5 రాష్ట్రాల్లో వ‌చ్చేది కాంగ్రెస్ ప్రభుత్వ‌మే!: ఖర్గే

5 రాష్ట్రాల్లో వ‌చ్చేది కాంగ్రెస్ ప్రభుత్వ‌మే!: ఖర్గే

Congress, 5 states,Congress President, Mallikarjun Kharge


విధాత‌: వ‌చ్చే నెల‌లో జ‌రుగ‌బోయే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంద‌ని, త‌మ ప్ర‌భుత్వాలే ఏర్పాట‌వుతాయ‌ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్య‌క్తంచేశారు. బీజేపీ పాలిత మ‌ధ్యప్ర‌దేశ్‌లో వారి పాల‌న‌ ప‌ట్ల ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని తెలిపారు. క‌ర్ణాట‌క‌లోని క‌ల్బూర్గిలో బుధ‌వారం ఖ‌ర్గే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజస్థాన్‌లో తిరిగి అధికారంలోకి వ‌స్తామ‌ని చెప్పారు. అక్క‌డి ప్ర‌భుత్వాలు చాలా చ‌క్క‌గా ప‌నిచేస్తున్నాయ‌ని, ప్ర‌జ‌లు ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవ‌డం లేద‌ని అన్నారు.


కేంద్ర ప్రభుత్వం సీనియర్‌ అధికారులను త‌మ ప్రచారానికి వినియోగించుకోవడం సరికాదని కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే విమ‌ర్శించారు. ఇలా గ‌తంలో ఏ ప్ర‌భుత్వం కూడా అధికారుల‌ను సొంత ప్ర‌చారానికి వాడుకోలేద‌ని చెప్పారు. ఇదే విష‌యాన్ని ప్ర‌ధాని మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లిన‌ట్టు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అడ్డుకోక‌పోతే సీనియ‌ర్ అధికారుల‌ను సొంత ప్ర‌చారానికి వాడుకోవ‌డం భ‌విష్య‌త్తులో మ‌రింత పెరుగుతుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. మీ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు మీ వాలంటీర్ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను వాడుకోవాలి.. కానీ ప్ర‌భుత్వ అధికారుల‌ను కాద‌ని హిత‌వుప‌లికారు.