ది.


ప్రజలు గౌరవించే, ప్రేమించే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ముఖ్యమంత్రిగా ఆయనకు గతంలో పేరు ఉంది. ఎన్నిక‌ల కోసం కాంగ్రెస్ రెండేళ్ల క్రితం నుంచే సిద్ధ‌మ‌వుతూ ప్ర‌జ‌ల్లో ఉంటూ అనేక సంక్షేమ ప‌థ‌కాలు తీసుకొచ్చింది. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన ద‌గ్గ‌ర నుంచి పార్టీ అధిష్ఠానం కూడా ప్ర‌త్యేకంగా కేంద్రీక‌రించింది. రాహుల్‌గాంధీ, ప్రియాంక‌గాంధీ త‌దిత‌రులు ఐదారు సార్లు రాష్ట్రంలో పర్య‌టించి, కాంగ్రెస్ విజ‌యానికి ఊపునిచ్చారు.



నాయ‌క‌త్వ సంక్షోభంలో బీజేపీ


ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో బీజేపీ.. నాయ‌క‌త్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న‌ది. ముఖ్య‌మంత్రిగా ఎవ‌రినీ ఫోక‌స్ చేయ‌లేని ప‌రిస్థితి క‌నిపిస్తున్న‌ది. మాజీ ముఖ్య‌మంత్రి ర‌మ‌ణ్‌సింగ్‌, ఆయ‌న కొడుకు అభిషేక్ సింగ్‌పై ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా అరుణ్‌సావ్ బాధ్య‌త‌లు చేప‌ట్టి ఏడాది కూడా కాలేదు. ద్వితీయ‌శ్రేణి నాయ‌క‌త్వం లేక‌పోవ‌డం బీజేపీకి పెద్ద బ‌ల‌హీన‌త‌గా చెబుతున్నారు.


గ‌త ఎన్నిక‌ల్లో 16 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈసారి వాటిని నిలుపుకొంటే గొప్ప అన్న‌ట్టు వాతావ‌ర‌ణం క‌నిపిస్తున్న‌ద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. గ‌తంలో బీజేపీ ప్ర‌భుత్వం ఎదుర్కొన్న పెద్ద విమ‌ర్శ‌.. ప్రైవేటీక‌ర‌ణ‌. స‌హ‌జ సంప‌ద అపారంగా ఉండే ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఖ‌నిజ నిక్షేపాల‌ను ప్రైవేటుకు అమ్మేశార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈసారి అధికారంలోకి వ‌స్తే.. ఈ ప్రైవేటీక‌ర‌ణ కొన‌సాగ‌డంతోపాటు.. అడ‌వులు, న‌దులను సైతం ప్రైవేటుప‌రం చేస్తుంద‌నే ఆందోళ‌న‌లు ఉన్నాయి.


ఇక మిగిలిన పార్టీల్లో జోగి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన‌ది. గ‌త ఎన్నిక‌ల్లో ఆరు స్థానాల్లో ఈ పార్టీ విజ‌యం సాధించింది. ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి అజిత్‌జోగి మ‌ర‌ణానంత‌రం ఆ పార్టీకి ఆయ‌న కుమారుడు అమిత్‌జోగి సార‌థ్యం వ‌హిస్తున్నారు. స‌మాజ్‌వాది, బీఎస్పీ, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముక్తి మోర్చా ఉన్న‌ప్ప‌టికీ.. అంతా ప్ర‌భావంవంత‌మైన స్థాయిలో లేవు.


ఎస్టీలే కీల‌కం


రాష్ట్రంలో ఎస్టీ ఓట‌ర్లే అధికం. ఆ త‌ర్వాత ఓబీసీల సంఖ్య ఉంటుంది. ప్ర‌తి అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓబీసీల చ‌ర్చ వ‌స్తుంది. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి ఓబీసీకి చెందిన‌వారే. కాంగ్రెస్‌కు ఇదొక బ‌ల‌మైన అంశంగా చెబుతున్నారు.